పరిచయం : ప్రకృతి మీద ప్రేమతో..

పరిచయం : ప్రకృతి మీద ప్రేమతో..

కార్తికి గోన్సాల్వేస్.. అందమైన ప్రకృతిని అద్భుతంగా కెమెరాలో బంధించే ఫొటోగ్రాఫర్. ఇండియన్​ నేచురల్ హిస్టరీ, సోషల్ డాక్యుమెంటరీ ఫొటో జర్నలిస్ట్ కూడా. ది ఎలిఫెంట్​ విస్సరర్స్​ అంటూ డాక్యుమెంటరీ తీసి, ఆస్కార్​ అవార్డ్​ గెలుచుకున్న ఇండియన్​ ఫిమేల్ డైరెక్టర్. ఆమె గురించిన విశేషాలు ఆమె మాటల్లోనే..

‘‘అడవులు, చెరువులు, బీచ్​లు, కొండలు, జూ, నేచురల్ హిస్టరీ మ్యూజియమ్స్, అక్వేరియం వంటివి చిన్నప్పుడే పరిచయం అయ్యాయి. అందుకు కారణం మా అమ్మకి జంతువులంటే ప్రాణం. మా నాన్న ఫొటోగ్రాఫర్. అమ్మమ్మకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. నేను స్కూల్​కి వెళ్తున్న రోజుల్లో.. మా దగ్గరలో ఉన్న నేచర్ రిజర్వ్​ల గురించి చెప్తుండేది ఆమె. అందుకే నాకు ప్రకృతి, ఫొటోగ్రఫీ, జంతువుల ప్రవర్తన మీద నాలెడ్జ్​ వచ్చింది. దాంతోపాటు ఎన్విరాన్​మెంట్​, వైల్డ్ లైఫ్, కన్జర్వేషన్​ గురించి తెలుసుకోవడం అంటే బాగా ఇష్టం. 

అలాగే ఇతర కల్చర్స్, కమ్యూనిటీలు వాళ్ల సంబంధాలు వంటి విశేషాలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఎక్కువ. ఏదైనా ఒకదాన్ని బలంగా ఊహించినా లేదా కోరుకున్నా దానికి ఆలోచనను మార్చే శక్తి ఉంటుందని నమ్ముతా. ఫొటోగ్రాఫర్ అయిన నేను నా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ అడ్వెంచర్​ చేశా. పర్యావరణం, మనుగడ గురించి మనుషులు లోతుగా ఆలోచించేలా చేయాలనుకున్నా. అదే ఈ డాక్యుమెంటరీ షార్ట్​ ఫిల్మ్​ ద్వారా చెప్పా. 

మా ఫ్యామిలీలో ఉన్నదే

మాది ముంబై. నాన్న పేరు తిమోతి ఎ. గోన్సాల్వేస్. అమ్మ ప్రిస్కిల్లా తాప్లే. అమ్మ వాళ్లది న్యూయార్క్. నాకో అక్క ఉంది. తన పేరు డానిక. తమిళనాడులోని ఊటీలో పెరిగా నేను. కోయంబత్తూర్​లోని డాక్టర్​ జి.ఆర్. దామోదరన్ సైన్స్​ కాలేజీలో గ్రాడ్యుయేషన్​ చదివా. ఆ తర్వాత ఫొటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్​తో అటువైపు దృష్టి పెట్టా. ఊటీలోని లైట్​ అండ్ లైఫ్ అకాడమీలో ఫొటోగ్రఫీ కోర్స్ చేశా. మొదట్లో యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఛానెల్స్​లో కెమెరా ఆపరేటర్​గా పనిచేశా. 

మన దేశం నుంచి ఎంపికైన మొట్టమొదటి సోనీ ఆర్టిసన్​ ఫొటోగ్రాఫర్​ను నేను. నేచురల్ హిస్టరీకి సంబంధించిన సోనీ ఆల్ఫా సిరీస్​కి అంబాసిడర్​ని. నేచర్, సోషల్ డాక్యుమెంటరీల మీద స్పెషలైజేషన్ చేశా. నేచర్​, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ గురించి వర్క్​షాపులు కూడా పెడుతుంటా. అలాగే బెంగళూరు, మైసూర్​ వంటి సిటీలకు టూర్స్​ ఏర్పాటుచేస్తుంటా. ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్​ ఆఫ్ కన్జర్వేషన్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్​లో సభ్యురాలిగా ఉన్నా.  

