హాస్టల్ కేటాయింపుపై నర్సింగ్ విద్యార్థినుల ఆందోళన

హాస్టల్ కేటాయింపుపై నర్సింగ్ విద్యార్థినుల ఆందోళన

హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కామినేని హాస్పిటల్ లో నర్సింగ్ విద్యార్థినులు ఆందోళన చేశారు. మొదటి సంవత్సరం పూర్తయి, రెండో సంవత్సరంలో ప్రవేశానికి సంబంధించిన హాస్టల్ కేటాయింపుపై కాలేజీ యాజమాన్యం ఒప్పుకోవడం లేదని ఆరోపించారు. హాస్టల్ మారాలంటూ యాజమాన్యం విద్యార్ధులపై ఒత్తిడి చేస్తోందన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ మారకపోతే ఇంటికి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇస్తున్నారని తెలిపారు. ఫస్ట్ ఇయర్ లో ఒక హాస్టల్ చూపించి...ఇప్పుడు మరో హాస్టల్ కు వెళ్లాలని చెప్పడం సరికాదని వాపోతున్నారు.

డబ్బులు మొత్తం కట్టించుకుని సరైన వసతులు లేని హాస్టల్ కు పంపించడంపై నర్సింగ్ విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ గేటు ఎదుట స్టూడెంట్స్ ధర్నాకు దిగారు. కాలేజీ యాజమాన్యం స్పందించి వెంటనే తమకు మొదటి సంవత్సరంలో కేటాయించిన హాస్టల్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.