చావో రేవో ..ఇవాళ వెస్టిండీస్ తో రెండో వన్డే

చావో రేవో ..ఇవాళ వెస్టిండీస్ తో రెండో వన్డే

విశాఖపట్నం: ఊహించని ఓటమితో చెన్నైలో కంగుతిన్న టీమిండియా మరో పోరాటానికి రెడీ అయ్యింది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా ఇక్కడి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరిగే రెండో వన్డేలో వెస్టిండీస్‌‌తో చావోరేవో తేల్చుకోనుంది. అచ్చొచ్చిన వేదికపై విజయం సాధించి సిరీస్‌‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు కటక్‌‌ వెళ్లే లోపే సిరీస్‌‌ ఖాతాలో వేసుకోవడంతోపాటు.. టీ20లకే సరిపోతామనే ముద్రను కూడా చెరిపేసుకోవాలని విండీస్‌‌ కసిగా ఉంది.  దీంతో ఇరుజట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుండగా బౌలింగ్‌‌, ఫీల్డింగ్‌‌లో ఇండియాకు పలు సమస్యలు ఉన్నాయి.

బ్యాటింగ్‌‌ ఓకే.. బౌలింగ్‌‌లో మార్పులు

వైజాగ్‌‌ వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌‌ లైనప్‌‌లో ఎలాంటి మార్పులుండకపోవచ్చు. టాపార్డర్‌‌లో రోహిత్‌‌, రాహుల్‌‌, కోహ్లీలో ఏ ఒక్కరు హిట్టైనా ఇండియాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వైజాగ్‌‌లో కోహ్లీ, రోహిత్‌‌కు మంచి రికార్డు ఉండడం కలిసొచ్చే అంశం.  చెన్నైలో టాప్‌‌–3 ఫెయిలైనా మిడిల్‌‌లో శ్రేయస్‌‌ అయ్యర్‌‌, రిషబ్‌‌ పంత్‌‌, కేదార్‌‌ జాదవ్‌‌ సత్తా చాటడంతో బ్యాటింగ్‌‌ బలం మరింత పెరిగింది. దీంతో మయాంక్‌‌ అగర్వాల్‌‌, మనీశ్‌‌ పాండే మరోసారి బెంచ్‌‌కే పరిమితం కానున్నారు. అయితే చెన్నైలో 287 రన్స్‌‌ను కాపాడుకోలేకపోవడం, వైజాగ్‌‌లో బ్యాటింగ్‌‌ వికెట్‌‌ కావడంతో బౌలింగ్‌‌ లైనప్‌‌లో మార్పులు జరిగే అవకాశముంది. ఐదుగురు బౌలర్ల వ్యూహానికి వెళితే యుజ్వేంద్ర చహల్‌‌, శార్దూల్‌‌ ఠాకూర్‌‌లో ఒకరు ఫైనల్‌‌ ఎలెవన్‌‌లోకి వస్తారు. అప్పుడు శివం దూబే, రవీంద్ర జడేజాలో ఒకరు బెంచ్‌‌కు పరిమితమవుతారు. చెన్నైలో ఫెయిలవడం, బ్యాటింగ్‌‌ వికెట్‌‌పై జడేజాకున్న పేలవ బౌలింగ్‌‌ రికార్డు కూడా చహల్‌‌కు దారి ఇస్తున్నాయి. మూడో పేసర్‌‌ అవసరం అనుకుంటే దూబే చోటు కోల్పోతాడు. ఫస్ట్‌‌ వన్డేలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌‌కు వచ్చిన అతను బౌలింగ్‌‌లో  7.5 ఓవర్లలో 68 రన్స్‌‌ ఇచ్చాడు. వైజాగ్‌‌ వికెట్‌‌ ప్రకారం దూబేకు బ్యాటింగ్‌‌ వచ్చే చాన్స్‌‌ చాలా తక్కువ. అయితే మూడో పేసర్‌‌ కావాలి, దూబే కూడా ఉండాలి అనుకుంటే మాత్రం కేదార్‌‌ ప్లేస్‌‌కు ముప్పు వాటిల్లవచ్చు.  అప్పుడు షమీ, దీపక్‌‌తో కలిసి శార్దూల్‌‌ పేస్‌‌ బాధ్యతలు పంచుకుంటాడు. చెన్నై ఓటమి దృష్ట్యా ఈ మ్యాచ్‌‌లో అయినా కుల్చా జోడీని బరిలోకి దించాలని మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తోంది. ఫైనల్‌‌ ఎలెవన్‌‌ ఎలా ఉన్నా.. ఫీల్డింగ్‌‌లో ముఖ్యంగా క్యాచింగ్‌‌ విషయంలో మెరుగుపడకపోతే కోహ్లీ సేనకు భారీ మూల్యం తప్పదు.