ఓర్కాలను ఫొటోలు తీయడానికి...

నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తా. అలా ట్రావెలింగ్ చేసే టైంలో ఒకసారి పసిఫిక్ నార్త్​ వెస్ట్​లోని సముద్రాల్లో ఓర్కా అనే నలుపు, తెలుపు రంగులు కలిసిన తిమింగలాలు కనిపించాయి. వీటిని ‘కిల్లర్ వేల్’ అని కూడా పిలుస్తారు. ఇది చాలా వేగంగా కదిలే క్షీరదం. చాలా తెలివైంది కూడా. జూన్ 2007లో, కెనడాలోని పసిఫిక్​ తీరంలో కయకింగ్ చేయడానికి వెళ్లా. అక్కడ ఈ ఓర్కాలు కనిపించాయి. అక్కడ మొదటిసారి వాటిని చూశా. ఆ తర్వాత నుంచి ఓర్కాలను చూడాలనే కోరిక నాలో పెరిగింది. ఆ ప్లేస్​ కూడా నాకెంతో నచ్చింది. జులై 2016లో బ్రిటిష్​ కొలంబియాలోని సముద్రతీర ప్రాంతంలో కవిచన్ బేకి వెళ్లా. పొద్దున్నే లేచి బీచ్​కి వెళ్లి కయకింగ్ చేస్తూ తిమింగలాల ఫొటోలు తీసేదాన్ని. అవి రెక్కల్ని ఎలా ఆడిస్తున్నాయి? ఎలా ఎగురుతున్నాయి? అనే విషయాలు గమనించేదాన్ని. 

ఆస్కార్​ వరకు..

ప్రకృతికి, మనిషికి మద్య ఉన్న బంధమే నాకు ఆస్కార్​ తెచ్చిపెట్టింది. ‘ది ఎలిఫెంట్​ విస్పరర్స్’ ను 2017లో మొదలుపెట్టాం. ఇందులో కనిపించే ప్రతి షాట్​ ఆర్గానిక్​గా ఉండాలనుకున్నా. ఈ డాక్యుమెంటరీని ఐదేండ్లు తీశాం. ఇది నా మొదటి డాక్యుమెంటరీ. మొదటిసారి ఏదైనా చేయడం చాలా ‘కష్టంగా అనిపిస్తుంది. డాక్యుమెంటరీ తీసేటప్పుడు నాకూ అలానే అనిపించింది. ఈ జర్నీ మొత్తంలో నెట్​ఫ్లిక్స్ చాలా సపోర్ట్​ చేసింది. నెట్ ఫ్లిక్స్ సపోర్ట్​ లేకపోతే ఇదంతా జరిగేది కాదు. 

ఫిల్మ్​ మేకింగ్

మొదట్లో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మీద అవేర్​నెస్ కల్పించేందుకు స్టోరీలు, ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసేదాన్ని. ప్రస్తుతం మూడు పెద్ద ప్రాజెక్ట్​లు చేస్తున్నా. వాటిలో ఒకటి పశ్చిమ కనుమల్లో ఉన్న అడవి పిల్లులు, వాటి ఆవాసాలను తెలుసుకోవడం గురించి. ఈ మధ్యనే సెంట్రల్ ఇండియా ప్రాంతంలోని రిమోట్ విలేజ్​ ప్రాజెక్ట్ పూర్తైంది. అందులో ఆదివాసి, బైల్  కమ్యూనిటీ, లోకల్ ట్రెడిషనల్ ఆర్టిస్ట్​లు, వాళ్ల జీవితాల మీద ఫొటోగ్రఫీ, డాక్యుమెంటరీలు చేశా. ఆ తర్వాత ఫొటో ఫీచర్, ఇండో–చైనీస్​ బార్డర్​ దగ్గర కోల్డ్ హై డెసర్ట్​ లైఫ్​ని డాక్యుమెంట్​ చేశా. 

