ఆ కోటాలు ఉంటయా లేదా

ఆ కోటాలు  ఉంటయా లేదా

హైదరాబాద్, వెలుగుఉన్నత విద్యాసంస్థల్లో ఎకనామికల్లీ వీకర్​సెక్షన్స్ (ఈడబ్ల్యూఎస్​) కోటా, స్పోర్ట్స్ కోటా అమలుపై  రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఇప్పటికే సెట్స్ కమిటీ సమావేశాల షెడ్యూల్​ఖరారైంది. వచ్చే నెల మొదటి వారంలో దాదాపు అన్నిసెట్స్​నోటిఫికేషన్స్​రిలీజ్ కానున్నాయి. అయినా ఆయా కోటాల అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవోలు విడుదల కాలేదు.  దీంతో 2020–21 నుంచైనా ఈ రెండు కోటాలు అమలు చేస్తారా లేదా అని పేరెంట్స్, స్టూడెంట్స్ లో ఆందోళన నెలకొంది.

కోటా డిసైడ్ చేయకుంటే స్టూడెంట్స్ కు నష్టమే..

రాష్ట్రంలో 1,145 డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన కాలేజీలున్నాయి. వీటిలో 1.90 లక్షల సీట్లున్నాయి. ఎంసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్ సెట్… ఇలా అన్ని ప్రవేశపరీక్షల సమావేశాలు ఈ నెలాఖరు వరకూ పూర్తవుతాయి. మార్చి ఫస్ట్​వీక్​లో నోటిఫికేషన్​కూడా విడుదల చేసేందుకు షెడ్యూల్​ సిద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ కోటా అమలుపై పడింది. వీటిని 2020–21 నుంచి అమలు చేయకుంటే, అగ్రకులాల్లోని పేద విద్యార్థులు, క్రీడాకారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే దీనిపై ఇటు ఉన్నత విద్యామండలి అధికారులు గానీ, సాట్స్​అధికారులు గానీ సప్పుడు చేయడం లేదు.

ఈడబ్ల్యూఎస్​ కోటా ఉంటదా…?

అగ్రకులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్​చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని అమలు చేసేందుకు రాష్ట్రాలకు రెండేండ్ల గడువు ఇచ్చింది. ఈ గడువు ఈ విద్యాసంవత్సరంతోనే ముగుస్తోంది. దీంతో 2020–21 నుంచి తప్పకుండా ఈడబ్ల్యూఎస్​ కోటా అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే కేంద్రం ఆధీనంలోని విద్యాసంస్థల్లో గతేడాది నుంచే ఈడబ్ల్యూఎస్​ కోటా అమలవుతోంది. వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని అన్ని విద్యాసంస్థల్లో పదిశాతం ఈడబ్ల్యూఎస్​ కోటాను అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ, ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. అయితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తారా లేదా కేంద్రాన్ని మరింత గడువు కోరుతారా అనేదానిపై ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ కోటా అమలు చేస్తే సుమారు 20 వేల సీట్లు పెరిగే అవకాశముంది.

స్పోర్ట్స్​కోటా అమలయ్యేనా… ?

మూడేండ్ల కింది వరకూ స్టేట్ లోని అన్ని కాలేజీ అడ్మిషన్లలో 0.5 శాతం స్పోర్ట్స్​కోటా ఉండేది. హైకోర్టు ఆదేశాల మేరకు 2018–19, 2019–20 లో ఈ కోటా అమలుకు నోచుకోలేదు. అయితే మెడికల్ సీట్ల విషయంలో జరిగిన అవకతవకల నేపథ్యంలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మెడికల్ కాలేజీలతోపాటు అన్ని రకాల అడ్మిషన్లలో స్పోర్ట్స్​కోటాను రద్దు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్​తయారుచేసింది. దీంట్లో కొన్ని స్టేట్​కు సంబంధం లేని క్రీడలను చేర్చడంపై మళ్లీ ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాట్స్ ఎండీ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ స్పోర్ట్స్​కోటాను ఎలా అమలు చేయాలనే దానిపై పలు సూచనలు చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం కమిటీ రిపోర్టుపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఈ కోటా అమలు చేస్తే  క్రీడాకారులకు వెయ్యి సీట్లు దక్కే అవకాశముంది.