కూతురే లేదు.. ‘కల్యాణలక్ష్మి’ వచ్చింది

కూతురే లేదు.. ‘కల్యాణలక్ష్మి’ వచ్చింది

మహబూబ్ నగర్/గండీడ్, వెలుగు: ఆ వృద్ధురాలికి కూతురు లేదు. కానీ ఉన్నట్లు సృష్టించి కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. లక్ష కొట్టేశారు. అసలు పెళ్లి కొడుకుకు సగం డబ్బులు ఇస్తామని వాటా ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. మహబూబ్​నగర్​ జిల్లా గండీడ్​ మండలం గాధిర్యాల్​గ్రామానికి చెందిన  దేవనోళ్ల ఆనంద్ వివాహం కర్నాటక రాష్ట్రానికి చెందిన లక్ష్మితో 2‌‌‌‌018లో జరిగింది. పెళ్లికూతురు కర్నాటక రాష్ట్రానికి చెందిన అమ్మాయి కావడంతో తెలంగాణలో కల్యాణలక్ష్మి పథకం  వర్తించదని తెలిసి ఓ పైరవీకారుడిని ఆశ్రయించారు. అతడు చేరి సగం ఇస్తే మంజూరు చేయిస్తానని డీల్ కుదుర్చుకున్నాడు. దీనికి పెళ్లికొడుకు ఆనంద్​ఒప్పుకోవడంతో కర్నాటకకు చెందిన లక్ష్మిని అదే మండలంలోని మొకార్లబాద్ గ్రామానికి చెందిన శీలం భీమమ్మ కూతురిగా సర్టిఫికెట్స్​సృష్టించారు. కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేశారు. 3 జులై 2019న పథకం డబ్బులు రూ. 1,00,116 భీమమ్మ ఖాతాలో పడ్డాయి.

వాటా ఇవ్వకపోవడంతో..

భీమమ్మకు అసలు కూతుర్లే లేరు. అయినప్పటికీ అంతా కమ్మక్కు కావడంతో పథకం మంజూరైంది. ఖాతాలో డబ్బులు పడగానే పైరవీకారులు ఆమెకు రూ. వెయ్యి ఇచ్చి ఖాతాలోంచి రూ. లక్ష డ్రా చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత అనుమానం వచ్చిన ఆనంద్​మేనమామ సిలెం హనుమయ్యను నిలదీయడంతో బుకాయించాడు. దీంతో ఆనంద్​భీమమ్మ వద్దకు వెళ్లి ఆమె బ్యాంకు అకౌంట్​నంబర్​తీసుకుని స్టేట్​మెంట్​తీసుకున్నాడు. అందులో డబ్బులు రూ. లక్ష డ్రా చేసినట్లు ఉంది. దీంతో 11 నెలలు అవుతున్నా ఇప్పటివరకు తన వాటా ఇవ్వలేదని, ఇప్పించాలని ఆధారాలతో సహా ఓ ప్రజాప్రతినిధిని ఆశ్రయించడంతో విషయం బయటపడింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందిందని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గండీడ్​ తహసీల్దార్​ జ్యోతి తెలిపారు.

రూ. వెయ్యి ఇస్తానంటే కాగితాలిచ్చా

నాకు కూతుళ్లు లేరు. ఒకతను వచ్చి వెయ్యి ఇస్తానంటే కాగితాలిచ్చా. కొన్ని దినాలైనంక వచ్చి బ్యాంకుకు తీసుకుపోయిండు. వెయ్యి చేతిలో పెట్టిండు.  ‑ భీమమ్మ

కేసీఆర్ ఉన్నంత వరకు ఏపీ చుక్కనీరు తీసుకుపోలేదు