పాలమూరులో పదేండ్లల్ల.. కొత్త ఆయకట్టు రాలే

పాలమూరులో పదేండ్లల్ల.. కొత్త ఆయకట్టు రాలే
  •  ఉమ్మడి మహబూబ్​నగర్​ ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం
  • ‘పాలమూరు-–రంగారెడ్డి’ పనులు 55 శాతమే పూర్తి 
  •  రిజర్వాయర్లు, పంప్​హౌస్​లు, కాలువలు పెండింగే
  • రాజకీయ కారణాలతో ‘కొడంగల్–-నారాయణపేట’ పక్కకు
  • కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా లిఫ్ట్​ స్కీమ్​లకు కాల్వలూ నిర్మించలే
  • ఎల్లూరు పంప్​హౌస్​లో మునిగిన మోటార్లను రిపేర్ చేయించలే
  • చెరువుల కింద సాగునే కొత్త ఆయకట్టుగా తప్పుడు లెక్కలు

మహబూబ్​నగర్, వెలుగు: పాలమూరు ప్రాంత ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్​ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్​నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఓట్ల కోసం పాలమూరు–-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్(పీఆర్ఎల్ఐ) స్కీమ్ ను తెరమీదికి తెచ్చింది. కానీ ఆ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేకపోయింది. కేవలం 55% పనులు చేసి.. రిజర్వాయర్లు, పంప్​హౌస్​లు, ప్రధాన కాలువలు తదితర పనులను అసంపూర్తిగా వదిలేసింది. 

ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం 90% పూర్తి చేసిన పాలమూరు లిఫ్ట్ స్కీమ్​లలో మిగిలిన పది శాతం పనులను కూడా పూర్తి చేయలేదు. 2014లోనే ‘కొడంగల్​-– నారాయణపేట’ స్కీమ్​కు పర్మిషన్లు వచ్చినా.. రాజకీయ కారణాలతో పదేండ్ల పాటు దాన్ని పక్కన పెట్టేసింది.

బీఆర్ఎస్​సర్కారు 2015, జూన్​11న పీఆర్ఎల్ఐ పనులను ప్రారంభించింది. సగం పనులు కూడా చేయకముందే ఓట్ల కోసం అప్పటి సీఎం కేసీఆర్ లిఫ్ట్​-–1 (నార్లాపూర్) వద్ద పంపులను ఆన్​చేసి జాతికి అంకితమిచ్చారు. పనులు పూర్తి కాకపోవడతో ఆ తెల్లారే పంపులు బంద్​చేయాల్సి వచ్చింది. దీని నుంచి లిఫ్ట్–​-2 (ఏదుల రిజర్వాయర్)కు నీళ్లను తరలించేందుకు ఏర్పాటు చేసిన మెయిన్ కెనాల్ పనులు మధ్యలో కిలోమీటరున్నర అసంపూర్తిగా ఉన్నాయి. 

కాంట్రాక్టర్​కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆపేశాడు. లిఫ్ట్​–-1 కింద అంజనగిరి, వడ్డెగుడిసెలు, సున్నపుతండాల్లో110 నిర్వాసిత కుటుంబాలుండగా.. వీరికి ఆర్ అండ్ ఆర్​ప్యాకేజీని వర్తింపజేయకపోవడంతో ఊర్లను ఖాళీ చేయలేదు. రిజర్వాయర్ కింద దాదాపు వంద ఎకరాల భూ సేకరణ ఇంకా మిగిలే ఉంది. ఏదుల రిజర్వాయర్ పనులు పూర్తయినా బండరావిపాకుల, కొంకన్​పల్లి గ్రామాల్లోన్ని 1,600 కుటుంబాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. వీరికి ప్లాట్లు కేటాయించినా ఇండ్లు కట్టివ్వలేదు.

 ఈ రిజర్వాయర్​ కింద ఇండ్లు, పొలాలకు మాత్రమే పరిహారం ఇవ్వగా, ఖాళీ జాగాలు, ప్లాట్లకు పరిహారం చెల్లించాలని ముంపు బాధితులు డిమాండ్​ చేస్తున్నారు. లిఫ్ట్​-–3 (వట్టెం) మెయిన్​కెనాల్, వట్టెం రిజర్వాయర్, పంప్​హౌస్, వట్టెం- కర్వెన (లిఫ్ట్​-–4) మెయిన్​కెనాల్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కర్వెన నుంచి ఉదండాపూర్ (లిఫ్ట్–​-5) రిజర్వాయర్​వరకు18 కిలోమీటర్ల మేర అండర్ టన్నెల్​పనులు చేయాల్సి ఉండగా, కొంత దూరమే పూర్తి చేశారు. ఉదండాపూర్​కింద 16వ ప్యాకేజీలో పంప్​హౌస్ పనులు పెండింగ్​లోనే ఉన్నాయి. 

