ఉప్పల్‌లో పరుగుల సునామీ పక్కా.. ఆ ఇద్దరిపైనే భారీ అంచనాలు, టీమిండియా 300 కొట్టేనా?

ఉప్పల్‌లో పరుగుల సునామీ పక్కా.. ఆ ఇద్దరిపైనే భారీ అంచనాలు, టీమిండియా 300 కొట్టేనా?

IND vs WI 4th T20: భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మరో హై-వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొలి మూడు మ్యాచ్‌లలో రెండు టీమ్స్ హోరాహోరీగా తలపడగా.. మూడో టీ20లో గెలిచిన టీమిండియా 2–1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇప్పుడు సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) వేదికగా రేపు (అక్టోబర్ 14,2026 బుధవారం) నాలుగో టీ20 సమరానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో మరోసారి బ్యాటర్లు పండగ చేసుకోవడం ఖాయంగా కనోస్తోంది. హైదరాబాద్‌ పిచ్‌ రిపోర్ట్, సన్ రైజర్స్ ఆటగాళ్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఉప్పల్ పిచ్ రిపోర్ట్: 

* హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది.

* బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్: ఈ పిచ్‌పై బంతి బ్యాట్‌పైకి చాలా చక్కగా వస్తుంది. పిచ్‌లో పెద్దగా బౌన్స్ లేకపోవడంతో బ్యాటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగారు షాట్లు ఆడవచ్చు.

* భారీ స్కోర్లు ఫిక్స్: ఐపీఎల్‌ మ్యాచ్‌లలో ఉప్పల్ వేదికగా బ్యాటర్లు ఎలా పరుగుల వరద పారించేవారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. క్రీజులో కుదురుకున్న బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలరు.

* బౌలర్లకు నరకం: ఫ్లాట్ వికెట్ కావడంతో బౌలర్లకు ఈ మ్యాచ్ మరోసారి పీడకలగా మారనుంది. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు వైవిధ్యమైన బంతులు వేస్తేనే రన్స్ ఆపవచ్చు. కొత్త బంతితో పేసర్లు స్వింగ్, బౌన్స్ రాబట్టగలిగితేనే వికెట్లు దొరుకుతాయి. 

అందరి చూపు అభిషేక్, ఇషాన్ పైనే: 

హైదరాబాద్‌లో మ్యాచ్ అనగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ టక్కున గుర్తుకు వస్తారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ (SRH) తరఫున ఆడుతున్న వీరిద్దరికీ ఉప్పల్ పిచ్ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ఈ మైదానంలో వీరు ఎన్నో బిగ్ ఇన్నింగ్స్ ఆడిన అనుభవం ఉండటంతో, విండీస్ బౌలర్లు ఈ ఇద్దర్నీ ఎలా కట్టడి చేస్తారనేది అతి పెద్ద ప్రశ్న. ప్రస్తుతం కిరాక్ ఫామ్‌లో ఉన్న ఈ బ్యాటర్లు ఇద్దరూ చెలరేగితే.. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 300 పరుగుల మార్క్‌ను తాకడానికీ ఛాన్స్ ఉందని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు.