రాకపోకలు లేక ఇబ్బంది పడుతున్నాం: నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ డిమాండ్

రాకపోకలు లేక ఇబ్బంది పడుతున్నాం: నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ డిమాండ్

ముషీరాబాద్,వెలుగు: నల్లకుంట కూరగాయల మార్కెట్​లోని హెరిటేజ్ వద్ద నాలా బ్రిడ్జి పనులు ప్రారంభమై 15 నెలలు అయినా పూర్తికాలేదని నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ పేర్కొంది. నాలా పనుల్లో పగిలిపోయిన మంచినీటి డ్రైనేజీ పైపులకు వెంటనే రిపేర్లు చేపట్టాలని కోరారు. గురువారం ముషీరాబాద్​లోని చిలకలగూడ వాటర్ వర్క్స్ ఆఫీసులో డీజీఎం మోహన్ రాజును అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్ నాయుడు, నిర్వహణ కార్యదర్శి వీరయ్య మాట్లాడుతూ.. నల్లకుంట, శంకర్ మార్ట్, బాగ్ లింగంపల్లికి రాకపోకలు లేక స్థానిక కాలనీ వాసులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

నాలా రోడ్డు పనులతో తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నల్లకుంట కూరగాయల మార్కెట్​లో మూన్ కేఫ్ వద్ద నాలా పనుల్లో మంచినీటి పైపులు పగిలి నీరు లీకేజీ అవుతుందన్నారు. దీంతో నాలా రోడ్డు పనులు ఆగిపోయాయన్నారు. మూడు నెలలు గడుస్తున్నా రిపేర్లు జరగడం లేదన్నారు. ఇప్పటికైనా మంచినీటి డ్రైనేజీ పైప్​లకు రిపేర్లు వెంటనే చేపట్టి నాలా, రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ప్రతినిధులు వెంకట స్వామి గౌడ్, శ్రీనివాసరావు, రమణ, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.