17, 18వ ప్యాకేజీల్లో ఇప్పటి వరకు కట్ట పనులు 25 శాతమే చేశారు. 18వ ప్యాకేజీలో రెండున్నర కిలోమీటర్ల మేర చేయాల్సిన కట్ట పనులు ఎన్నికలకు ముందు ప్రారంభించారు. 18వ ప్యాకేజీలో నిర్మించాల్సిన మెయిన్​ కెనాల్స్​పనులు ఎన్నికలకు ముందు స్టార్ట్ చేశారు. రిజర్వాయర్ కింద ఆర్ అండ్ ఆర్​ ప్యాకేజీ సమస్యను పరిష్కరించలేదు. రిజర్వాయర్​కు 60 మంది రైతుల నుంచి దాదాపు 200 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. వీరు భూ సేకరణ చట్టం–-2013 ప్రకారం పరిహారం ఇవ్వాలని 2018లో కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీంతో భూ సేకరణ ఆగిపోయింది.

రెండో దశలో కాల్వలకు తట్టెడు మట్టెత్తలే

పీఆర్ఎల్ఐ రెండో దశ పనులు ముందుకు పడలేదు. రెండో దశ కింద వట్టెం, కర్వెన, ఉదండపూర్ రిజర్వాయర్ల నుంచి కెనాల్స్​ నిర్మించాల్సి ఉండగా,  దాదాపు 27 వేల ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖంగా లేరని తెలిసింది. ప్రధానంగా ఉదండాపూర్​ సౌత్ మెయిన్​ కెనాల్ ​ద్వారా (25 కిలోమీటర్లు) 30 వేల ఎకరాలు, రైట్​కెనాల్-1 (4.60 కి.మీ) ద్వారా 9 వేల ఎకరాలు, రైట్​కెనాల్​-2 (72 కి.మీ.) ద్వారా 1.42 లక్షల ఎకరాలకు, హన్వాడ కెనాల్ (23 కి.మీ) ద్వారా 27 వేల ఎకరాలకు, కర్వెన లోలెవల్ కెనాల్ (36 కి.మీ.) ద్వారా 31 వేలు, హై లెవల్ కెనాల్ (108 కి.మీ) ద్వారా 1.51 లక్షల ఎకరాలు, వట్టెం లోలెవల్ కెనాల్ (21 కి.మీ.) ద్వారా 16 వేలు, మెయిన్ కెనాల్​ద్వారా (152 కి.మీ.) 1.17 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా డిజైన్ చేశారు. కానీ, ఇంత వరకు కెనాల్స్​పనుల్లో తట్టెడు మట్టిని కూడా ఎత్తలేదు.

  • జలయజ్ఞం స్కీమ్​లన్ని పక్కన పెట్టిన్రు

జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్​ హయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటిని అందించేందుకు జూరాల, శ్రీశైలం బ్యాక్​ వాటర్ ఆధారంగా మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​(ఎంజీకేఎల్​ఐ) నెట్టెంపాడు, రాజీవ్ భీమా స్కీమ్​లను ఏర్పాటు చేశారు. కోయిల్ సాగర్ కెపాసిటీని పెంచి, అదనపు ఆయకట్టుకు నీటిని అందించేలా కెనాల్స్ డిజైన్ చేశారు. 2014 నాటికి ఈ స్కీముల్లో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. 

తర్వాత అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వ పెద్దలు ఈ స్కీములను గాలికొదిలేశారు. మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం ఎంజీకేఎల్ఐలోని 28వ ప్యాకేజీ కింద కొల్లాపూర్ నియోజక వర్గంలోని కోడేరు, పెద్దకొత్తపల్లి ప్రాంతాలకు నీరందడం లేదు. 29 ప్యాకేజీ కింద 58 కిలోమీటర్ల మేరకు కెనాల్స్​పనులు పెండింగ్​లో ఉన్నాయి. 30వ ప్యాకేజీ కింద 23 కిలోమీటర్ల మేర కెనాల్స్​పనులు చేయాల్సి ఉంది. 

