న్యాయం చేయమంటే చంపాలని చూస్తారా?

న్యాయం చేయమంటే చంపాలని చూస్తారా?
  • నేరెళ్ల బాధితుడు హరీష్ ఇంటిపైకి దూసుకెళ్లిన లారీ
  • బాధితులకు మంత్రి కేటీఆర్ న్యాయం చేయలేదని బీజేపీ నిరసన

తంగళ్లపల్లి, వెలుగు: నేరెళ్ల బాధితులను చంపేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నేరెళ్ల బాధితుడు కోల హరీశ్​ఇంటిమీదకు ఆదివారం రాత్రి ఓ లారీ దూసుకెళ్లింది. బండరాళ్లు అడ్డుగా ఉండడంవల్ల లారీ ఇంటిలోపలిదాకా రాలేదని, లేకుంటే పెద్ద ప్రమాదం జరిగేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అడిగితే మంత్రి కేటీఆర్​ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, తనను హత్య చేసేందుకే లారీని తన ఇంటిమీదకు తోలారని బాధితుడు కోల హరీష్ ఆరోపించారు. ​ ఈ ఘటనపై బీజేపీ సోమవారం ఆందోళనకు దిగింది. 
రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపీ ఆధ్వర్యంలో పార్టీ లీడర్లు సోమవారం నెరేళ్లలోని రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటసేపు ట్రాఫిక్​నిలిచిపోయింది. పోలీసులు వచ్చి సముదాయించినా వినలేదు. డైలీ వందల సంఖ్యలో  ఇసుక లారీలు ఓవర్ లోడుతో వెళ్తుంటే జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని గోపీ మండిపడ్డారు. కేటీఆర్ అండ, ఆఫీసర్ల కనుసన్నల్లో అక్రమ దందా కొనసాగుతోందని ఆరోపించారు. మంత్రి ఇసుకకు ఇస్తున్న ప్రయారిటీ ప్రజల ప్రాణాలకు ఇస్తలేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. గతంలో ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నిస్తే దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఇప్పుడు నేరుగా చంపాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దందా ఆపకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అడిషనల్​ కలెక్టర్ అంజయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని బీజేపీ నాయకులతో మాట్లాడారు. బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని, ఇసుక లారీల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు. అనంతరం తంగళ్ల పల్లి పీఎస్​లో కంప్లైంట్​చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు రమాకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాజు, మండల అధ్యక్షుడు వెంకట్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు వేణు, నాయకులు సందవేని రాజుయాదవ్, సంతోష్, ఆంజనేయులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 

బాధితులు ఆత్మహత్యా యత్నం
బీజేపీ నాయకులు ఆందోళన చేస్తున్న టైంలో బాధితుడు హరీష్, వాళ్ల అమ్మ ఒంటిపై కిరోసిన్​పోసుకుని సూసైడ్​ చేసుకోబోయారు. డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్సై లక్ష్మారెడ్డి వారిని ఆపారు.