అన్నీఅర్హతలున్నా సర్కార్ స్కీమ్ ల కోసం ఎదురు చూసుడే.!

అన్నీఅర్హతలున్నా సర్కార్ స్కీమ్ ల కోసం ఎదురు చూసుడే.!
  • ఆసరా, రేషన్​కార్డులు, కల్యాణలక్ష్మి సాయం కోసం నిరీక్షణ
  • ఏడాదిన్నరగా కొత్తగా ఎవరికీ శాంక్షన్​ చేయట్లే..
  • ఫీజు రీయింబర్స్​మెంట్ అందక స్టూడెంట్లకు ఇబ్బందులు
  • సంక్షేమ పథకాల అమలు గాడి తప్పుతోందన్న విమర్శలు

హైదరాబాద్, వెలుగుఆసరా పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, హెచ్‌ఐవీ బాధితులకు సర్కారు ప్రతి నెలా పెన్షన్లు ఇస్తోంది. తొమ్మిది రకాల కేటగిరీలు కలిపి రాష్ట్రంలో మొత్తం 39.41 లక్షల మందికి పెన్షన్​ అందుతోంది. ఇందుకోసం సర్కారు బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. దివ్యాంగులకు నెలకు రూ.3,016, మిగతావారికి రూ.2,016 చొప్పున పెన్షన్​ అందిస్తున్నారు. ప్రస్తుతం రూల్స్​ ప్రకారం పేద కుటుంబాల్లో 65 ఏండ్లు దాటినవారికి, 50 ఏండ్లు దాటిన చేనేత, కల్లు గీత, బీడీ కార్మికులకు, భర్త చనిపోయిన మహిళలకు, దివ్యాంగులకు పెన్షన్​ ఇస్తారు. అయితే 2018 డిసెంబర్​ తర్వాత రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు ఆగిపోయింది. అప్పటి నుంచీ చాలా మంది పేదల వయసు 65 ఏండ్లు దాటింది. చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులు, వితంతువుల కేటగిరీల్లోనూ చాలా మంది ఆసరా కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు 2 లక్షల 81 వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి లక్షా 20 వేల మందిని అర్హులుగా గుర్తించింది.

కానీ ఏ ఒక్కరికీ మంజూరు చేయలేదు. దీంతో ఊర్లలోకి వస్తున్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను జనం నిలదీస్తున్నారు. పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తరని అడుగుతున్నారు. తాను ఏ ఊరికి వెళ్లినా తమకు పెన్షన్​ఏమైందనే ప్రశ్నలే వస్తున్నాయని ఉమ్మడి వరంగల్​ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వాపోయారు.

దివ్యాంగులకు ఎన్నాళ్లీ ఇబ్బందులు?

  • రాష్ట్ర సర్కారు దివ్యాంగుల పెన్షన్‌‌ మొత్తాన్ని రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచిన నేపథ్యంలో చాలా మంది కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. అర్హులను తేల్చేందుకు సదరం క్యాంపులను నిర్వహించాల్సి ఉంది. వాటి కోసం విజ్ఞప్తులు వస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన ఉండడం లేదు.
  • కేంద్రం కొత్తగా అమల్లోకి తెచ్చిన దివ్యాంగుల (వికలాంగుల) చట్టం తెలంగాణ రాష్ట్రంలో 2017 ఏప్రిల్‌‌ 19 నుంచి అమలులోకి వచ్చింది. పాత చట్టం ప్రకారం వికలాంగుల కేటగిరీలు 7 రకాలుగా ఉండేవి. కొత్త చట్టంతో ఆ కేటగిరీల సంఖ్య 21కి పెరిగింది.
  • పెరిగిన కేటగిరీలకు అనుగుణంగా సదరం సాఫ్ట్‌‌ వేర్‌‌ ను మార్చాల్సి ఉంది. క్యాంపుల నిర్వహణ, సాఫ్ట్‌‌ వేర్‌‌ మార్పు కోసం నిధులు అవసరం. సదరం క్యాంపుల్లో రద్దీని నియంత్రించేందుకు వీలుగా ఆన్‌‌ లైన్‌‌ విధానం అమలు చేయాల్సి ఉంది. మీ-సేవ ద్వారా అప్లికేషన్లు తీసుకుని, పరిశీలన అనంతరం ఆన్‌‌ లైన్‌‌లోనే సర్టిఫికెట్లను జారీ చేసేలా మార్పులు చేయాల్సి ఉంది. సదరం సాఫ్ట్‌‌వేర్, డాటా నిర్వహణ వ్యవహారాలను హెల్త్​ డిపార్ట్​మెంట్​కు బదిలీ చేసే అంశంపై సర్కారు ఇంకా విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

రీయింబర్స్​మెంట్ వస్తలేదు

పేద స్టూడెంట్ల చదువులకోసం ఉద్దేశించిన ఫీజు రీయింబర్స్​మెంట్​స్కీం కూడా సరిగా అమలు కావడం లేదు. రాష్ట్ర సర్కారు వెంట వెంటనే ఫీజులు చెల్లించకపోతుండడంతో స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఫీజులు కట్టాలంటూ కాలేజీల మేనేజ్​మెంట్లు ఒత్తిడి చేస్తుండడంతో కొందరు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్​మెంట్​​ బకాయిలు రూ.1,500 కోట్ల వరకు ఉన్నాయి. 2019–20 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్​మెంట్​ మొత్తం రూ.2,202 కోట్లయితే.. రూ.1,500 కోట్లు పెండింగ్​లోనే ఉన్నాయి. వాస్తవానికి స్కాలర్‌‌ షిప్‌‌లు, ఫీజు రీయంబర్స్‌‌మెంట్‌‌ కోసం అకడమిక్​ ఇయర్​ మొదట్లోనే స్టూడెంట్ల నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు. అర్హులని తేలితే వెంటనే 25 శాతం ఫీజు రీయంబర్స్‌‌మెంట్‌‌ ఇవ్వాలి. 50 శాతం అకడమిక్​ ఇయర్​ మధ్యలో, మిగతా మొత్తాన్ని చివర్లో చెల్లించాలి. కానీ అకడమిక్​ ఇయర్​ పూర్తయిపోయినా అప్లికేషన్ల పరిశీలన పూర్తి కాలేదు. ఫీజు రీయింబర్స్​మెంట్​ కోసం 13.65 లక్షల దరఖాస్తులురాగా.. 75 శాతమే పరిశీలించారు.

కల్యాణలక్ష్మి సాయమేది?

పెండ్లి ఖర్చు పేద కుటుంబాలకు భారం కావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ పథకాలను ప్రవేశపెట్టినట్టు ప్రకటించింది. పేద కుటుంబాల్లోని ఆడ బిడ్డల పెండ్లికి రూ.లక్షా నూట పదహార్లు ఆర్థిక సాయం చేస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.08 లక్షల కల్యాణలక్ష్మి దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్​తో ఇటీవల పెండ్లిళ్ల సంఖ్య తగ్గిపోయినా.. గత ఏడాది (2019–20) దరఖాస్తులు 70 వేలు, 2018–19 ఏడాది అప్లికేషన్లు 10 వేల వరకు పెండింగ్​లో ఉన్నాయి. మొత్తంగా ప్రభుత్వం రూ.1,‌‌‌‌081 కోట్లు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉంది.

 పొరుగు రాష్ట్రాల్లో లక్షల్లో కరోనా టెస్టులు..ఇక్కడ వేలల్లోనే