డిగ్రీలో క్లస్టర్ విధానం అన్నరు.. సప్పుడు చేయట్లే

డిగ్రీలో క్లస్టర్ విధానం అన్నరు.. సప్పుడు చేయట్లే

హడావుడి చేసి వదిలేసిన హయ్యర్ ఎడ్యుకేషన్
ఇప్పటికే సిటీలోని 9 కాలేజీలను ఎంపిక చేసిన ఆఫీసర్లు 
ఆశగా ఎదురుచూస్తున్న ఆయా కాలేజీల స్టూడెంట్లు 


హైదరాబాద్, వెలుగు:
రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో క్వాలిటీ పెంచేందుకు క్లస్టర్ విధానం తీసుకొస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా ఇంతవరకు అమల్లోకి తేలేదు. పైలట్ ప్రాజెక్టు కింద 9 కాలేజీలను ఎంపిక చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు విధివిధానాలు ప్రకటించలేదు. దీంతో ఈ విధానం అమలవుతుందో లేదోనన్న అనుమానం కలుగుతోంది. న్యూ ఎడ్యుకేషన్ ​పాలసీలో భాగంగా ఈ ఏడాది నుంచి డిగ్రీలో క్లస్టర్ విధానం అమలు చేయాలని 6 నెలల క్రితం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్​లోని 9 అటానమస్ కాలేజీలను ఎంచుకుంది. 2021–22 అకడమిక్ ఇయర్​లో డిగ్రీ సెకండియర్​ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది.
కాలేజీల మధ్య ఎంఓయూ..
హైదరాబాద్​లోని నిజాం కాలేజీ, కోఠి ఉమెన్స్ కాలేజీ, సిటీ కాలేజీ, బేగంపేట ఉమెన్స్, రెడ్డి ఉమెన్స్, సెయింట్‌‌‌‌‌‌‌‌ఆన్స్‌‌‌‌ కాలేజీ (మెహిదీపట్నం), సెయింట్‌‌‌‌‌‌‌‌ఫ్రాన్సిస్‌‌‌‌‌‌‌‌(బేగంపేట), భవన్స్‌‌‌‌‌‌‌‌ కాలేజీ, లయోలా అకాడమీ కాలేజీలను ఓ క్లస్టర్​గా ఏర్పాటు చేశారు. వీటిలోని కాలేజీలు పరస్పరం ఎంఓయూ కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఆయా కాలేజీల స్టూడెంట్లు ఎంచుకున్న సబ్జెక్టు క్లాసులను ఇతర కాలేజీలో వినే అవకాశముంటుంది. ఫ్యాకల్టీ, ల్యాబ్స్, లైబ్రరీ, గ్రౌండ్, క్లాస్ రూమ్స్​ఇలా ఆయా కాలేజీల్లోని ఫెసిలిటీస్​ను ఎంఓయూ చేసుకున్న మరో కాలేజీ యూజ్ చేసుకునే చాన్స్ కూడా ఉంటుంది. అయితే ఇప్పటికీ ఏయే కాలేజీలు ఎంఓయూ చేసుకున్నాయి, ఏయే గ్రూపులను ఎంచుకున్నాయనే వివరాలు బయటకు రాలేదు. ముందు ఈ ప్రాజెక్ట్​పై చాలాసార్లు ఆఫీసర్లతో మీటింగ్​పెట్టి హడావుడి చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తర్వాత పట్టించుకోలేదనే 
విమర్శలు వినిపిస్తున్నాయి. క్లస్టర్ విధానం అమలుకు గైడ్​లైన్స్ ​కోసం కమిటీ కూడా వేశారు. అయినా ఇప్పటికీ అధికారికంగా వాటిని రిలీజ్ చేయలేదు. దీంతో ఆయా కాలేజీల్లో చదవాలనుకునే స్టూడెంట్లకు 6 నెలలుగా ఎదురుచూపులు తప్పట్లేదు. ఉన్నతాధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని  కోరుతున్నారు.

నెలాఖరులో ప్రారంభిస్తం..
డిగ్రీలో క్లస్టర్ విధానం అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించాం.  గైడ్​లైన్స్ రెడీ చేసి, ఎంపిక చేసిన 9 కాలేజీలకు వాటిని అందజేశాం. ఈ నెలాఖరులో క్లస్టర్ విధానాన్ని అధికారికంగా ప్రారంభిస్తం. దీనివల్ల ఎడ్యుకేషన్​లో క్వాలిటీ పెరిగే అవకాశముంది.- ప్రొఫెసర్ లింబాద్రి,  ఉన్నత విద్యామండలి చైర్మన్