- అంకిత భండారి హత్య కేసు విచారణ ముగిసేవరకూ నియామకం ఆపండి
- రాష్ట్రపతి ముర్ముకు రాహుల్ గాంధీ లేఖ
న్యూఢిల్లీ:సిక్కిం గవర్నర్‌గా బీజేపీ నేత దుష్యంత్ గౌతమ్ నియామకాన్ని పున: పరిశీలించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన హోటల్ రిసెప్షనిస్ట్ అంకిత భండారి హత్య కేసులో ఆయన పాత్రపై ఆరోపణలు ఉన్నాయని.. ఆ కేసులో సీబీఐ విచారణ పూర్తయ్యే వరకూ ఈ నియామకాన్ని నిలిపివేయాలని కోరారు. రాష్ట్రపతికి ఈ మేరకు గురువారం ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు, గవర్నర్ నియామకాన్ని పున:పరిశీలించాలని కోరేందుకు రాష్ట్రపతికి అధికారం ఉందని.. అందుకే తాను చివరి ప్రయత్నంగా ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు.
గౌతమ్‌ను గవర్నర్‌గా సిఫారసు చేయడం ద్వారా ప్రధాని మోదీకి మహిళల రక్షణపై ఎలాంటి గౌరవం లేదని నిరూపితమైందని రాహుల్ ఆరోపించారు. కాగా, గౌతమ్ నియామకానికి వ్యతిరేకంగా బుధవారం ఇండియా గేట్ వద్ద నిరసన తెలిపిన అంకిత తల్లిదండ్రులు.. 2022 నాటి హత్య కేసుకు సంబంధించి దుష్యంత్ గౌతమ్ పాత్ర ఉందని ఆరోపించారు. ఇండియా గేట్ వద్ద వారిని కలిసిన రాహుల్ గాంధీ వారికి తన మద్దతు తెలిపారు.
గవర్నర్‌గా ఉన్న వ్యక్తిపై ఎటువంటి క్రిమినల్ విచారణ జరపడానికి వీలులేదని, గౌతమ్‌ను గవర్నర్‌గా నియమించడం వల్ల సీబీఐ విచారణ పరిధి నుంచి ఆయన తప్పించుకుంటారని రాహుల్ పేర్కొన్నారు. ఈ లేఖను 'ఎక్స్' వేదికగా పంచుకున్న రాహుల్.. ‘‘అంకిత హత్య కేసుతో గౌతమ్‌కు సంబంధం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని గవర్నర్‌గా నియమించడం దిగ్భ్రాంతికి గురిచేసింది” అని పేర్కొన్నారు.
అంకిత తల్లిదండ్రుల అరెస్ట్.. విడుదల
దుష్యంత్ కుమార్ గౌతమ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఇండియా గేట్ వద్ద బుధవారం అంకిత తల్లిదండ్రులు వీరేంద్ర సింగ్ భండారి, సోనీ దేవి నిరసనకు దిగారు. రాత్రంతా అక్కడే బైఠాయించగా.. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారికి సంఘీభావం తెలిపారు. పోలీసులు గురువారం తెల్లవారుజామున బాధితులతోపాటు కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, తదితరులను అదుపులోకి తీసుకుని, కొన్ని గంటల తర్వాత రిలీజ్చేశారు. కాగా, దుష్యంత్ నియామకాన్ని 24 గంటల్లో రద్దు చేయకపోతే తమ ఇంట్లో లేదా డెహ్రాడూన్‌లోని సీఎం ఆఫీస్ఎదుట నిరాహార దీక్ష చేస్తామని మృతురాలి పేరెంట్స్ హెచ్చరించారు.
