జగన్​ విచారణకు రావాల్సిందే: సీబీఐ ప్రత్యేక కోర్టు

జగన్​ విచారణకు రావాల్సిందే: సీబీఐ ప్రత్యేక కోర్టు

హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి విచారణకు హాజరుకావాల్సిందేనని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ నెల పదో తేదీన జరిగే విచారణకు ఆయనతోపాటు ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రావాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు జడ్జి మధుసూదన్​రావు ఆదేశాలు జారీ చేశారు. జగన్​ ఆస్తుల కేసులో శుక్రవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దీనికి జగన్, విజయసాయిరెడ్డి హాజరుకాలేదు. జగన్​ సీఎం వంటి కీలక పదవిలో ఉన్నారని, రాజ్యసభ మెంబర్‌గా విజయసాయిరెడ్డి ఢిల్లీలో జరిగే మీటింగ్‌కు వెళ్లారని.. అందువల్ల వారు కోర్టుకు రాలేకపోయారని లాయర్‌ అశోక్‌ రెడ్డి కోర్టుకు వివరించారు. వారి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన జడ్జి.. ఈసారికి అనుమతిస్తున్నామని, పదో తేదీన జరిగే విచారణకు వారు విధిగా హాజరుకావాల్సిందేనని ఆదేశించారు. ఇప్పటికే జగన్‌  గతేడాది మార్చి నుంచి, విజయసాయిరెడ్డి నవంబర్‌ నుంచి విచారణకు హాజరుకాలేదని పేర్కొన్నారు.

Jagan and Vijayasai Reddy must attend the trial hearing on January 10: CBI Special Court