బయో క్లాక్ దారి తప్పనివ్వదు

బయో క్లాక్ దారి తప్పనివ్వదు

పొద్దున్నే లేచి ఆఫీస్ కి వెళ్లే పని లేదు. వర్క్ ఫ్రం హోం. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటూ టైమింగ్స్ ఏమీ లేవు, ఆకలేసినప్పుడే తినటం. డైట్ కంట్రోల్ తప్పుతోంది గంటగంటకీ ఓ కాఫీ లేదంటే చాయ్, బోర్ కొట్టినప్పుడల్లా చిప్స్, కూల్ డ్రింక్నిద్రపోయే టైం కూడా తగ్గుతోంది అమెజాన్, నెట్ ఫ్లిక్స్ నిండా సినిమాలూ, వెబ్ సిరీస్​లూ వీటన్నింటి మధ్యలో ఇప్పటివరకూ నడుస్తున్న బయోక్లాక్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ లాక్ డౌన్ పేరుతో ఇంట్లోనే ఉండడం వల్ల వస్తున్న సమస్యలే.

ఆదివారం నాడు సెలవని శనివారం రాత్రి ఆలస్యంగా నిద్రపోవటం. ఆదివారం నాడు ఆలస్యంగా నిద్రలేవటం. ఎక్కువ తినటం లాంటివన్నీ… ఇప్పుడు రోజూ చేస్తున్నాం. అయితే దీనికి అలవాటు పడితే మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు సైకాలజిస్టులు. వరసగా సెలవులు వస్తే మామూలుగానే వారాలు మర్చిపోతాం. డేట్ కోసం క్యాలెండర్ వైపు చూస్తాం ఇప్పుడు లాక్ డౌన్ వల్ల చాలామందికి ఇదే అలవాటుగా మారే అవకాశం ఉంది అంటున్నారు.

ఇవి సెలవులు కాదు

ఇప్పుడు వీకెండ్​కి విలువేలేదు. వీక్ మొత్తం సెలవుల్లాగానే ఉన్నప్పుడు ఇక వీక్ ఎండ్ ఎక్కడిది. ఇప్పుడు మనం ఉన్నది ఒకరకంగా మెడికల్ ఎమర్జెన్సీలో. ఇవి సెలవులు కాదన్న సంగతి మర్చిపోవద్దు. ఇంతకు ముందున్న లైఫ్ స్టైల్​లో మార్పు వచ్చేంతగా ఈ లాక్ డౌన్ రోజులకి అలవాటు పడొద్దనేది డాక్టర్ల సలహా.

 రోజూ ఉండే అలవాట్లు మారిపోతే…

ఖాళీగా ఉండే ఛాన్స్ వచ్చినప్పుడు రోజూ మామూలుగా చేసే పనులని వాయిదా వెయ్యటమో, అసలు చెయ్యకుండా ఉండటమో చేస్తుంటాం. ఎగ్జాంపుల్ రోజూ ఉదయం ఆరు గంటలకు నిద్ర లేవటం, పొద్దున్నే స్నానం, టిఫిన్ ఇలాంటివన్నీ సెలవు రోజున టైం దాటిపోతాయి. లేదంటే అసలు ఆరోజుకు చెయ్యకుండానే ఉంటాం. లాక్‌‌డౌన్‌‌టైంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. వరుసగా ఇంట్లోనే ఉండాల్సి రావటం వల్ల. మనం రెగ్యులర్​గా చేసే పనుల టైమింగ్స్ మారిపోతున్నాయి. పొద్దున లేట్​గా లేవటం, తినటానికి టైం లేకపోవటం. ఎక్కువగా జంక్ ఫుడ్ తినటం లాంటివి ఈ టైంలో ఎక్కువమంది చేస్తున్న పనులు. కానీ ఇదే అలవాటైతే తర్వాత మళ్ళీ పాత టైమింగ్స్ ఫాలో అవటం ఇబ్బంది. సుఖానికి అలవాటు పడ్ద బాడీ మళ్ళీ స్ట్రిక్ట్ గా పని చేయటానికి ఒప్పుకోదు. సెట్ కావటానికి టైం తీసుకుంటుంది. ఆలోపే ఇబ్బందులు వచ్చి పడతాయి. కొన్ని మంచి అలవాట్లని పూర్తిగా మానేసే ప్రమాదమూ ఉంది.

అలవాట్లు ఈ టైంలో మారిపోతాయ్

మార్నింగ్ వాక్ అలవాటు ఉన్నవాళ్లు ఈ టైం లో బయటికి వెళ్ళే వీలులేదని పొద్దున్నే లేవకపోతే… తర్వాత వాకింగ్ చేయటానికి బాడీ సపోర్ట్ చెయ్యదు. అలానే లేట్​ నిద్ర కూడా… లాక్ డౌన్ మొదలైన దగ్గర్నించీ ఆన్​లైన్​ గేమ్స్ ఆడుతూ రాత్రి నిద్ర పోవడంలేదు. ఎన్నో రోజులుగా ఉన్న అలవాట్లు ఈ టైంలో మారిపోయే అవకాశం ఎక్కువ.