2020 ఆగస్టులో కృష్ణానదికి వచ్చిన వరదలతో ఎంజీకేఎల్ఐలోని లిఫ్ట్​-–1 మునిగిపోయింది. ఐదు మోటార్లకు మూడు మోటార్లు పూర్తిగా డ్యామేజ్​అయ్యాయి. ఐదో పంపు వద్ద రంధ్రం పడింది. ఇంత వరకు వాటికి రిపేర్లు చేయలేదు. మిగిలిన1, 2, 4 పంపులతోనే స్కీమును నడిపిస్తున్నారు. నెట్టెంపాడు కింద మెయిన్​కెనాల్, పిల్ల కాలువల పనులు పెండింగ్​లో ఉన్నాయి. మూడేండ్ల కింద ర్యాలంపాడు రిజర్వాయర్​కు పడిన బుంగకు ఇంకా రిపేర్లు చేయలేదు. 

కోయిల్​సాగర్​ రైట్​మెయిన్ కెనాల్​పనులు పెండింగ్​లో ఉన్నాయి. 2014 నుంచి డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువల పనులు చేయలేదు. రాజీవ్ భీమా కింద సంగంబండ రిజర్వాయర్ పరిధిలో ముంపు బాధితులకు రూ.13 కోట్ల పరిహారం చెల్లింపుపెండింగ్​లో ఉంది. లో లెవల్​కెనాల్​పనుల్లో 400 మీటర్ల బండరాయి అడ్డుగా ఉంది. ఈ పనులు ఎనిమిదేండ్లుగా పెండింగ్​లో ఉన్నాయి. భూత్పూర్​రిజర్వాయర్ కింద రాజుపల్లి, నర్వ, రాంపూర్, లంకాల గ్రామాలకు వెళ్లే కెనాల్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.

ప్రభుత్వం మారిన తర్వాత జీవో 69పై కదలిక

జీవో 69 ద్వారా ‘కొడంగల్​-నారాయణపేట’ స్కీమ్​కు మే 23, 2014న ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ, రాజకీయ కారణాలతో గత ప్రభుత్వం పదేండ్లు ఈ ప్రాజెక్టును టేకప్ చేయలేదు. తెలంగాణ రాక ముందు  ప్రస్తుత సీఎం ఎనుముల రేవంత్​రెడ్డి ఈ స్కీమును సాధించుకున్నారనే అక్కసుతో స్కీమును పక్కకు పెట్టింది. ఈ స్కీం ద్వారా నారాయణపేట, మక్తల్, కొడంగల్​నియోజకవర్గాలకు సాగునీరందించాల్సి ఉండగా, పీఆర్ఎల్ఐ ద్వారా అందిస్తామని గత ప్రభుత్వం కాలయాపన చేసింది. చివరకు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ స్కీమ్ ఏర్పాటుకు బీజం పడింది.ఇటీవల ఈ స్కీమును టేకప్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,945 కోట్లు మంజూరు చేస్తూ అనుమతులు జారీ చేసింది.

పెద్దల భూముల కోసం రిజర్వాయర్ హోల్డ్

పీఆర్ఎల్ఐ కింద 2.80 టీఎంసీలతో నిర్మించాల్సిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​ను గత ప్రభుత్వం పూర్తిగా పక్కకు పెట్టింది. పీఆర్ఎల్ఐ ద్వారా మొత్తం 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. ఇందులో కేవలం లక్ష్మీదేవిపల్లి ద్వారానే 4.13 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉంది. దీనికి గత ప్రభుత్వం భూమిని సేకరించలేదు. కనీసం టెండర్లను కూడా ఆహ్వానించలేదు. రిజర్వాయర్ నిర్మించే ప్రాంతం షాద్​నగర్ నియోజకవర్గంలోని చౌదరిగూడ మండలంలో ఉండగా, ఇక్కడ ఎకరా భూమి కోటి పలుకుతున్నది. ఈ భూములన్ని రాజకీయ నాయకులు, సినీ పెద్దలు, ఇతర ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులవి కావడంతో భూ సేకరణ చేయలేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని హోల్డ్​లో పెట్టి, ఉదండాపూర్ నుంచి కాల్వల ద్వారా 4.13 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్లాన్ చేశారు.

చెరువుల కిందనే సాగు..

ఏండ్లుగా ఉమ్మడి జిల్లాలో చెరువుల ఆధారంగానే రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్​నగర్​లో 1,265 చెరువులు, నాగర్​కర్నూలో 1,762, నారాయణపేటలో 890, గద్వాలలో 204, వపపర్తిలో 1,040 చెరువులున్నాయి. ఉమ్మడి జిల్లాలో 18.46 లక్షల ఎకరాల్లో సాగు యోగ్యమైన భూమి ఉండగా, అందులో చెరువుల కిందనే 7,74,150 ఎకరాల ఆయకట్టు ఉంది. యాసంగి పంటలు మొత్తం చెరువులు,
వాటి పరిధిలో ఉన్న బోర్ల ఆధారంగానే పంటలు సాగవుతున్నాయి.