మైండ్ బ్లాక్ ఇన్నొవేషన్స్

మైండ్ బ్లాక్ ఇన్నొవేషన్స్

ఏథెన్స్​కు చెందిన ఆర్కిటెక్ట్, డిజైనర్ కతెరినా కంప్రాని. ఏగాన్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ డిజైన్​ చదువుకుంది. ఆ తర్వాత ‘ది అన్​కంఫర్టబుల్’ అనే ప్రాజెక్ట్ చేసింది. ఎవరైనా ప్రతి పనిలోనూ సౌకర్యం, సులువు కోరుకుంటారు. ఉదాహరణకు కాయగూరలు​, పండ్ల ముక్కలు తినాలంటే ఫోర్క్​తో ఈజీగా తినొచ్చు. కానీ, కంప్రాని తన ఇన్నోవేటివ్​ ఆలోచనలతో ఫోర్క్​ తల, మొండానికి మధ్యలో ఒక చైన్​ పెట్టింది. ఆలోచన వెరైటీగానే ఉన్నా, చైన్​ ఫోర్క్​తో తినేదెలా? అని తల పట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వింతైన, విచిత్రమైన ఆలోచనలతో మరికొన్ని ప్రొడక్ట్స్​ తయారుచేసింది కంప్రాని. అయితే అవేవీ వాడటానికి పనికిరావు. అంతెందుకు వాటిని ఎలా వాడొచ్చు? అని కూడా ఆలోచించలేరు. 

అయితే, వీటిని చూడగానే పెదాల మీదకు నవ్వు వచ్చి చేరుతుంది. అయితే వీటిని ఆవిష్కరించడం వెనక ఒక హృదయం బరువెక్కించే కథ ఒకటి ఉంది. అదేంటంటే... గ్రీకు దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న రోజులవి. అప్పుడే చదువు పూర్తి చేసి జాబ్ వెతుక్కునే ప్రయత్నంలో ఉన్న కతెరినాకి అది పెద్ద సవాలుగా మారింది. ఆ టైంలో ఆమె విపరీతమైన ఫ్రస్ట్రేషన్​కి లోనైంది. అప్పుడు ఆమెకి వచ్చిన ఆలోచనే ‘ది అన్​ కంఫర్టబుల్​’. ప్రతి ఒక్కరూ లైఫ్​ కంఫర్టబుల్​గా ఉండాలని ఏవేవో కనిపెడుతున్నారు. కానీ, అన్​కంఫర్టబుల్​గా కనిపెడితే ఎలా ఉంటుంది? అనుకుంది. అలా మొదలైన ఈ ప్రాజెక్ట్ ఎక్స్​పరిమెంట్​లో ఎన్నో ఫెయిల్యూర్స్​ తరువాత సక్సెస్​ అయింది. ఆమె ఇన్నొవేషన్స్​ని ఫొటోలు తీసి, వాటి ఫ్రేమ్​లను అమ్ముతోంది ఇప్పుడు. అలాగని, ఇవి ఎవరికి పనికి రావులే అని తీసి పారేయలేం. బ్రెయిన్​ ఇంజ్యూరీ, మోటార్​ కంట్రోల్ డెఫిసిట్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్ల మీద చేస్తున్న రీసెర్చ్​లో ఇవి ఉపయోగపడుతున్నాయట.