బొమ్మన్​, బెల్లీ

బొమ్మన్​, బెల్లీ... వీళ్లిద్దరూ నాకు చాలా స్పెషల్. వాళ్లతో నేను రెగ్యులర్​గా మాట్లాడుతున్నా. వాళ్ల క్యాంప్​, ఏనుగుల్ని చూసేందుకు చాలా మంది వెళ్తున్నారు ఇప్పుడు. నేను చేసిందల్లా వాళ్ల ప్రపంచానికి, బయటి ప్రపంచానికి మధ్య వారధిగా ఉండటం. వాళ్లిద్దరికీ అంతర్జాతీయంగా, మన దేశంలో మంచి ఫాలోయింగ్​ వచ్చింది. ఎంతో ఆనందకరమైన వాళ్ల జీవితాలు ప్రపంచంలో ఎంతోమంది మనసుల్ని తాకాయనే విషయాన్ని వాళ్లకి చెప్పా. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మెయిల్స్, వార్తలు, మెసేజ్​లు ఎప్పటికప్పుడు వాళ్లకు చెప్పడం నా బాధ్యత.

రఘు, అమ్ముల గురించి...

బొమ్మన్​, బెల్లిల తరువాత నేను చెప్పాల్సింది రఘు, అమ్ముల గురించి. రఘు ఇప్పుడు చాలా నెమ్మదస్తుడయ్యాడు. చాలా పొడవయ్యాడు కూడా. రఘుని నేను మొదట చూసినప్పుడు నా మోకాళ్ల ఎత్తు ఉండేవాడు. ఇప్పుడు నాకంటే ఎత్తు ఉన్నాడు. ఇక అమ్ము విషయానికి వస్తే... నేను అమ్ముని కలిసినప్పుడు మూడున్నర లేదా నాలుగు అడుగుల ఎత్తు ఉండేది. ఇప్పుడు నాకంటే పొడవు పెరిగింది.

డిసెంబర్, 2022లో ‘ది ఎలిఫెంట్​ విస్పరర్స్’ డాక్యుమెంట్ షార్ట్ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్​లో రిలీజ్ చేశాం. ‘రఘు’ అనే అనాథ ఏనుగు కథ ఇది. ఈ డాక్యుమెంటరీలో బొమ్మన్, బెల్లీ దంపతులతో పాటు రఘు, అమ్ము అనే రెండు ఏనుగులు కనిపిస్తాయి. ప్రొడ్యూసర్​ గునీత్ మోంగా. ఈ డాక్యుమెంటరీ 41 నిమిషాల నిడివితో ఉంది. ఈ ప్రయాణంలో చాలా ఛాలెంజెస్​ ఎదురయ్యాయి. ఇది తీయడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. అది చేయాలంటే అంత ఓర్పు కావాలి. 

ఆ రెండింటితోపాటు దాన్ని సరైన పద్ధతిలో ఎలా వాడాలో తెలిస్తేనే మ్యాజిక్ జరుగుతుంది. నేను ఈ డాక్యుమెంటరీని ఆర్టిస్టిక్​గా చూపించాలనుకున్నా. దాంతోపాటు డీటెయిల్స్, లైట్​, టెక్చర్, కలర్స్, మూడ్​, క్రియేటివ్ కెమెరా టెక్నిక్స్ వాడి సీన్స్​ని బ్యూటీఫుల్​గా క్యాప్చర్​ చేశాం. నేచర్ బ్యూటీ, ఎమోషన్, నేచురల్ లైట్ నన్ను బాగా ఇన్​స్పైర్ చేశాయి. నేచరల్ వరల్డ్​ని ప్రజలు బాగా అర్థం చేసుకునేందుకే డాక్యుమెంటరీలు తీయాలనుకుంటున్నా.’’ 

ఇప్పటివరకు చాలా సినిమాల్లో మనుషులకు, జంతువులకు మధ్య ఉన్న బాండింగ్​ గురించి మనుషులు, జంతువులకి హాని చేయడం లేదా అడవుల్ని మనుషులు తమ అవసరాల కోసం ఆక్రమించుకోవడం వల్ల జంతువులు ఇబ్బంది పడటం వంటి సబ్జెక్ట్స్​ చూపించారు. అదే ‘ది ఎలిఫెంట్​ విస్సరర్స్​’కి వచ్చేసరికి ఏనుగుల గురించి, వాటి కేర్​ టేకర్​ల గురించి ప్రేక్షకులకు అర్థమవుతుంది. జంతువుల్ని మన నుంచి వేరుగా కాకుండా మనలో ఒకటిగా చూడాలనేది నా ఆశ. తాము బతుకుతున్న నేలను ఎంతో గౌరవిస్తారు వీళ్లు. అలా ఉంటారు కాబట్టే ఆ నేల నుంచి వాళ్లకెంత అవసరమో అంతే తీసుకుంటారు. వాళ్ల నుంచి మనం అది నేర్చుకోవాలి. అలా జీవించాలి.

