నేను నపుంసకుణ్ని.. నాకేం తెలియదు

నేను నపుంసకుణ్ని.. నాకేం తెలియదు
  • హాజీపూర్ హత్య కేసుల నిందితుడు శ్రీనివాస్ రెడ్డి
  • కల్పన, శ్రావణి, మనీషా ఎవరో కూడా తెలియదు
  • అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ప్రశ్నలకు శ్రీనివాస్​రెడ్డి ఆన్సర్స్

నల్గొండ టౌన్, వెలుగు:

‘‘నేను నపుంసకుణ్ని. నాకేం తెలియదు. హాజీపూర్ లో జరిగిన హత్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు కల్పన, శ్రావణి, మనీషా ఎవరో కూడా తెలియదు. కనీసం ఆండ్రాయిడ్ ఫోన్ నాతో లేదు. పోలీసులే నాకు ఇంజక్షన్ ఇచ్చి సెమన్ సేకరించారు” అని హాజీపూర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని శుక్రవారం నల్గొండ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు విచారించింది. ముగ్గురు బాలికల హత్యలకు సంబంధించి 101 మంది సాక్ష్యాలను నమోదు చేసుకున్న కోర్టు.. శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించింది. ‘సెల్ ఫోన్ లో బూతు బొమ్మలు చూస్తావా’ అని జడ్జి వీవీ నాథ్ అడిగిన ప్రశ్నకు శ్రీనివాస్ రెడ్డి సమాధానమిస్తూ… కనీసం ఆండ్రాయిడ్ ఫోన్ కూడా తనతో లేదని చెప్పాడు. పోలీసులు బలవంతంగా ఇంజక్షన్ చేసి వీర్యకణాలను స్వీకరించారని.. ఫోరెన్సిక్ నివేదికపై అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు.

వాళ్లు ఎవరో తెలియదు

గ్రామంలో చనిపోయిన అమ్మాయిలు ఎవరో తనకు తెలియదని, వారి కుటుంబ సభ్యులు మాత్రం తనకు పరిచయస్తులేనని శ్రీనివాస్​రెడ్డి సమాధానం చెప్పాడు. తన దగ్గర ఉన్న సిమ్ లపై జడ్జి ప్రశ్నించగా.. మొబైల్ షాప్ లో ఆఫర్లుగా పెట్టిన సిమ్ములను కొనుగోలు చేశానే తప్ప వాటిని వాడలేదని తెలిపాడు. తాను పని చేస్తున్న చోటుకు వచ్చి పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు. దీంతో జడ్జి ‘ఏం పని చేశావు? ఎక్కడ చేశావు? యజమాని ఎవరు?’ అని అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. తన తరఫున సాక్ష్యం కోసం తన తల్లిదండ్రులను, అన్నను పిలిపించాలని జడ్జిని కోరాడు. అడ్రస్ చెబితే వారి నుంచి సాక్ష్యాలు తీసుకునేందుకు పిలిపిస్తామని న్యాయమూర్తి వీవీ నాథ్ తెలిపారు. తర్వాత కేసు విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు.