వేప చెట్లు ఎండిపోతున్నయ్!

వేప చెట్లు ఎండిపోతున్నయ్!

పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్​ మండలం కంబాళాపూర్​గ్రామంలో 1800 వరకు వేపచెట్లు ఉన్నాయి. ఆరు నెలల నుంచి వేప చెట్ల ఆకులు వాడిపోతూ చెట్లు ఎండిపోతున్నాయి. గ్రామంలో ఎన్నో రకాల చెట్లు ఉన్నా కేవలం ఔషధ గుణాలున్న వేపచెట్లు మాత్రమే ఎండిపోతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి నాలుగుదిక్కుల పొలిమేరలతోపాటు ప్రధాన రోడ్డుకు ఇరువైపుల పచ్చగా కనిపించే దశాబ్దాల నాటి వృక్షాలు, ఇండ్ల మధ్యలోని చెట్లు కూడా ఎండిపోయాయి. గ్రామం నడిబొడ్డున దర్గా దగ్గర ఉన్న చిన్న చెట్టు ఒక్కటే ఎండిపోలేదు. ఫామోప్సిస్​ అజాదిరక్టె అనే శిలీంధ్రం చెట్లకు సోకినట్లు జడ్చర్లలోని బొటనీ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ డాక్టర్​ సదాశివయ్య  తెలిపారు. ఈ వ్యాధి వర్షాలు పడినపుడు ఒక చోటు నుంచి మరో చోటుకు వ్యాపిస్తుందన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళితే మా పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్నారని ఎంపీటీసీ ఎల్లస్వామి తెలిపారు. చివరికి కలెక్టర్​దృష్టికి తీసుకెళ్తే అధికారులను పంపిస్తానని చెప్పారన్నారు. అధికారులు స్పందించి చెట్లు బతికేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.