హైదరాబాద్ లో కొత్త తరహా చోరీ

హైదరాబాద్ లో కొత్త తరహా చోరీ

హైదరాబాద్ లో కొత్త తరహా చోరీ ఒకటి వెలుగుచూసింది. పక్కా ప్లాన్ ప్రకారం ఇద్దరు యువకులు ఓ వ్యక్తి సెల్ ఫోన్ ను దొంగిలించారు. చోరీ చేసే సమయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడుతూ పని కానిచ్చేశారు. పట్టపగలే నడిరోడ్డుపై ఈ తరహా దొంగతనం ఇప్పుడు గ్రేటర్ పోలీసులకు సవాల్ విసురుతోంది. 

మల్కాజిగిరిలోని యాదవనగర్ లో ఇద్దరు యువకులు పక్కా ప్లాన్ ప్రకారం సెల్ ఫోన్ చోరీకి పాల్పడ్డారు. రెడ్ టీ షర్టు వేసుకున్న వ్యక్తి బండి నడుపుతూ.. కింద పడినట్లు నటిస్తాడు. ఇదే సమయంలో అటువైపు వెళ్తున్న పోస్ట్ మ్యాన్ కృష్ణయ్య కిందపడిపోతున్న (యాక్టింగ్ ) యువకుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడే మరో యువకుడు ఆయన వెనుక నుంచి వచ్చి జేబులో నుంచి సెల్ ఫోన్ చోరీ చేస్తాడు. ఫోన్ తీసే సమయంలో అనుమానం రాకుండా మెల్లగా తీసి, పక్కకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత రెడ్ టీ షర్టు వేసుకున్న వ్యక్తి, సెల్ ఫోన్ దొంగతనం చేసిన వ్యక్తి ఇద్దరూ కలిసి అదే స్కూటీపై వెళ్తారు. 

అక్కడ నుంచి వెళ్లిన తర్వాత బాధితుడు తన ఫోన్ చోరీకి గురైందని తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చోరీకి గురైన సెల్ ఫోన్ విలువ సుమారు రూ. 20వేల వరకూ ఉంటుందని బాధితుడు పోలీసులకు తెలియజేశాడు.