డ్రైవర్ బాబు ఇంటి దగ్గర కొనసాగుతున్న ఉద్రిక్తత

డ్రైవర్ బాబు ఇంటి దగ్గర కొనసాగుతున్న ఉద్రిక్తత

గుండెపోటుతో  చనిపోయిన  ఆర్టీసీ   డ్రైవర్ బాబు  అంత్యక్రియలపై  హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. నిన్నటి నుంచి బాబు డెడ్  బాడీతో  ఆరేపల్లిలో  ఎంపీ  సంజయ్,  మందకృష్ణ  మాదిగ,  థామస్ రెడ్డి, రాజిరెడ్డి నిరసన  తెలుపుతున్నారు. మరోవైపు  ఆర్టీసీ కార్మికుల నిరసనకు మద్దతుగా  టీజేఎస్  అధ్యక్షుడు  కోదండరామ్.  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని,  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  చాడవెంకట్ రెడ్డి…ఆరెపల్లికి చేరుకున్నారు. డ్రైవర్ బాబు డెడ్ బాడీకి నివాళులర్పించారు. ప్రభుత్వం కార్మికుల  సమస్యలపై  చర్చలు  జరిపే వరకు  బాబు అంత్యక్రియలు  చేసేది  లేదని  స్పష్టం చేశారు.  బాబు మరణమే  చివరిది కావాలన్నారు.  ముఖ్యమంత్రి  కేసీఆర్  వెంటనే  చర్చల ప్రక్రియ  ప్రారంభించాలని  డిమాండ్  చేశారు నేతలు.

మరోవైపు చలో కరీంనగర్ తో  పాటు… బంద్ కు  పిలుపునిచ్చింది జేఏసీ. దీంతో ఆరెపల్లికి భారీగా చేరుకుంటున్నారు ఆర్టీసీ కార్మికులు, ఆల్ పార్టీ నేతలు. అటు బంద్ కు  సంపూర్ణ మద్దతు  ప్రకటించింది  కాంగ్రెస్. సర్కార్ తీరుకు నిరసనగా  బంద్  పాటిస్తామంది  బీజేపీ. జిల్లాలోని  మొత్తం 10 డిపోల  కార్మికులు  నిరసన శిబిరానికి తరలివస్తున్నారు.

నేతల పిలుపుతో బాబు ఇంటి దగ్గర భారీగా మోహిరించారు పోలీసులు. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. మరోవైపు ఆర్టీసీ డ్రైవర్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆరెపల్లికి తరలివస్తున్న వారిని అడ్డుకునేందుకు రోడ్లపై  బారీకేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుపై మండిపడుతున్నారు కార్మికులు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.