హుజూర్​నగర్​లో 85% పోలింగ్​

హుజూర్​నగర్​లో 85% పోలింగ్​
  • 2,36,842 ఓట్లకు 2,00,726 ఓట్లు పోల్‌‌‌‌
  • మందకొడిగా మొదలై ఊపందుకున్న ఓటింగ్‌‌‌‌
  • కొన్ని ప్రాంతాల్లో మొరాయించిన ఈవీఎంలు
  • మఠంపల్లిలోని 7 బూత్‌‌‌‌లలో ఈవీఎం యూనిట్లు ‘రివర్స్‌‌‌‌’
  • సమస్యాత్మక ప్రాంతాల్లో కలెక్టర్‌‌‌‌, ఎస్పీ పర్యటన

హుజూర్‌‌నగర్, వెలుగు:

హుజూర్‌‌నగర్‌‌ ఉపఎన్నిక పోలింగ్‌‌ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా ఓటింగ్‌‌ ప్రశాంతంగా జరిగింది. 84.75 శాతం పోలింగ్‌‌ నమోదైందని రిటర్నింగ్‌‌ అధికారి పి. చంద్రయ్య వెల్లడించారు. 2,36,842 ఓట్లకు 2,00,726 ఓట్లు పోలయ్యాయన్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్‌‌ మందకొడిగా మొదలైనా తర్వాత ఊపందుకుంది. 79 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించిన అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విధుల్లో 2,200 మంది పోలీసులు పాల్గొన్నారు. 28 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో బూత్‌‌లలో 2 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఒక్కట్రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. 2018 సాధారణ ఎన్నికలతో (78.38 శాతం) పోలిస్తే ఓటింగ్‌‌ శాతం పెరిగింది.

మొరాయించిన ఈవీఎంలు

గరిడేపల్లి మండలంలోని 252వ బూత్‌‌లో ఈవీఎం గంటసేపు మొరాయించింది. మేళ్లచెరువు మండల కేంద్రం పంచాయతీ కార్యాలయంలో ఉన్న133వ కేంద్రంలో, చింతలపాలెం మండలం దొండపాడులోని ఉర్దూ స్కూళ్లోని158వ కేంద్రంలోనూ గంట పాటు ఈవీఎంలు పని చేయలేదు. మఠంపల్లి మండలం బిల్యానాయక్ తండాలో కరెంటు లేక పోలింగ్‌‌ అరగంట ఆలస్యమైంది. మఠంపల్లి మండల కేంద్రంలోని 7 బూత్‌‌లలో ఫస్ట్‌‌ ప్లేస్‌‌లలో ఉండాల్సిన బ్యాలెట్ యూనిట్‌‌ను రెండో ప్లేస్‌‌లో పెట్టడంతో ఓటర్లు అయోమయపడ్డారు. గంటసేపటి తర్వాత ఈ విషయాన్ని ఓటేసిన కొందరు కార్యకర్తలు సైదిరెడ్డికి చెప్పడంతో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వాళ్లు దాన్ని సరిచేశారు. చింతలపాలెం మండలం కిష్టాపురంలో ఓ పోలింగ్‌‌ కేంద్రంలోకి కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి వెళ్తుండగా ఆమెతోపాటు కార్యకర్తలు వెళ్లడానికి ప్రయత్నించారు. అధికారులు వారించగా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. వాళ్లకు పద్మావతి నచ్చజెప్పి కేంద్రంలోకి వెళ్లారు.

సమస్యాత్మక కేంద్రాలకు కలెక్టర్‌‌, ఎస్పీ

ఎన్నికల సంఘం గుర్తించిన సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గరిడేపల్లి మండలం పోనుగోడు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ అమయ్‌‌కుమార్‌‌, ఎస్పీ భాస్కరన్‌‌ వేర్వేరుగా పరిశీలించారు. పోలింగ్ సరళిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మఠంపల్లి మండలం గుండ్లపల్లి, మేళ్లచెరువు మండలంలోని కందిబండ, మేళ్లచెరువు, చింతలపాలెం మండలంలోని కిష్టాపురం, తమ్మారం, పీక్లానాయక్ తండ, చింతలపాలెంలోని పోలింగ్ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు.

మండలాల్లో ఓటింగ్‌‌ శాతం

హుజూర్‌‌నగర్‌‌లో 84.09 శాతం, పాలకవీడులో 87.82, గరిడేపల్లిలో 87, నేరేడుచర్లలో 82.23, మఠంపల్లిలో 86.17, మేళ్లచెరువులో 83.28, చింతలపాలెంలో 88.02 శాతం పోలింగ్ నమోదైంది.

Huzurnagar recorded a polling percentage of 84.75%