2004 నుంచి అమ్మలను గద్దెలపైకి తెస్తున్న

2004 నుంచి అమ్మలను గద్దెలపైకి తెస్తున్న

సారలమ్మ పూజారి కాక సారయ్యతో ‘వెలుగు’ ఇంటర్వ్యూ
ఏర్పాట్లలో అప్పటికీ ఇప్పటికీ తేడా ఏం లేదు
 పాతవాటికే కొత్తగా మెరుగులు దిద్దుతున్నరు

మేడారం(ఏటూరునాగారం), వెలుగు:  కోట్లమంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మేడారం వన దేవతల జాతర ఘట్టం మరికొన్ని ఘడియల్లో మొదలు కానున్నది. బుధవారం రాత్రికి కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె పైకి తీసుకువచ్చే సమయం రానే వచ్చింది. సారలమ్మను గద్దెల పైకి చేర్చే సమయంలో వారిని తాకితేనే జన్మ ధన్యమైతదని భక్తులు భావిస్తుంటారు. వడ్డెను తాకడం కోసం భక్తి పారవశ్యంతో
తండ్లాడుతుంటారు. బుధవారం సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారంలోని గద్దెల మీదకు వడ్డె కాక సారయ్య తీసుకురానున్నారు. ఈయన గత 8 జాతరలుగా అమ్మవారిని గద్దెలపైకి తీసుకువస్తున్నారు. జాతర సందర్భంగా సారలమ్మను తీసుకొచ్చేవేళ వారి అనుభూతి, గత జాతరలకు ఈ జాతరకు తేడా.. జాతరలో భక్తులకు ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే అంశాలపై ‘సారయ్య’తో వెలుగు ఇంటర్వ్యూ…

వెలుగు: అమ్మను తీసుకొచ్చెప్పుడు మీ అనుభూతి ఎలా ఉంటది?

సారయ్య: అమ్మను ఎత్తుకుని సమ్మక్క గద్దె మీదకు పోయే వరకు, సమ్మక్క గద్దె నుంచి సారలమ్మ గద్దెపైకి ఎక్కినంకనే తిరిగి తెలివత్తది.

అమ్మను తీసుకొచ్చెప్పుడు

మీకు అన్నీ గుర్తుంటాయా?

అమ్మను ఎత్తుకున్న (పూనకం వచ్చిన) క్షణం నుంచి గద్దెపైన ప్రతిష్ఠిచేంత వరకు నాకు ఏం యాదికుండదు.

జాతర కాకుండా మామూలు

రోజుల్లో ఏం చేస్తారు?

జాతర ముగిసిన తరువాత మామూలు రోజుల్లో అందరిలాగే వ్యవసాయం చేసుకుంటాం.

మిగతా రోజుల్లో పూజలు చేస్తారా?

ప్రతి బుధవారం కన్నెపల్లి గుడిలో దీపం ముట్టించి పూజలు చేస్తం.

2004కు ఇప్పటికీ భక్తుల సంఖ్య పెరిగిందా?

అప్పడు లక్షల్లో వచ్చే భక్తులు ఇప్పుడైతే కోటికి పైగా వస్తున్నరు.

జాతరకు ముందస్తు

మొక్కులు పెరిగింది నిజమేనా?

పోయిన జాతరలకు వారం, పది, పదిహేను రోజుల ముందుగా భక్తులు వచ్చేటోళ్లు. కానీ ఇప్పుడు రెండు నెలల ముందు నుంచే భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నరు.

సారలమ్మ పూజారులు మొత్తం ఎంతమంది?

మేము పూజారులం ఆరుగురం. నాతో పాటు కాక వెంకన్న, కాక కిరణ్, కాక భుజంగరావు, కాక కనకమ్మ, కాక లక్ష్మీబాయి.

ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?

ఏర్పాట్లు అంతా మామూలే అనిపిత్తాంది. ఎప్పటిలెక్కనే ఉన్నయి కొత్తగా ఏం కనపడ్త లేదు.

రూ. 75 కోట్లతో పనులు చేస్తున్నారు కదా?

రూ.75 కోట్లు ఏడపెట్టిండ్రో ఏమో, ఇంతకు ముందు స్నానఘట్టాలు కట్టేది, ఇప్పుడు పాత వాటికే రిపేర్లు చేస్తున్నారు కొత్తయైతే ఏం కట్టలే. బిల్లింగులు గిల్లింగులు కడుతున్నరు.

కొత్త బిల్డింగులు అందుబాటులోకి వస్తాయా?

ఎంతమందికని బిల్లింగులు కడుతరు. ఇప్పుడు కట్టేటియి కూడా ఈ జాతరకు భక్తులకు అందుబాటులోకి రావు. వచ్చే జాతరకు పనికొస్తాయి.

ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు?

సారలమ్మ గద్దెలపైకి వచ్చేటపుడు తొక్కిసలాట జరకుండా సూడాలే. ఇప్పటినుంచే వాహనాలను పార్కింగ్​స్థలాలకు తరలిస్తున్నరు. కానీ అక్కడ ట్యాప్​లు పనిచేస్తలేవు. అక్కడ నీటి వసతి వెంటనే ప్రారంభించాలె.