హిందువులను కించపరిచాడు : పాక్ లో మంత్రి రాజీనామా

హిందువులను కించపరిచాడు : పాక్ లో మంత్రి రాజీనామా

ఇస్లామాబాద్ : హిందువులు ఆవు మూత్రం తాగుతారంటూ కించపరిచే మాటలు మాట్లాడిన పాకిస్థాన్ మంత్రిని.. అక్కడి అధికార పార్టీ రాజీనామా చేయించింది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి ఫయాజుల్ హసన్ చౌహాన్ ఇటీవల ఓ సభలో మైనారిటీలైన హిందువులను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నాయకులు, మైనారిటీ వర్గం నుంచి దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.

పంజాబ్ ప్రావిన్స్ సీఎం ఉస్మాన్ బుజ్దార్ కూడా ఫయాజుల్ కామెంట్స్ పై సీరియస్ అయ్యారు. వెంటనే వివరణ కోరి.. మంత్రి పదవికి రాజీనామా చేయించారు. తాను భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఎయిర్ ఫోర్స్ ను ఉద్దేశించి ఈ మాటలు అన్నానీ.. పాకిస్థాన్ లోని హిందూ కమ్యూనిటీని ఉద్దేశించి కాదని వివరణ ఇచ్చారు ఫయాజుల్.

అధికార పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ దీనిని సీరియస్ గా తీసుకుంది. తమ జెండాలని పచ్చరంగు ముస్లింలకు ప్రతిబింబం అయితే.. తెలుపు మైనారిటీలకు చిహ్నం అని పార్టీ నాయకులు చెప్పారు. మైనారిటీల హక్కులు, మనోభావాలను గౌరవిస్తామని చెప్పారు.

పాకిస్థాన్ లో హిందువులు మైనారిటీలు. సింధు ప్రావిన్స్ లో ఎక్కువమంది నివసిస్తున్నారు. దాదాపుగా 90లక్షల మంది హిందువులు అక్కడ నివసిస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయం, భాషలను.. తమ దేశ పౌరులు పరస్పరం గౌరవిస్తారని..దీనికి భంగం కలిగించేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని పాక్ విదేశాంగ ప్రతినిధులు చెప్పారు.