ఇమ్యూనిటీ సిస్టం

మన డెయిలీ రొటీన్​ బట్టి మన శరీరం ట్యూన్ అవుతుంది. నిద్ర, ఎక్సర్ సైజ్, ఫుడ్ టైమింగ్స్, రెస్ట్ టైం ఇవన్నీ ఒక టైంకి చేయటం అలవాటు చేసుకుంటుంది. అయితే ఉన్నట్టుండీ ఇప్పుడు మనం దాన్ని డిస్టర్బ్ చేయటం వల్ల సడన్​గా కొన్ని హెల్త్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి దెబ్బ పడేది ఇమ్యూనిటీ సిస్టం మీద. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్యూనిటీని కాపాడుకోవటం చాలా అవసరం. ఇమ్యూనిటీ తగ్గితే ఈజీగా వ్యాధి సోకటమే కాదు. తొందరగా ట్రీట్​మెంట్​కి లొంగదు కూడా. ఇప్పుడు  కరోనా విషయంలో ఇదే జరుగుతోంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండే పిల్లలు, ముసలి వాళ్ళకి కరోనా వైరస్‌‌సోకే అవకాశాలు ఎక్కువ. వీళ్లతో పాటు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు, డయాబెటిక్స్, ఇదివరకు టీబీ, హెపటైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్​తో బాధపడ్డ వాళ్ళు జాగ్రత్తపడక తప్పదు. ఈ వైరస్​ను చంపేసే మందులు లేకపోవడం కరోనాకు కలిసి వస్తోంది. మనలో ఉండే ఇమ్యూనిటీ పవర్​ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఈ వైరస్ నుంచి తప్పించుకోగలం.
మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళి నడిచే అవకాశం లేదు. అలాగే షుగర్, బీపీ సమస్యలు ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఉంటూ అవసరానికి మించి ఫుడ్ తీసుకోవటం, చిరుతిళ్లు ఎక్కువగా తినటం, నిద్ర సరిగా పోకపోవడం వల్ల షుగర్ లెవల్స్ ఈజీగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఇది అన్నిటికన్నా ప్రమాదకరం.

పానిక్ అవ్వొద్దు

పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలంతే. టైంకి తిండీ నిద్రా ఉండేలా చూసుకోవాలి. ఎంతో కాలంగా షుగర్‌‌, బీపీలతో బాధపడుతున్నా ఇప్పటికే టెస్టులు చేయించుకొని వాడుతున్న మందులని ఏమాత్రం లైట్ తీసుకోకుండా కంటిన్యూ చేయాలి. మార్నింగ్ వాక్, జిమ్​కి వెళ్ళే అలవాటున్న వాళ్ళు ఇంట్లో చేయగలిగిన ఎక్సర్ సైజులు చేయాలి. ఇంతకు ముందున్న మన లైఫ్ స్టైల్​ని ఏమాత్రం డిస్టర్బ్ చేసుకోవద్దు.

  • డయాబెటిస్ బాధితులు చక్కెర పూర్తిగా మానేసి కొద్ది మొత్తంలో చక్కెరకు బదులు బెల్లం, తాటిబెల్లం లాంటివి వాడొచ్చు. కొన్నాళ్ల పాటు  స్వీట్స్‌‌జోలికి అసలు వెళ్ళొద్దు. నూనెలు బాగా తగ్గించాలి. బీపీ బాధితులు ఉప్పు తక్కువగా వాడాలి.
  •  టీవీ, ఇంటర్​నెట్, తినడం, నిద్రపోవడం, పని ఇలా దేనిలోనైనా కొంచెం తక్కువగా ఉంటేనే మంచిది. మామూలు రోజుల్లో ఎలా ఉన్నారో అలానే ఉండాలి.
  • వర్కవుట్స్, వాకింగ్ ఎక్కువసేపు చేసే అవకాశం లేదు. కాబట్టి శరీరానికి క్యాలరీలు ఇచ్చే ఫుడ్ తీసుకోవడం మంచిది. తక్కువ క్వాంటిటీలో ఎక్కువసార్లు ఫుడ్ తీసుకోవాలి. వాకింగ్ ఎక్కువ దూరం చేయలేం  కాబట్టి అపార్ట్​మెంట్ అయితే మెట్లు ఎక్కి దిగటం, అపార్ట్​మెంట్ కారిడార్ లో, టెర్రస్ మీద నడవడం వంటివి చేయొచ్చు. అయితే మెట్ల రెయిలింగ్స్, కారిడార్​లో గోడలని ముట్టుకోకుండా నడవాలి.
  • నెలనెలా టెస్ట్​లు చేసుకునే అవకాశం లేకపోవటం, వర్కవుట్స్​ తక్కువగా చేయటం వల్ల, ఫుడ్​లో వచ్చిన మార్పుల వల్ల వల్ల షుగర్‌‌, బీపీ లెవల్స్ పెరిగినట్టు అనిపించటం మామూలే. దానికి మరీ ఎక్కువగా భయపడటం అనవసరం. ఎక్కువగా టెన్షన్ పడటం మంచిది కాదు. బీపీ, షుగర్‌‌లెవల్స్​లో చిన్న చిన్న మార్పలొస్తే వాటి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఇంతకుముందు వాడుతున్న మందులనే కంటిన్యూ చెయ్యాలి. అవి దొరక్కపోతే డాక్టర్​తో ఫోన్​లో మాట్లాడి వాళ్ల సజెషన్స్ ఫాలో అవుతూ అదే కాంబినేషన్‌‌ఉన్న వేరే మందులు వాడొచ్చు.