బుమ్రా,ధవన్ ఆగయా

బుమ్రా,ధవన్ ఆగయా

పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్లకుండా.. భారీ మార్పులు లేకుండా.. కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చే దిశగా.. రాబోయే రెండు సిరీస్‌‌ల కోసం టీమిండియాను ప్రకటించారు..! అనుకున్నట్లుగానే బుమ్రా- ద్రవిడ్‌‌ వివాదానికి ఫుల్‌‌స్టాప్‌‌ పెట్టేసి స్టార్‌‌ పేసర్‌‌ను రెండు టీమ్‌‌ల్లోకి ఎంపిక చేసిన సెలెక్టర్లు.. లంకతో టీ20 సిరీస్‌‌కు రోహిత్‌‌, షమీకి విశ్రాంతి ఇచ్చారు..! అయితే రైజింగ్‌‌ పేసర్‌‌ దీపక్‌‌ చహర్‌‌.. ఐపీఎల్‌‌ వరకు అందుబాటులో ఉండకపోవడం ఒక్కటే నిరాశ కలిగించే అంశం..! మొత్తానికి యంగ్‌‌, ఎక్స్‌‌పీరియెన్స్‌‌ ప్లేయర్లతో టీమ్‌‌ను ఎంపిక చేసిన ఎమ్మెస్కే ప్రసాద్‌‌.. తన సెలెక్టర్‌‌ ప్రస్థానాన్ని ముగించాడు..!!

న్యూఢిల్లీ:

శ్రీలంకతో టీ20, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌‌కు టీమిండియా జట్లను సెలెక్షన్‌‌ కమిటీ సోమవారం ప్రకటించింది. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న స్పీడ్‌‌స్టర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా.. రెండు టీమ్‌‌ల్లో చోటు దక్కించుకున్నాడు. అయితే బుమ్రా మ్యాచ్‌‌ ఫిట్‌‌నెస్‌‌తో ఉన్నాడా? లేడా? అనే అంశంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. నేషనల్‌‌ క్రికెట్‌‌ అకాడమీ (ఎన్‌‌సీఏ) చీఫ్‌‌ రాహుల్‌‌ ద్రవిడ్‌‌.. బుమ్రా ఫిట్‌‌నెస్‌‌ను అంచనా వేయడానికి నిరాకరించడంతో టీమిండియా ఫిజియో నితిన్‌‌ పటేల్‌‌.. పేసర్‌‌కు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చాడు. సూరత్‌‌లో గుజరాత్‌‌ ఆడే రంజీ ట్రోఫీ మ్యాచ్‌‌లో బుమ్రా ఫిట్‌‌నెస్‌‌ను ఫిజియో పరీక్షించే అవకాశాలున్నాయి. సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టోర్నీలో మొకాలి గాయానికి గురైన ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ మళ్లీ టీమ్‌‌లో స్థానం సంపాదించాడు. రెండు సిరీస్‌‌లకు శిఖర్‌‌ అందుబాటులో ఉండనున్నాడు. అయితే వర్క్‌‌లోడ్‌‌ కారణంగా వైస్‌‌ కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ, పేసర్‌‌ మహ్మద్‌‌ షమీకి విశ్రాంతి కల్పించారు. లంకతో టీ20 సిరీస్‌‌కు ఈ ఇద్దరూ అందుబాటులో ఉండరు. దీంతో రోహిత్‌‌ స్థానంలో బ్యాకప్‌‌ ఓపెనర్‌‌గా సంజూ శాంసన్‌‌ను టీమ్‌‌లోకి తీసుకున్నారు. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్‌‌ 47 మ్యాచ్‌‌లు ఆడాడు. కెప్టెన్‌‌ విరాట్‌‌తో పోలిస్తే మూడు మ్యాచ్‌‌లు ఎక్కువ.

ఐపీఎల్​ దాకా చహర్‌‌ ఔట్‌‌..!

రైజింగ్‌‌ పేసర్‌‌ దీపక్‌‌ చహర్‌‌.. ఐపీఎల్‌‌ వరకు ఆడే చాన్సెస్‌‌ లేవు. విజయ్‌‌ హజారే ట్రోఫీలో బాగా ఆడిన దీపక్‌‌.. విశాఖలో రెండో వన్డే సందర్భంగా అకస్మాత్తుగా వెన్ను గాయానికి గురయ్యాడు. దీంతో నొప్పి నుంచి కోలుకోవడానికి సమయం పట్టే అవకాశాలు ఉండటంతో అతన్ని పరిగణనలోకి తీసుకోలేదు. మరో పేసర్‌‌ భువనేశ్వర్‌‌.. స్పోర్ట్స్‌‌ హెర్నియాతో బాధపడుతున్నాడు. ప్రస్తుతానికి ఈ ఇద్దరి గాయాలపై పెద్దగా ఆందోళన అవసరం లేదని ఎమ్మెస్కే అన్నాడు. చహర్‌‌ లేకపోవడంతో నవ్‌‌దీప్‌‌ సైనీ టీమ్‌‌తో పాటు కొనసాగుతాడన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌‌కు ముగ్గురు ఓపెనర్లు రోహిత్‌‌, రాహుల్‌‌, ధవన్‌‌ అందుబాటులో ఉంటారని చెప్పాడు. అయితే క్లిష్టమైన న్యూజిలాండ్‌‌ టూర్‌‌ నేపథ్యంలో.. యంగ్‌‌ స్టార్‌‌ పృథ్వీ షాను ఇండియా–ఎ జట్టుతో  ముందుగానే అక్కడికి పంపిస్తున్నారు. ఎనిమిది నెలల డోపింగ్‌‌ నిషేధం తర్వాత మళ్లీ బ్యాట్‌‌ పట్టిన పృథ్వీ రంజీ మ్యాచ్‌‌లో డబుల్‌‌ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.

