బంగ్లాను బెంబేలెత్తించిన టీమిండియా పేసర్లు

బంగ్లాను బెంబేలెత్తించిన టీమిండియా పేసర్లు
  • షమీ, ఉమేశ్‌‌, ఇషాంత్‌‌  షో
  • 150 రన్స్​కే బంగ్లా ఆలౌట్‌‌
  • అశ్విన్‌‌కు 2 వికెట్లు
  • ఇండియా 86/1

వెస్టిండీస్‌‌ను ఎలాగైతే వణికించారో.. సౌతాఫ్రికాను ఎలాగైతే చావు దెబ్బ కొట్టారో… ఇప్పుడు బంగ్లాదేశ్‌‌ను కూడా టీమిండియా పేసర్లు షమీ (3/27), ఉమేశ్‌‌ (2/47), ఇషాంత్‌‌ (2/20)మరోసారి బెంబేలెత్తించారు..! పేస్‌‌, స్వింగ్‌‌, బౌన్స్‌‌ను కలబోస్తూ.. ‘రివర్స్‌‌’ అటాక్‌‌తో ముప్పుతిప్పలు పెట్టారు..! వీళ్లకు అశ్విన్‌‌ (2/43) మ్యాజిక్‌‌ కూడా తోడుకావడంతో మొమినుల్‌‌సేన తక్కువ స్కోరుకే ముఖం చాటేసింది..! హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ విఫలమైనా.. మయాంక్‌‌, పుజారా దూకుడుతో తొలిరోజే మ్యాచ్‌‌పై పట్టుబిగించిన ఇండియా.. భారీ స్కోరుపై కన్నేసింది..!!

ఇండోర్‌‌:

ప్రత్యర్థి ఎవరైనా.. స్వదేశంలో టీమిండియాకు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. కనీస పోటీ అయినా ఇస్తుందని భావించిన బంగ్లాదేశ్‌‌ను సూపర్‌‌ బౌలింగ్‌‌తో కుదేల్‌‌ చేసిన విరాట్‌‌సేన.. గురువారం మొదలైన తొలి టెస్ట్‌‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపెట్టింది. ముష్ఫికర్‌‌ రహీమ్‌‌ (43), కెప్టెన్‌‌ మొమినుల్‌‌ హక్‌‌ (37) మినహా మిగతా వారు నిరాశపర్చడంతో.. బంగ్లాదేశ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులే చేసింది. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌‌లో 26 ఓవర్లలో వికెట్‌‌ నష్టానికి 86 రన్స్‌‌ చేసింది. మయాంక్‌‌ (37 బ్యాటింగ్‌‌), పుజారా (43 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. 8వ ఓవర్‌‌లోనే రోహిత్‌‌ (6) ఔటైనా.. మయాంక్‌‌, పుజారా మెరుగ్గా ఆడారు. తన సహజశైలికి విరుద్ధంగా పుజారా వరుసగా బౌండరీలు కొడుతూ హోరెత్తించాడు.

తొలి సెషన్‌‌ మనదే..

