లాల్ ​దర్వాజ బోనాలకు ముస్తాబైన పాతబస్తీ

లాల్ ​దర్వాజ బోనాలకు ముస్తాబైన పాతబస్తీ

మెహిదీపట్నం, వెలుగు:  లాల్ దర్వాజ బోనాలకు పాతబస్తీ సిద్ధమైంది. ఆదివారం సిటీతో పాటు పాతబస్తీలోనూ బోనాలు జరగనుండగా..  ఆలయాలను స్వాగత తోరణాలు, కలర్​ఫుల్ లైట్లతో అందంగా అలంకరించారు. బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయాల వద్ద ప్రత్యేక క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. పాతబస్తీ లోని సింహా వాహిని మహంకాళి, హరిబౌలి  అక్కన్న మాదన్న, కార్వాన్​లోని దర్బార్ మైసమ్మ, సబ్జీమండిలోని మహంకాళి ఆలయంతో పాటు ఇతర ప్రముఖ దేవాలయాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచే పూజలు నిర్వహించనున్నారు. బోనాల నేపథ్యంలో సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు,  డైవర్షన్లు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

సబ్జీ మండిలో 101వ బోనాలు..

సబ్జీ మండిలోని మహంకాళి ఆలయంలో 101వ  బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధి నందకిశోర్ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఆలయ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించి.. అమ్మవారికి బోనం సమర్పించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ఆలయం నుంచి నటరాజ్​నగర్​లోని నల్ల పోచమ్మ ఆలయం వరకు భారీ ఊరేగింపు కొనసాగుతుందన్నారు. అంబారీపై అమ్మవారి ఊరేగింపు కోసంప్రత్యేకంగా కర్ణాటక నుంచి ఏనుగును తెప్పించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

రంగం, బలిగంప, తొట్టెల ఊరేగింపు..

బోనాల జాతరలో భాగంగా సోమవారం ఉదయం రంగం, మధ్యాహ్నం బలిగంప కార్యక్రమం ఉంటుందని    కార్వాన్  దర్బార్    మైసమ్మ ఆలయ కమిటీ  సభ్యులు తెలిపారు. రాత్రి భారీ తొట్టెల ఊరేగింపు మొదలవుతుందన్నారు. మంగళవారం  తెల్లవారుజామున మూసీనదిలోని గణేశ్ ​ఘాట్ వరకు ఊరేగింపు కొనసాగుతుందన్నారు. ఆ తర్వాత   తొట్టెల నిమజ్జనం ఉంటుందన్నారు. 

సీసీ కెమెరాలతో నిఘా 

హైదరాబాద్: లాల్ దర్వాజ బోనాలకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సౌత్, ఈస్ట్ జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని అలర్ట్ చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించారు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టి వాటిని బంజారాహిల్స్​లోని కమాండ్ కంట్రోల్ సెంటర్​కు కనెక్ట్ చేశారు. లాల్ దర్వాజ మహంకాళి సింహవాహిని, అక్కన్న మాదన్న ఆలయాలతో పాటు ఓల్డ్ సిటీలోని ఆలయాల వద్ద సుమారు 2 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయగా.. సిటీ సీపీ ఆనంద్ భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. బోనాలతో వచ్చే మహిళలకు, సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. షీ టీమ్స్ పోలీసుల నిఘాతో పాటు సున్నితమైన ప్రాంతాల్లోని 134 ఆలయాల వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్​తో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బోనాల ఉత్సవాలకు ప్రతి ఒక్కరు సహకరించాలని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్​ ఖర్గే కోరారు.