దేవుడు గొప్పగా స్క్రిప్ట్ రాశాడు: వైఎస్ జగన్

దేవుడు గొప్పగా స్క్రిప్ట్ రాశాడు: వైఎస్ జగన్

అన్యాయం చేస్తే దేవుడు మొట్టికాయలు వేస్తాడనడానికి చంద్రబాబే నిదర్శనమని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం తాడేపల్లిలో వైఎస్సార్సీఎల్పీ సమావేశంలో ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘అన్యాయం, అధర్మం చేస్తే దేవుడు తప్పక శిక్షిస్తాడు. వైఎస్సార్ సీపీ నుంచి అక్రమంగా 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారు. ఇప్పుడు టీడీపీలో 23 మంది మాత్రమే గెలిచారు. మే 23నే చంద్రబాబుకు దేవుడు తగిన బుద్ధి చెప్పాడు. 23 సంఖ్యతో దేవుడు గొప్పగా స్క్రిప్ట్ రాశాడు. చంద్రబాబు అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు విశ్వసనీయతకు ఓటేశారు. ఈ ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలు స్వీప్ చేశాం. 50 శాతం ఓట్లు వైఎస్సార్ సీపీకే పడ్డాయి. ఈ విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ప్రతి పేదకు సంక్షేమం, అభివృద్ధి అన్న అజెండాతో ఎన్నికలకు వచ్చిన మనం సమర్థవంతమైన పాలన అందించాలి. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. 2024 ఎన్నికల్లో ఇంత కన్నా ఎక్కువ స్థానాల్లో గెలవడమే మన లక్ష్యంగా పనిచేయాలి. గత ఐదేళ్లలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా వైఎస్సార్ సీపీ అండగా నిలబడింది. ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చాం.  రాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ చూడని విధంగా ప్రక్షాళన చేస్తా. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తుంది. మొదటి ఆరు నెలల్లోనే మంచి సీఎం అనిపించుకునేలా సుపరిపాలన అందిస్తా” అని అన్నారు. త్వరలో రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా క్లీన్​ స్వీప్​ చేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. తర్వాత వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎల్పీ నేతగా జగన్​ పేరును సీనియర్​ నేత, చీపురుపల్లి ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ ప్రతిపాదించారు. ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆది మూలపు సురేశ్​, కొలను పార్థసారథి, ముస్తఫా, ఆర్కే రోజా, ఆళ్ల నాని, ప్రసాద రాజు, కోన రఘుపతి, నారాయణ స్వామి బలపరిచారు.

కన్నీరు పెట్టుకున్న బాపట్ల ఎంపీ…

వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బాపట్ల ఎంపీ నందిగం సురేశ్​కన్నీరు పెట్టుకున్నారు. తనకు ఆర్థిక స్తోమత లేకున్నా జగన్ ఎంపీగా గెలిపించారంటూ ఉద్వేగానికి గురయ్యారు.

హోదా కోసం త్యాగాలకు సిద్ధపడాలి…

ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాటం కొనసాగించాలని పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ సూచించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండ్రోజుల తర్వాత పార్లమెంటరీ పార్టీ నేతను ఎంపిక చేద్దామని చెప్పారు. “ప్రత్యేక హోదా విషయంలో పార్టీ అంకితభావాన్ని నిరూపించుకోవాలి. దీనికోసం ఎంపీలు దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఢిల్లీలో ప్రధానితో జరిగే సమావేశంలో ప్రత్యేక హోదాపై విజ్ఞప్తి చేస్తా. విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఎంపీలదే” అన్నారు.