టాస్‌‌ ఓడి ఫీల్డింగ్‌‌కు దిగిన ఇండియాకు పేస్‌‌ త్రయం మంచి ఆరంభాన్నిచ్చింది. గ్రీన్‌‌ పిచ్‌‌పై లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌కు కట్టుబడుతూ, ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌తో బంగ్లా బ్యాట్స్‌‌మన్‌‌ను ముప్పుతిప్పలు పెట్టినా.. నాలుగు క్యాచ్‌‌లు డ్రాప్‌‌ కావడం ఒకింత నిరాశపర్చాయి. ఫస్ట్‌‌ స్పెల్‌‌లో ఇషాంత్‌‌, ఉమేశ్‌‌ తొలి మూడు ఓవర్లలో ఒక్క రన్‌‌ కూడా ఇవ్వలేదు. కానీ నాలుగో ఓవర్‌‌లో చెరో రన్‌‌తో సరిపెట్టుకున్న ఓపెనర్లు కైస్‌‌ (6), షాద్మన్‌‌ (6)కు.. ఆరో ఓవర్‌‌లో ఉమేశ్‌‌ దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఫుల్‌‌ పేస్‌‌తో వేసిన షార్ప్‌‌ ఇన్‌‌ స్వింగర్‌‌.. కైస్‌‌ బ్యాట్‌‌ను తాకుతూ మూడో స్లిప్‌‌లో రహానె చేతిలో పడింది. తన హైట్‌‌ను ఆసరాగా చేసుకుని అనూహ్య బౌన్స్‌‌ను రాబట్టిన ఇషాంత్‌‌.. తర్వాతి ఓవర్‌‌ ఆఖరి బంతికి షాద్మన్‌‌ను పెవిలియన్‌‌కు చేర్చాడు. దీంతో 12/2తో కష్టాల్లో పడ్డ బంగ్లాను మొమినుల్‌‌, మిథున్‌‌ (13) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు 11 ఓవర్లు ఆడి కేవలం 19 రన్సే చేయడంతో బంగ్లాపై ఒత్తిడి పెరిగింది. ఉమేశ్‌‌ బౌలింగ్‌‌లో డీఆర్‌‌ఎస్‌‌ నుంచి గట్టెక్కిన మిథున్‌‌ను ఛేంజ్‌‌ బౌలర్‌‌గా వచ్చిన షమీ వెనక్కి పంపాడు. 18వ ఓవర్‌‌లో ఓ ఫుల్‌‌లెంగ్త్‌‌ బంతితో ఎల్బీ చేశాడు. ఈ దశలో మొమినుల్‌‌ రెండు ఫోర్లతో వేగం పెంచినా..  24వ ఓవర్‌‌లో ముష్ఫికర్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను కోహ్లీ వదిలేశాడు. ఈ ఇద్దరి నిలకడతో బంగ్లా 26 ఓవర్లలో 63/3 స్కోరుతో లంచ్‌‌కు వెళ్లింది.

పేస్‌‌-స్పిన్‌‌ జోరు..

రెండో సెషన్‌‌లో షమీ రివర్స్‌‌ స్వింగ్‌‌తో చెలరేగితే, అశ్విన్‌‌ సూపర్‌‌ టర్నింగ్‌‌తో బంగ్లా బ్యాటింగ్‌‌ లైనప్‌‌ను కూల్చేశాడు. విరామం తర్వాత రెండో ఓవర్‌‌ (అశ్విన్‌‌)లోనే ముష్ఫికర్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను ఫస్ట్‌‌ స్లిప్‌‌లో రహానె మిస్‌‌ చేశాడు. వెంటనే భారీ సిక్సర్‌‌, ఫోర్‌‌తో ముష్ఫికర్‌‌ ఒత్తిడిని తగ్గించుకున్నాడు. 38వ ఓవర్‌‌లో అశ్విన్‌‌ వేసిన స్ట్రైట్‌‌ బాల్‌‌ను మిస్‌‌ జడ్జ్‌‌ చేసిన మొమినుల్‌‌ ఆడకుండా వదిలేశాడు. కానీ బాల్‌‌ నేరుగా మిడిల్‌‌ స్టంప్‌‌ ఎగరగొట్టింది. ముష్ఫికర్‌‌తో కలిసిన మహ్ముదుల్లా (10) రన్స్‌‌ చేసేందుకు నానా తంటాలు పడ్డాడు. 40, 44వ ఓవర్లలో అశ్విన్‌‌ బౌలింగ్‌‌లో ముష్ఫికర్‌‌, మహ్మదుల్లా ఇచ్చిన క్యాచ్‌‌లను వరుసగా రహానె, సాహా మిస్‌‌ చేశారు. అయినా 46వ ఓవర్‌‌లో అశ్విన్‌‌ బాల్‌‌ను స్వీప్‌‌ చేయబోయి మహ్ముదుల్లా క్లీన్‌‌బౌల్డ్‌‌ అయ్యాడు. దీంతో బంగ్లా 115/5 స్కోరుతో మరింత దిగజారింది. ఈ దశలో ముష్ఫికర్‌‌, లిటన్‌‌ దాస్‌‌ (21) ఏడు ఓవర్లు వికెట్‌‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, 54 వ ఓవర్లలో షమీ డబుల్‌‌ ఝలక్‌‌ ఇచ్చాడు. అద్భుతమైన ఔట్‌‌ స్వింగర్‌‌తో ముష్ఫికర్‌‌ను బౌల్డ్‌‌ చేసిన షమీ, తర్వాతి బాల్‌‌కే మిథున్‌‌ను డకౌట్‌‌గా పంపాడు. వెంటనే టీ విరామానికి వెళ్లిన బంగ్లా స్కోరు 140/7 . మూడో సెషన్‌‌లో బంగ్లా మరో 27 బంతులు ఆడి10 పరుగులు జోడించింది. వచ్చి రావడంతోనే తొలి బంతికే లిటన్‌‌ ఔట్‌‌కాగా, జడేజా వేసిన ఓ సూపర్‌‌ త్రోకు తైజుల్‌‌ ఇస్లామ్‌‌ (1) రనౌటయ్యాడు. 10 బంతుల తర్వాత ఎబాదత్‌‌ హుస్సేన్‌‌ (2) వికెట్‌‌ తీసిన ఉమేశ్‌‌ ఇన్నింగ్స్‌‌ను ముగించాడు.

