‘లవ్​ ఎవ్రీబడీని ప్రచారం చేయండి’

‘లవ్​ ఎవ్రీబడీని ప్రచారం చేయండి’

‘వీలైతే ప్రేమిద్దాం డూడ్​. పోయేదేముంది? మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’ అంటాడు ఒక తెలుగు సినిమాలో హీరో. ఈ ఫొటోలో కనిపిస్తున్న పెద్దాయనది కూడా సేమ్​ డైలాగ్​. కాకపోతే కొంచెం మార్చి సింపుల్​గా ‘లవ్​ ఎవ్రీబడీ’ అంటున్నాడు. అంతేకాదు, అదే మాటను ఒక కాగితంపై రాసి, తనను కలిసిన వాళ్ళకు ఇస్తుంటాడు. దాంతోపాటు ఒకటి లేదా రెండు డాలర్లు డబ్బు కూడా ఇస్తాడు. కొంతమందికి ఐదు డాలర్లు కూడా ఇచ్చాడు. దానికి బదులుగా వాళ్లను ‘లవ్​ ఎవ్రీబడీని ప్రచారం చేయండి’ అని అడుగుతున్నాడు. ఇలా ఆయన ఎనిమిదేండ్లుగా చేస్తున్నాడు.

దాని కోసం ఇప్పటివరకు 13వేల డాలర్ల (సుమారు 10 లక్షలు) పైనే ఖర్చు పెట్టాడు. ఆయన ఇలా చేయడం వెనక ఒక అమ్మ ప్రేమ ఉంది. ఈ పెద్దాయనకు వాళ్ల అమ్మ చనిపోతూ చెప్పిన మాట ‘లవ్​ ఎవ్రీబడీ’. ఈ మాటను ఆయన పాటించడమే కాదు, అందరికీ చెప్తున్నాడు కూడా. ఈయన కథను కెవిన్​ కేట్​ అనే వ్యక్తి ట్వీట్​ చేయడంతో అది వైరల్​గా మారింది. ఆ పెద్దాయనను, ఆయన పంచుతున్న ప్రేమ స్ఫూర్తిని అందరూ మెచ్చుకుంటూ కామెంట్లు, రీట్వీట్​లు చేస్తున్నారు. ఇంతకీ ఈయన ఎక్కడుంటాడో చెప్పలేదు కదూ? అమెరికాలోని టల్హాసీ టౌను దగ్గరలోని ఒక హైవేకి ఆనుకొని ‘వఫల్​ హౌస్​’ అనే రెస్టారెంట్​ ఉంది. అందులో కనిపిస్తాడు.