ఈ నెల31న ముంబైలో.. ఇండియా కూటమి భేటీ

ఈ నెల31న ముంబైలో..   ఇండియా కూటమి భేటీ
  • రెండు రోజుల పాటు సమావేశం
  • అశోక చక్రం లేని మూడు రంగుల జెండాతో జనంలోకి!
  • సెప్టెంబర్ నుంచి దేశ వ్యాప్తంగా ర్యాలీలకు ప్లాన్
  • హాజరుకానున్న బీజేపీయేతరరాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు 

న్యూఢిల్లీ: ఎన్డీఏ ఓటమే లక్ష్యంగా విపక్ష కూటమి ‘ఇండియా’ మరో భేటీకి రెడీ అవుతున్నది. 31వ తేదీన ముంబై వేదికగా అపోజిషన్ పార్టీల లీడర్లంతా సమావేశం కానున్నారు. ఈ భేటీకి కాంగ్రెస్ సీనియర్ లీడర్ సోనియా గాంధీ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆగస్ట్ 31 సాయంత్రం అనధికారిక సమావేశం, సెప్టెంబర్ 1న అధికారిక సమావేశం నిర్వహించనున్నారు.ప్రధానంగా కూటమి లోగోపై చర్చిస్తారని తెలిసింది. అశోక చక్రంలేని మూడు రంగుల జెండాను కూటమి ఫ్లాగ్​గా ఉంచాలనే ప్రతిపాదనపై అపోజిషన్ పార్టీ లీడర్లు తమ అభిప్రాయాలు తెలియజేయనున్నారు. 

ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్(ఇండియా) లోగో ఫైనల్ చేసి ముంబైలో జరిగే కూటమి మూడో ఉమ్మడి సమావేశంలోనే ఆవిష్కరించే చాన్స్ కూడా ఉంది. ఇప్పటికే 26 పార్టీలతో కూడిన ‘ఇండియా’ కూటమి జూన్​లో పాట్నాలో, జూలై మధ్యలో బెంగళూరులో భేటీ అయింది. ప్రతిపక్షాల్లోనే అన్ని పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో ఏ సభ, సమావేశం, ర్యాలీ జరిగినా.. కామన్ ఫ్లాగ్​ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేయాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఎన్నికల్లో మాత్రం తమ పార్టీ సింబల్స్ తోనే బరిలో ఉండనున్నాయి.  

ప్రభుత్వ విధానాలే టార్గెట్

ముంబై మీటింగ్ తర్వాత సెప్టెంబర్​లో దేశ వ్యాప్తంగా ర్యాలీలు ప్రారంభించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఇందులో బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలతో పాటు ఆరు నుంచి ఏడుగురు కీలక నేతలు పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు కూటమి వర్గాలు తెలిపాయి. ఈ ర్యాలీలు, సమావేశాల్లో ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు కాకుండా.. ప్రభుత్వ విధానాలు, కుల ఆధారిత జనాభా లెక్కలు, ఇన్​ఫ్లేషన్, నిరుద్యోగం, ఈశాన్య రాష్ట్రాల్లో హింస వంటి కీలక అంశాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేయాలని నిర్ణయించాయి. 

కూటమికి చైర్మన్, చీఫ్ కో ఆర్డినేటర్, రీజినల్ కో ఆర్డినేటర్స్ నియమించే ప్రతిపాదనపైనా ముంబై భేటీలో చర్చించే అవకాశాలున్నాయి. ఒడిశా, తెలంగాణ, ఏపీ మినహా అన్ని రాష్ట్రాల్లో 450 పార్లమెంట్ స్థానాలను కూటమి గుర్తించింది. 2024 లోక్​సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించింది. యూపీలో 40 సీట్లు తమకు కేటాయించాలన్న బీఎస్పీ డిమాండ్​ పైనా చర్చించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కూటమిలో మరిన్ని చిన్న చిన్న పార్టీలను చేర్చుకోవడంపై కూడా ఈ సమావేశంలో డిస్కస్ చేయనున్నారు.