ప్లాస్టిక్‌‌‌‌ మహా డేంజర్‌‌

ప్లాస్టిక్‌‌‌‌ మహా డేంజర్‌‌

ప్లాస్టిక్‌‌‌‌ వాడకాన్ని తగ్గించాలని ఆగస్టు 15 స్పీచ్‌‌‌‌లో దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. పార్లమెంటు కాంప్లెక్స్‌‌‌‌లో ప్లాస్టిక్‌‌‌‌ వాడకాన్ని నిషేధిస్తామని ఆగస్టు 20న సర్కారు ప్రకటించింది. 2022 నాటికి డిస్పోజబుల్‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌ వాడకాన్ని నిషేధిస్తామంది.  ఇండియానే కాదు.. ప్రపంచ దేశాలూ ప్లాస్టిక్‌‌‌‌ నిషేధంపై నడుం బిగించాయి. దేశాలన్నీ ఎందుకింతలా ప్లాస్టిక్‌‌‌‌ బ్యాన్‌‌‌‌పై దృష్టిపెట్టాయి. అంతలా ఏం నాశనం చేస్తున్నాయి ఆ ఉత్పత్తులు. అసలు ప్లాస్టిక్‌‌‌‌
ఎట్ల స్టార్టయింది?

భూమిపై సగం ప్లాస్టిక్‌‌‌‌ను గత 19 ఏళ్లలోనే ఉత్పత్తి చేశాం. 1950 నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌‌‌‌ భూమ్మీదకొస్తే ఇందులో 44 శాతం 2000 నుంచి ఇప్పటివరకు ఉత్పత్తి అయింది. దాన్నంతా పేరిస్తే ఎవరెస్టు పర్వతమంత అవుతుందట. ఇండియా విషయానికొస్తే రోజూ 25,940 టన్నుల ప్లాస్టిక్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ బయటకొస్తోంది. అంటే 9 వేల ఆసియా ఏనుగులంత బరువన్నమాట. ఇంత వాడుతున్నా ప్రపంచంలో ప్లాస్టిక్‌‌‌‌ తక్కువ వాడుతున్న వాళ్ల జాబితాలో మనమూ ఉన్నాం. నమ్మరా.. అయితే ఈ లెక్కలు చూడండి. యావరేజ్‌‌‌‌గా ఒక్కో ఇండియన్‌‌‌‌ ఏడాదికి11 కిలోల ప్లాస్టిక్‌‌‌‌ను వాడుతున్నాడు. అదే ప్రపంచవ్యాప్తంగా సరాసరి తీస్తే 28 కిలోలు.

వండర్‌‌‌‌ టు వరస్ట్‌‌‌‌

ప్లాస్టిక్‌‌‌‌ తొలినాళ్లలో బయటకొచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. భలే ఉందనుకున్నారు. కానీ మెల్లిమెల్లిగా తెలిసింది దాని ప్రతాపం. మనుషుల ఉనికినే ప్రశ్నార్థకం చేసే రేంజ్‌‌‌‌కు వచ్చేసింది. మహమ్మారిలా మారింది. సైంటిస్టుల నుంచి సామాన్య మనుషుల వరకు అందరూ దాని ధాటికి భయపడిపోతున్నారు. ప్లాస్టిక్‌‌‌‌ వాడకం తగ్గించాలని ప్రపంచ పర్యావరణ సంస్థలు మొత్తుకుంటున్నాయి.

ఏటా లక్ష కోట్ల బ్యాగులు

ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్ష కోట్ల ప్లాస్టిక్‌‌‌‌ బ్యాగులను వాడుతున్నారు. యూఎన్‌‌‌‌ఈపీ ప్రకారం ఈ ప్లాస్టిక్‌‌‌‌ బ్యాగులు పర్యావరణానికి ప్రమాదం. నీటి ప్రవాహాన్ని ఆపుతాయి. వీటిని తిండి అనుకొని తిని జంతువులు చచ్చిపోతాయి. దోమలు పెరగడానికి అవకాశమిస్తాయి. పైగా ఇవి భూమిలో కలవడానికి వందల ఏళ్లు పడుతుంది. ఇప్పటివరకు ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌‌‌‌లో 80 శాతం భూమిలో కలిసిపోకుండా ఇంకా అలానే ఉంది.

