మిస్టరీగా మారిన ఉక్రెయిన్ విమానం ప్రమాదం

మిస్టరీగా మారిన ఉక్రెయిన్ విమానం ప్రమాదం

టెహ్రాన్‌: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు. బుధవారం ఉదయం ఉక్రేయిన్‌కు చెందిన బోయింగ్ 737 విమానం కూలడంతో అందులో ప్రయాణిస్తున్న 167 మంది ప్రయాణికులతో పాటు మరో 9 మంది ఫ్లైట్ సిబ్బంది కలిపి మొత్తం 176 మంది చనిపోయారు. టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానం కుప్పకూలింది. అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రమాదంపై అనేక  అనుమానాలు వస్తున్నాయి.

ఇంజిన్‌ వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తొలుత పేర్కొన్న ఉక్రెయిన్ ప్రభుత్వం..  తాజా ప్రకటనలో ‘ఇంజిన్ వైఫల్యం’ అనే పదాలను తొలగించింది.  ప్రమాదానికి గల కారణాన్ని ఇప్పుడే చెప్పలేమని, ఘటనకు గల కారణాలపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని ఉక్రెయిన్‌ ప్రధాని చెప్పారు. కాగా..  ప్రమాదానికి గురైన ఉక్రెయిన్‌ విమానం నుంచి రెండు బ్లాక్‌బాక్స్‌లను ఇరాన్‌ రెస్క్యూ బృందం సేకరించింది. ఆ బ్లాక్‌బాక్స్‌లను బోయింగ్‌ కంపెనీకి ఇచ్చేందుకు బృందం నిరాకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

విమానం నేలకూలిన తర్వాత మంటల్లో కాలి బూడిదైందని ఇరాన్ చెబుతుండగా, వీడియో ఫుటేజ్ లో మాత్రం విమానం గాల్లోనే అగ్నికీలల్లో చిక్కుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కూడా ఇరాన్ వైఖరి పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. మొత్తానికి ఈ ప్రమాదం మిస్టరీ గా మారింది.

Mystery surrounds Ukraine plane crash killing 176 onboard, Tehran refuses to handover blackbox