అప్పుడు రెచ్చగొట్టి ..ఇప్పుడు పట్టించుకోరేం?

అప్పుడు రెచ్చగొట్టి ..ఇప్పుడు పట్టించుకోరేం?

హైదరాబాద్, వెలుగు: క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో పనిచేయాలని.. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ, వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్లకు కార్యకర్తలు సిద్ధం కావాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ పిలుపునిచ్చారు. దేశానికి  స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ, పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెసేనని గుర్తు చేశారు. ఆదివారం క్విట్ ఇండియా 78వ దినోత్సవం సందర్భంగా ఉత్తమ్ గాంధీభవన్ లో కాంగ్రెస్ ఎజెండా ఎగరవేసి మాట్లాడారు. సాగు నీటి విషయంలో తెలంగాణకు తీవ్రంగా నష్టం జరుగుతోందని చెప్పారు. తెలంగాణ రాకముందు కృష్ణా జలాలపై ఏవేవో మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఆడంబరాల కోసం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేశారని విమర్శించారు.పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీళ్లు దోచుకుపోతుంటే ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. ఏపీలో పోతిరెడ్డిపాడు, రాయలసీమ ప్రాజెక్టులు కడుతుంటే.. ఇక్కడ కేసీఆర్ మాత్రం కొత్త సెక్రటేరియేట్ కోసం మీటింగ్ పెట్టడం దారుణమని ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చడం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నా రు. కరోనా కట్టడిలో రాష్ట్రసర్కారు పూర్తిగా ఫెయిలైందని మండిపడ్డారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి, నేతలు జగ్గారెడ్డి, జానారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నా రు.

నేడు సిద్దిపేట, నాగర్ కర్నూల్లో నంది ఎల్లయ్య సంతాప సభలు

కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య మృతిపట్ల సంతాప సభలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఆదివారం గాంధీభవన్లో ఉత్తమ్, ఇతర నేతలు నంది ఎల్లయ్య చిత్రపటానికి పూల దండలు వేసి నివాళిఅర్పించారు. సోమవారం సిద్దిపేట, నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లో సంతాప సభలు నిర్వహిస్తామని ఉత్తమ్ తెలిపారు. జూమ్ యాప్ ద్వారా కూడా సంతాప సభ నిర్వహిస్తామన్నారు.