రైళ్లపై దాడికి పాల్పడ్డ 85 మంది అరెస్ట్

రైళ్లపై దాడికి పాల్పడ్డ 85 మంది అరెస్ట్

సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ప్రాంతాల్లో రైళ్లపై  రాళ్లతో దాడి చేసిన 85 మందిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితులపై రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  రైళ్లపై దాడులను అరికట్టడానికి  చర్యలను వేగవంతం చేశామని అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్‌‌లు,  స్టేషన్లలో  ఆర్పీఎఫ్​ నిఘా ముమ్మరం  చేసిందన్నారు. రాళ్ల దాడికి సంబంధించిన నిందితులను గంటల వ్యవధిలోనే  గుర్తించేందుకు సర్వత్రా ప్రయత్నాలు జరుగుతున్నాయని,  రైలు మార్గాల్లో  సీసీటీవీ కెమెరాలు, ఆర్పీఎఫ్ సైబర్ సెల్ ఇన్‌‌పుట్‌‌లు,  ఇతర నిఘా పరికరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రైళ్లపై దాడిచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  దీంతో వారు  ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హతతో పాటు వారి ఉద్యోగ అవకాశాలను కోల్పోతారన్నారు.  

రైళ్లపై రాళ్లు రువ్వడం వల్ల ప్రయాణికుల  భద్రతకు తీవ్రమైన ముప్పు తో పాటు  రైల్వే ఆస్తులకు కూడా నష్టం వాటిల్లుతుందన్నారు. ఇది  రైల్వే వ్యవస్థ  సజావుగా పనిచేయడానికి ఆటంకం కలిగిస్తుందని అధికారులు వివరించారు.  ఈనేపథ్యంలో  రైల్వే ట్రాక్ ల పరిసర  ప్రాంతాల్లోని గ్రామాలు, ఎల్సీ గేట్లు, స్టేషన్లలో  ఆర్పీఎఫ్​ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. గతంలో  రైళ్లపై రాళ్లు రువ్విన  ప్రదేశాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను నియమించామని, ఈ ఏడాది 5000 పైగా దాడులు జరుగగా, 147  కేసులు నమోదు చేశామని ఆర్పీఎఫ్​ అధికారులు వెల్లడించారు.