పాండ్యాకు టైమ్‌‌ పట్టొచ్చు..

వెన్ను నొప్పికి ఆపరేషన్‌‌ చేయించుకున్న ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా కోలుకోవడానికి మరికాస్త టైమ్‌‌ పట్టొచ్చు. ప్రస్తుతం ట్రెయినింగ్‌‌ స్టార్ట్‌‌ చేసిన పాండ్యా.. బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌ ప్రాక్టీస్‌‌ మొదలుపెట్టలేదు. దీంతో జనవరి మూడో వారంలో పాండ్యా టీమిండియాకు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే కివీస్‌‌ టూర్‌‌ మధ్యలో టీమ్‌‌తో జాయిన్‌‌ కావొచ్చు. వన్డే వరల్డ్‌‌ కప్‌‌ నుంచి ఆటకు దూరంగా ఉన్న మాజీ కెప్టెన్‌‌ ధోనీ.. సెలెక్షన్‌‌కు అందుబాటులో ఉండే అంశంపై ప్రసాద్‌‌ పెద్దగా స్పందించలేదు. దీనిపై తాను కామెంట్‌‌ చేయలేనన్నాడు. అయితే మహీ సెలెక్షన్‌‌కు అందుబాటులో ఉండాలంటే ముందుగా క్రికెట్‌‌ ఆడాలని సూచించాడు. ఇప్పుడు ఎంపిక చేసిన జట్లలో శార్దూల్‌‌ ఠాకూర్‌‌ స్వింగ్‌‌ బౌలర్‌‌గా సేవలందిస్తాడని చీఫ్‌‌ సెలెక్టర్‌‌ స్పష్టం చేశాడు. శార్దూల్‌‌ డీసెంట్‌‌ పేస్‌‌తో బాల్‌‌ను రెండు వైపుల స్వింగ్‌‌ చేస్తున్నాడని కితాబిచ్చాడు. ‘మెయిన్‌‌ టీమ్‌‌కు అవసరమైనంత వరకు మేం బ్యాకప్‌‌ను సిద్ధంగా ఉంచాం. నైపుణ్యం ఉన్న ఫాస్ట్‌‌ బౌలర్లు మనకు అందుబాటులో ఉన్నారు. రంజీల్లో ఆడుతున్న ఖలీల్‌‌ కూడా రేసులో ఉన్నాడు. ఇప్పటికైతే టీ20ల్లో షమీ స్థానంలో సైనీని తీసుకున్నాం. రాబోయే రోజుల్లో అవసరమైతే మరింత మంది అందుబాటులోకి వస్తారు’ అని తన చివరి సెలెక్షన్‌‌ కమిటీ సమావేశంలో ప్రసాద్‌‌ వ్యాఖ్యానించాడు.  వచ్చే ఏడాది జనవరి 5 నుంచి శ్రీలంకతో మూడు టీ20లు ఆడనున్న టీమిండియా.. 14 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్‌‌ల్లో తలపడనుంది.

శ్రీలంకతో టీ20 సిరీస్‌‌ టీమ్‌‌: కోహ్లీ (కెప్టెన్‌‌), ధవన్‌‌, రాహుల్‌‌, శ్రేయస్‌‌, రిషబ్‌‌ పంత్‌‌, జడేజా, శివమ్‌‌ దూబే, చహల్‌‌, కుల్దీప్‌‌, బుమ్రా, నవ్‌‌దీప్‌‌ సైనీ, శార్దూల్‌‌ ఠాకూర్‌‌, మనీష్‌‌ పాండే, వాషింగ్టన్‌‌ సుందర్‌‌, సంజూ శాంసన్‌‌.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌‌ జట్టు: కోహ్లీ (కెప్టెన్‌‌), ధవన్‌‌, రోహిత్‌‌, రాహుల్‌‌, శ్రేయస్‌‌, మనీష్‌‌ పాండే, రిషబ్‌‌ పంత్‌‌, కేదార్‌‌ జాదవ్‌‌, శివమ్‌‌ దూబే, జడేజా, కుల్దీప్‌‌, చహల్‌‌, నవ్‌‌దీప్‌‌ సైనీ, శార్దూల్‌‌ ఠాకూర్‌‌, బుమ్రా, షమీ. పంత్‌‌కు కోచ్‌‌గా మోరే

పేలవమైన వికెట్‌‌ కీపింగ్‌‌తో జట్టును ఇబ్బందిపెడుతున్న రిషబ్‌‌ పంత్‌‌ను గాడిలో పెట్టేందుకు ఓ స్పెషలిస్ట్‌‌ కోచ్‌‌ను నియమిస్తున్నామని ఎమ్మెస్కే తెలిపాడు. కీపింగ్‌‌ను మెరుగుపర్చుకునేందుకు మాజీ కీపర్‌‌ కిరణ్‌‌ మోరేతో కలిసి పంత్‌‌ పని చేయనున్నాడు. ‘పంత్‌‌ కీపింగ్‌‌ స్కిల్స్‌‌ ఇంకా మెరుగుపడాలి. ఇందుకోసం మోరేను నియమిస్తున్నాం. అతని ఆధ్వర్యంలో మరింత మెరుగవుతాడని ఆశిస్తున్నాం’ అని ప్రసాద్‌‌ పేర్కొన్నాడు. ధోనీ, సాహాతో పోల్చుకుని రిషబ్‌‌ ఒత్తిడి పెంచుకుంటున్నాడని గతంలో చెప్పిన మోరే.. కీపింగ్‌‌ ఒత్తిడితో బ్యాటింగ్‌‌లోనూ విఫలమవుతున్న పంత్‌‌ను ఎంత మేరకు తీర్చిదిద్దుతాడో చూడాలి.