రాష్ట్రంలో బీజేపీ ఎలా ముందుకు వెళ్తుందో కేటీఆర్​ చూస్తరు

రాష్ట్రంలో బీజేపీ ఎలా ముందుకు వెళ్తుందో కేటీఆర్​ చూస్తరు
  • ఆయన కొడుకు, కూతురు, అల్లుడు దోచుకుంటున్నరు
  • మీడియాతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్​ చుగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ కు బై బై చెప్పే సమయం వచ్చిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు... అందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఒక వ్యక్తి పార్టీ కాదన్నారు. వచ్చే నెల 3న పరేడ్ గ్రౌండ్ లో  జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం తరుణ్ చుగ్ పరిశీలించారు. ఆయన వెంట డీకే అరుణ, మోడీ సభ ఇన్​చార్జ్​ గరికపాటి మోహన్ రావు, ఇతర నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది రానున్న రోజుల్లో కేటీఆర్ చూస్తారని అన్నారు. మోడీ సభకు రాష్ట్రవ్యాప్తంగా 35 వేల పోలింగ్ బూత్ ల నుంచి లక్షలాది మంది వస్తారని చెప్పారు. వచ్చే నెల 1న  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 2న ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తారన్నారు.

మోడీ సభపై ఎస్పీజీ సమీక్ష

పరేడ్ గ్రౌండ్​లో జరిగే మోడీ సభపై స్థానిక పోలీసులు, బీజేపీ నేతలతో కలిసి బుధవారం ఎస్పీజీ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో హైదరాబాద్ అడిషనల్ సీపీలు కార్తికేయ, చౌహాన్, ట్రాఫిక్ సీపీ రంగనాథన్, నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తితో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక పోలీసులకు ఎస్పీజీ దిశా నిర్దేశం చేసింది. పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలను రెండు రోజుల ముందుగానే తమ ఆధీనంలోకి  తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా ఎంట్రెన్స్, జాతీయ కార్యవర్గ సభ్యులు,  రాష్ట్ర ఆఫీసు బేరర్లకు మరొక ఎంట్రెన్స్, ప్రధాని మోడీకి ప్రత్యేకంగా మరో ఎంట్రెన్స్ ను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు గ్రౌండ్ ను మెటల్ డిటెక్టర్​లతో తనిఖీలు చేశారు.