బంగ్లాదేశ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌: షాద్మన్‌‌ ఇస్లామ్‌‌ (సి) సాహా (బి) ఇషాంత్‌‌ 6, ఇమ్రూల్‌‌ కైస్‌‌ (సి) రహానె (బి) ఉమేశ్‌‌ 6, మొమినుల్‌‌ హక్‌‌ (బి) అశ్విన్‌‌ 37, మిథున్‌‌ (ఎల్బీ) షమీ 13, ముష్ఫికర్‌‌ (బి) షమీ 43, మహ్ముదుల్లా (బి) అశ్విన్‌‌ 10, లిటన్‌‌ దాస్‌‌ (సి) కోహ్లీ (బి) ఇషాంత్‌‌ 21, మెహిదీ హసన్‌‌ (ఎల్బీ) షమీ 0, తైజుల్‌‌ ఇస్లామ్‌‌ (రనౌట్‌‌) 1, అబు జాయేద్‌‌ (నాటౌట్‌‌) 7, ఎబాదత్‌‌ హుస్సేన్‌‌ (బి) ఉమేశ్‌‌ 2, ఎక్స్‌‌ట్రాలు: 4, మొత్తం: 58.3 ఓవర్లలో 150 ఆలౌట్‌‌.

వికెట్లపతనం: 1–12, 2–12, 3–31, 4–99, 5–115, 6–140, 7–140, 8–140, 9–148, 10–150.  బౌలింగ్‌‌: ఇషాంత్‌‌ 12–6–20–2, ఉమేశ్‌‌ 14.3–3–47–2. షమీ 13–5–27–3, అశ్విన్‌‌ 16–1–43–2, జడేజా 3–0–10–0.

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌: మయాంక్‌‌ (బ్యాటింగ్‌‌) 37, రోహిత్‌‌ (సి) లిటన్‌‌ (బి) జాయేద్‌‌ 6, పుజారా (బ్యాటింగ్‌‌) 43, మొత్తం: 26 ఓవర్లలో 86/1.

వికెట్లపతనం: 1-–14.  బౌలింగ్‌‌: ఎబాదత్‌‌ 11–2–32–0, అబు జాయేద్‌‌ 8–0–21–1, తైజుల్‌‌ ఇస్లామ్‌‌ 7–0–33–0.