ఈ ఇద్దరినీ ఆపేదెలా!

తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే విండీస్‌‌ వైజాగ్‌‌లో బరిలోకి దిగే చాన్సుంది. ఆ జట్టులో దాదాపు ప్రతి ఒక్కరూ ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో అంచనాలు అందుకున్నారు. షై హోప్‌‌, షిమ్రన్‌‌ హెట్‌‌మయర్‌‌ బ్యాటింగ్‌‌లో మరోసారి కీలకం కానున్నారు. ఫుల్‌‌జోష్‌‌లో ఉన్న ఈ ఇద్దరినీ అడ్డుకునే మార్గాలను హోమ్‌‌టీమ్‌‌ బౌలర్లు వెంటనే కనుగొనాలి. పైగా, వైజాగ్‌‌లో గతేడాది జరిగిన మ్యాచ్‌‌లో ఈ ఇద్దరే ఇండియా విజయాన్ని అడ్డుకున్నారు. వీళ్లను త్వరగా ఔట్‌‌ చేయకపోతే కోహ్లీసేనకు కష్టాలు తప్పవు. ఇక గాయం కారణంగా గత మ్యాచ్‌‌కు దూరంగా ఉన్న  లూయిస్‌‌ అందుబాటులోకి వస్తే ఓపెనర్‌‌ ఆంబ్రిస్‌‌ను పక్కన పెట్టొచ్చు. నికోలస్‌‌ పూరన్‌‌తోపాటు కెప్టెన్‌‌ పొలార్డ్‌‌, రోస్టన్‌‌ ఛేజ్‌‌తో కరీబియన్‌‌ టీమ్‌‌ మిడిలార్డర్‌‌ చాలా బలంగా ఉంది. బౌలింగ్‌‌లో ఫస్ట్‌‌ వన్డే ప్రారంభంలో కాట్రెల్‌‌ అదరగొట్టగా, డెత్‌‌ ఓవర్లలో కీమో పాల్‌‌, అల్జారీ జోసెఫ్‌‌ సత్తా చాటారు. వారి ఫామ్‌‌ కలిసొచ్చే అంశం కాగా సీనియర్‌‌ ప్లేయర్‌‌  హోల్డర్‌‌ తన మార్కు చూపెట్టాల్సి ఉంది. స్పిన్నర్లు కూడా వికెట్లు తీస్తే విండీస్‌‌కు ఎదురులేనట్టే.

జట్లు(అంచనా)

ఇండియా: రోహిత్‌ , రాహుల్‌ , కోహ్లీ (కెప్టెన్‌ ),అయ్యర్‌ , పంత్‌ (కీపర్‌ ), జాదవ్‌ , దూబే, జడేజా/చహల్‌ , దీపక్‌ , కుల్దీప్‌ , షమీ.

వెస్టిండీస్ : షై హోప్‌‌(కీపర్‌‌), లూయిస్‌‌/ఆంబ్రిస్‌‌, హెట్‌‌ మయర్‌‌, పూరన్‌‌, రోస్టన్​ ఛేజ్‌‌, పొలార్డ్‌‌(కెప్టెన్‌‌), హోల్డర్‌‌, కీమోపాల్‌‌, హేడెన్‌‌ వాల్ష్‌‌, అల్జారీ జోసెఫ్‌‌, కాట్రెల్‌‌.