ఫస్ట్‌‌‌‌ దేశం బంగ్లాదేశ్‌‌‌‌

ప్లాస్టిక్‌‌‌‌ను బ్యాన్‌‌‌‌ చేసిన తొలి దేశం బంగ్లాదేశ్‌‌‌‌. 2002లో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా మాత్రం ఇప్పటివరకు బ్యాన్‌‌‌‌ చేయలేదు. కొన్ని రాష్ట్రాలు మాత్రం సొంతంగా నిషేధించాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగానైతే 127 దేశాలు ప్లాస్టిక్‌‌‌‌ను బ్యాన్‌‌‌‌ చేశాయి. 27 దేశాలు సింగిల్‌‌‌‌ యూజ్‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌ను నిషేధించాయి.

కంపెనీలు పట్టించుకోవాలి

ప్లాస్టిక్‌‌‌‌ వాడకం విపరీతంగా పెరుగుతుండటం, అది పర్యావరణాన్ని తీరొక్కతీరు నాశనం చేస్తుండటంతో ప్రజలు, ప్రభుత్వాలు మేలుకున్నాయి. చాలా దేశాలు ప్లాస్టిక్‌‌‌‌ ఉత్పత్తి కంపెనీలపై ఒత్తిడి పెంచాయి. నిబంధనలు కఠినం చేశాయి. ట్యాక్స్‌‌‌‌లు పెంచాయి. దీంతో తమపై సుమారు 5 శాతం వరకు భారం పడుతోందని బీవరేజ్‌‌‌‌ కంపెనీలు చెబుతున్నాయి. రెగ్యులేషన్స్‌‌‌‌ వల్ల మరో 20 ఏళ్లలో ఆరో వంతు వరకు ప్లాస్టిక్‌‌‌‌ ఉత్పత్తి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇంత జరుగుతున్నా అమెరికాలోని రాయల్ డచ్‌‌‌‌ షెల్‌‌‌‌ కంపెనీ తన బ్రాంచులను విస్తరిస్తోంది. మున్ముందు పది లక్షల టన్నుల కన్నా ఎక్కువ ప్లాస్టిక్‌‌‌‌ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్లాస్టిక్‌‌‌‌ ఎట్ల స్టార్టయింది?

1907లో: తొలిసారి 1907లో మాడ్రన్‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌ బేకలైట్‌‌‌‌ను అమెరికాలో కనుగొన్నారు. అప్పుడు ఎలక్ట్రిక్‌‌‌‌ వైరింగ్‌‌‌‌లో వాడారు. తర్వాత తెలిసింది.. చాలా రకాలుగా వాడుకోవచ్చని. కొన్నేళ్లల్లోనే రకరకాల ప్లాస్టిక్‌‌‌‌ వెరైటీలు, ప్లాస్టిక్‌‌‌‌ వస్తువులు అందుబాటులోకి వచ్చాయి.

1939-45: ప్రపంచయుద్ధం టైంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. ఇంకా చెప్పాలంటే అవసరమైంది. ప్రతి దాంట్లో వాడేశారు. వార్‌‌‌‌టైంలో అమెరికాలో ప్లాస్టిక్‌‌‌‌ ఉత్పత్తి మూడు రెట్లయింది. పెట్రో కెమికల్‌‌‌‌ ఇండస్ట్రీకి ఊతమొచ్చింది.

1950: యుద్ధం తర్వాత కూడా ప్లాస్టిక్‌‌‌‌ విస్తృతి ఆగలేదు. ఎడాపెడా వాడటం పెరిగింది. గ్లాసు, కాటన్‌‌‌‌, కార్డ్‌‌‌‌బోర్డు స్థానంలో వాడేయడం మొదలైంది.