తమిళనాడులోని బొమ్మన్​, బెల్లీ ఎలిఫెంట్​ క్యాంప్​ గురించి నాకు తెలియడం కాకతాళీయం ఏమీ కాదు. ఎందుకంటే నేను పెరిగింది ఆ ప్రాంతంలోనే కాబట్టి. ఒకసారి బెంగళూరులో ఉన్న నా వస్తువులను వెస్టర్న్​ ఘాట్స్​లోని మా ఊరు నీల్​గిరికి తెచ్చుకునేందుకు ఊటీ నుంచి బెంగళూరుకు జర్నీ చేస్తున్నా. ఆ దారిలో రఘుని తీసుకుని వెళ్తున్న బొమ్మన్​ కనిపించాడు. వాళ్లిద్దరినే చూస్తున్న నన్ను గమనించిన బొమ్మన్​ దగ్గరకు రమ్మని సైగ చేశాడు. వెంటనే నా కారు రోడ్డు పక్కకి ఆపేశా. ఉత్సాహంగా కారులోనుంచి దుమికి వాళ్ల దగ్గరకు వెళ్లా. 

స్నానం చేయించడం కోసం దగ్గరలోని నదికి రఘుని తీసుకెళ్తున్నాడు బొమ్మన్​. ఆ విషయం తెలుసుకున్న నేను కూడా వాళ్లతో కలిసి నడవడం మొదలుపెట్టా. నా మూడేండ్ల వయసు నుంచి ఆ శాంక్చురీకి వెళ్తూనే ఉన్నా. కానీ, అన్నేండ్లు వెళ్లింది ఒక ఎత్తయితే అప్పుడు వాళ్లతో కలిసి నడిచిన ఎక్స్​పీరియెన్స్​ నాకు చాలా స్పెషల్​. ఆ రోజు సాయంత్రం వరకు వాళ్లిద్దరితో ఉన్నా. బొమ్మన్​, మూడు నెలల వయసు ఉన్న రఘుకి మధ్య ఉన్న బంధం నాకప్పుడు బాగా అర్థమైంది. 

వాళ్ల మధ్య ఉన్న అందమైన ఆ బంధాన్ని మాటల్లో చెప్పలేం. ఆ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్​ను నేను అప్పటివరకు ఎక్కడా చూడలేదు. బొమ్మన్​కు రఘు కొడుకు కంటే ఎక్కువ. కొన్నిసార్లు రఘు... బొమ్మన్​ చేతిని పట్టుకుని కదలనిచ్చేవాడు కాదు. కారణం... రఘు పసివాడిగా ఉన్నప్పుడు అనాథగా మిగిలిపోవడమే కావచ్చు. ఆ భయమే బొమ్మన్ చేతిని వదలనీయకుండా చేసింది కాబోలు.
ఒక రకంగా చెప్పాలంటే... 2017, 2018 ఈ రెండేండ్లు నా జీవితంలో చాలా ప్రత్యేకం. అప్పుడు మొదలైన ప్రయాణం... నా మిగతా జీవితమంతా సజీవం. నేను చూసిన ఆ అనుబంధాన్ని డాక్యుమెంటరీ చేయడం అనుకోకుండా జరిగింది. 

అంతేకానీ ప్రత్యేకంగా ఒక సందర్భం నన్ను ఈ డాక్యుమెంటరీ వైపు నడిపించలేదు. చాలా ఏండ్లుగా నేను చేస్తున్న స్టోరీ టెల్లింగ్​, ఫొటోగ్రఫీలు నన్ను దీనికి కనెక్ట్​ చేశాయి. ఆ టైంకి నేను అక్కడ ఉండాలి కాబట్టి ఉన్నానంతే. నేను అడవిలో ఉన్నప్పుడు ఎన్నో ఏనుగు పిల్లల్ని చూశా. కానీ, రఘు, అమ్ముతో ఉన్నంత  క్లోజ్​గా మిగతా వాటితో లేను. అదొక్కటే కాదు ఈ రెండింటిని అబ్జర్వ్​ చేసినంత లోతుగా మిగతా వాటిని చేయలేదు కూడా. ఇదంతా జరగాలి కాబట్టి జరిగిపోయిందంతే.