పీఆర్ కమిషనర్​కు జేపీఎస్​ల వేడుకోలు

పీఆర్ కమిషనర్​కు జేపీఎస్​ల వేడుకోలు

హైదరాబాద్, వెలుగు: చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేదు. పెద్ద కొలువు కోసం ప్రిపేర్ అవుదామంటే టైం సరిపోయేటట్లు లేదు. సర్వీస్ రెగ్యులరైజ్ కాకపోవడంతో లీవ్ పెట్టే అవకాశం కూడా లేదు. ఎంతో కష్టపడి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పటికీ.. పని ఒత్తిడి వల్ల మెయిన్స్ కు సీరియస్ గా ప్రిపేర్ కాలేని పరిస్థితి. అటు జాబ్ రెగ్యులరైజ్ కాక, ఇటు ఉన్నత ఉద్యోగానికి ప్రిపేర్ కాలేక ఎంతో మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీ(జేపీఎస్)లు పడుతున్న మానసిక వేదన ఇది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,450 మంది జేపీఎస్ లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. తమకు జాబ్ రెగ్యురలైజ్ కాకపోవడంతో సెలవులు పెట్టుకునే అవకాశం కూడా లేకుండాపోయిందని వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీసం లాస్ ఆఫ్ పేతో అయినా లీవ్స్ శాంక్షన్ చేయాలని వారు పంచాయతీ రాజ్ కమిషనర్ ను వేడుకుంటున్నారు.  

పొద్దున నుంచి రాత్రి దాకా ఎన్నో పనులు 

జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఉదయం 7 గంటలకల్లా గ్రామానికి చేరుకుంటే పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకునేసరికి రాత్రి ఏడెనిమిది అవుతోంది. రోజూ ఉదయమే క్యాప్చర్ జీపీ లొకేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి తాము పని చేస్తున్న పంచాయతీ ఆఫీసు నుంచి సెల్ఫీ దిగి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సెక్రటరీలపై ప్రభుత్వం రోజురోజుకు పని భారం పెంచుతోంది. రోజూ పారిశుధ్యం, హరితహారం, మంచినీటి సరఫరా, స్ట్రీట్ లైట్స్, సర్టిఫికెట్ల జారీ, పల్లె ప్రకృతి వనాలు, విలేజ్ నర్సరీలు, రికార్డుల నిర్వహణలాంటి అనేక పనులను చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు ఉపాధి హామీ పనుల గుర్తింపు, పనులు చేయించడం కూడా వీళ్ల బాధ్యతనే. కూలీలు రాకపోయినా, పనులు చేయకపోయినా సెక్రటరీలకు మెమోలు ఇస్తున్నారు. దీంతో ఉదయం నుంచి చీకటి వడేవరకు ఏదో ఒక పనిలో నిమగ్నం కావాల్సి వస్తోంది. 32 రకాల రిజిష్టర్లను నిర్వహించాల్సి ఉంటుంది. రోజూ ఎంపీఓలు, ఎంపీడీఓలు, డీఎల్పీఓలు, డీపీఓ, డిప్యూటీ సీఈ ఓ, సీఈఓలు పంపే మెస్సేజ్ లకు ఎప్పటికప్పుడు స్పందించడంతోపాటు వారు ఇచ్చే ఆదేశాలను అమలు చేయాల్సి ఉంటుంది. మండల పరిషత్ ఆఫీసుల్లో వారానికోసారి జరిగే సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పని ఒత్తిడితోనే గత మూడున్నరేళ్లలో సుమారు 2  వేల మంది పంచాయతీ సెక్రటరీలు జాబ్ మానేశారు. ప్రస్తుతం పని చేస్తున్న సెక్రటరీల్లో చాలా మంది గ్రూప్ 1, ఎస్సై పోస్టులకు నిర్వహించిన ప్రిలిమ్స్ లో సెలక్ట్ అయినప్పటికీ మెయిన్స్ కు పూర్తి స్థాయిలో ప్రిపేర్ కాలేని దుస్థితి నెలకొంది.  

ప్రభుత్వం చాన్స్ ఇయ్యాలె  

రాష్ట్రవ్యాప్తంగా1,450 మంది పంచాయతీ సెక్రటరీలు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు క్వాలిఫై అయ్యారు. టీఎస్ పీఎస్సీ ఇచ్చిన ఇతర నోటిఫికేషన్లలో కూడా చాలా పోస్టులకు అప్లై చేసుకుని ప్రిపేర్ అవుతున్నారు. వారికి చాన్స్ ఇస్తే  గ్రూప్ 1 ఆఫీసర్ కల నెరవేర్చుకునే అవకాశముంది. జేపీఎస్ లకు సెలవుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి.   

-  మహేష్, రాష్ట్ర అధ్యక్షుడు, పంచాయతీ సెక్రటరీల సెంట్రల్ ఫోరం

లాస్ ఆఫ్ పేతోనైనా లీవ్స్ శాంక్షన్ చెయ్యాలె 

రాష్ట్ర ప్రభుత్వం 2019 జులైలో 9,355 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేసింది. జాబ్ లో చేరాక మూడేళ్లు ప్రొబేషరీ పిరియడ్ గానే పరిగణిస్తామని పేర్కొంది. 2022 జులైతో ఈ గడువు ముగిసినప్పటికీ మరో ఏడాదికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వేళ నిరుడే వారి సర్వీస్ రెగ్యులరైజ్ చేసి ఉంటే.. వారికి లీవ్ పెట్టుకునే అవకాశముండేది. కానీ నాలుగేళ్లకు పెంచడంతో ఆ చాన్స్ లేకుండా పోయిందని మెయిన్స్ కు క్వాలిఫై అయిన సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇటు ఉద్యోగాన్ని వదులుకోలేక అటు డ్యూటీ టైమింగ్స్ అడ్జస్ట్ కాక వారు ఆందోళన చెందుతున్నారు. గ్రూప్స్ 1 మెయిన్స్ తోపాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలనుకునే సెక్రటరీలకు శాలరీతో కూడిన సెలవు ఇవ్వాలని వారు కోరుతున్నారు. లేదంటే లాస్ ఆఫ్ పేతోనైనా లీవ్స్ శాంక్షన్ చేయాలని వేడుకుంటున్నారు.