1965: 1950ల్లో ఉత్పత్తి చేసిన ప్లాస్టిక్‌‌‌‌లో 96 శాతం తిరిగి వాడేవారు. కానీ 1970ల్లోకి వచ్చేసరికి మళ్లీ వాడకం 5 శాతానికి పడిపోయింది. 1970ల్లోనే సాఫ్ట్‌‌‌‌డ్రింక్‌‌‌‌ కంపెనీలు గ్లాస్‌‌‌‌ బాటిళ్లకు బదులు ప్లాస్టిక్‌‌‌‌ వాడటం స్టార్ట్‌‌‌‌ చేశాయి.

1970: ప్లాస్టిక్‌‌‌‌ భూతం ఎంత నష్టం చేస్తుందో తెలియడం మొదలైంది. న్యూయార్క్‌‌‌‌ నగరంలో ప్లాస్టిక్‌‌‌‌పై ట్యాక్స్‌‌‌‌ వేయడం స్టార్ట్‌‌‌‌ చేశారు. మళ్లీ వాడలేని ప్లాస్టిక్‌‌‌‌ను బ్యాన్‌‌‌‌ చేయాలని యూఎస్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్‌‌‌‌ బాటిళ్లను హవాయి బ్యాన్‌‌‌‌ చేసింది. కానీ దాని వల్ల వేలల్లో ఉద్యోగాలు పోతాయని యూఎస్‌‌‌‌ కోర్టులు బ్యాన్‌‌‌‌ను ఆపేశాయి.

1980: ప్లాస్టిక్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ పెరగడానికి ప్రజల నిర్లక్ష్యమే కారణమని కంపెనీలు వాదించడం స్టార్ట్‌‌‌‌ చేశాయి. రీసైక్లింక్‌‌‌‌కు సహకరించాలని ప్రజలను కోరాయి. కానీ తిరిగి రీసైకిల్‌‌‌‌ చేస్తున్నకొద్దీ ప్లాస్టిక్‌‌‌‌కు ఉన్న అసలైన గుణం తగ్గిపోతోందని కంపెనీలు తెలుసుకున్నాయి. గ్లాసు, లోహాల్లా ప్లాస్టిక్‌‌‌‌ను తిరిగి వాడటం కష్టమనుకున్నాయి. రీసైక్లింగ్‌‌‌‌ చాలావరకు తగ్గించాయి.

  1990: ప్లాస్టిక్‌‌‌‌ వేస్ట్‌‌‌‌పై రీసెర్చ్‌‌‌‌లు స్టార్టయ్యాయి. సముద్రాల్లో ఉన్న 60 నుంచి 80 శాతం ప్లాస్టిక్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ ప్రకృతిలో కలిసిపోనిదేనని వెల్లడైంది.

2004: పెద్ద ప్లాస్టిక్‌‌‌‌ వస్తువులు ‘మైక్రో ప్లాస్టిక్‌‌‌‌’లుగా మారుతున్నాయని సైంటిస్టులు కనుగొన్నారు. ఈ మైక్రోప్లాస్టిక్‌‌‌‌లను సముద్ర జీవరాశులు తింటున్నాయని తెలుసుకున్నారు. దీంతో ఆ జీవులపై చాలా ప్రభావం పడుతోందని గుర్తించారు.

2010: కాస్మొటిక్‌‌‌‌, క్లీనింగ్‌‌‌‌ ఉత్పత్తుల్లో వాడే మైక్రోబీడ్స్‌‌‌‌పై నిరసనలు ఎక్కువయ్యాయి. దీని వల్ల కూడా సముద్ర జీవులు చాలా వరకు చనిపోతున్నాయని సైంటిస్టులు తేల్చారు. కడిగిన ప్రతిసారి మైక్రోప్లాస్టిక్‌‌‌‌ను సృష్టించే సింథటిక్‌‌‌‌ ఫాబ్రిక్స్‌‌‌‌ను వాడొద్దని కూడా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు
మొదలయ్యాయి.

2015: 48 లక్షల టన్నుల నుంచి కోటి 20 లక్షల టన్నుల మేర ప్లాస్టిక్‌‌‌‌ ఏటా సముద్రాల్లో కలుస్తోందని జార్జియా యూనివర్సిటీ సర్వేలో తేలింది. 2025 నాటికి ఇది రెండింతలవుతుందని వర్సిటీ అంచనా వేసింది.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి