సర్కారీ స్కూల్ విద్యార్థులకు సీట్లు రాకుండా చర్యలు

సర్కారీ స్కూల్ విద్యార్థులకు సీట్లు రాకుండా చర్యలు

 

  •     గతంలో టెన్త్ మార్కులతో ఆరేండ్ల బీటెక్‌‌‌‌‌‌‌‌లో ప్రవేశాలు 
  •     నిరుటి నుంచి పాలిసెట్ ద్వారా అడ్మిషన్లు 
  •     లాస్టియర్ 20% సర్కారీ, 80% ప్రైవేటు విద్యార్థులకు సీట్లు 
  •     ఇదివరకు 95 శాతంపైగా సర్కారీ స్టూడెంట్లకే అడ్మిషన్లు 
  •     టెన్త్ మెరిట్ ఆధారంగానే సీట్లు ఇవ్వాలంటున్న తల్లిదండ్రులు 

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన రాజీవ్‌‌‌‌‌‌‌‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీయూకేటీ– బాసర ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ఐటీ).. ఆ నినాదాన్ని మరిచిపోతోంది. సర్కారీ స్కూల్ విద్యార్థులకు సీట్లు రాకుండా చర్యలు కొనసాగిస్తోంది. దానికి ప్రభుత్వ పెద్దలు వత్తాసు పలుకుతున్నారు. టెన్త్ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వకుండా.. వర్సిటీ చట్టానికి విరుద్ధంగా ఎంట్రెన్స్ నిర్వహించి అడ్మిషన్లు చేపడుతోంది. దీంతో సర్కారు బడుల స్టూడెంట్లకు కాకుండా, ప్రైవేటు స్కూల్ విద్యార్థులకే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం 2008లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీయూకేటీని అప్పటి ఉమ్మడి రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసింది. దీంట్లో ఏటా1,500 అడ్మిషన్లు తీసుకుంటారు. టెన్త్ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. గ్రామీణ నేపథ్యం, మండలాలు, జిల్లాలు, రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ల ఆధారంగా ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌‌‌‌‌‌‌‌లో అడ్మిషన్లు ఇస్తారు. అయితే, వరుసగా గత రెండేండ్లు (2020, 2021) టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగలేదు. దీంతో 2020లో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా స్టూడెంట్లకు గ్రేడ్లు ఇచ్చారు. దీంతో 1,41,383 మందికి 10 జీపీఏ వచ్చింది. దీంతో మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపునకు అధికారులు అవస్థలు పడ్డారు. గత ఏడాది కూడా ఎఫ్ఏ1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వగా 2,10,647 మందికి 10 జీపీఏ వచ్చింది. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవుతుందని భావించి 2021లో పాలిసెట్‌‌‌‌‌‌‌‌ ద్వారా అడ్మిషన్లు నిర్వహించారు. 1,500 సీట్లను పాలిసెట్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన మార్కుల ఆధారంగా భర్తీ చేశారు. అయితే, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రెగ్యులర్ వీసీ లేకపోవడంతో, నిర్ణయాలన్నీ ఆగమాగంగా జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది. 

1,500 సీట్లలో 1,200కు పైగా ప్రైవేటుకే

గతంలో ఏటా ఆర్జీయూకేటీలో 95% –99% సీట్లు సర్కారీ స్కూల్ స్టూడెంట్లకే దక్కేవి. కానీ నిరుడు ఎంట్రెన్స్ ద్వారా అడ్మిషన్లు నిర్వహించడంతో సర్కారు స్కూళ్ల విద్యార్థులకు పెద్దగా సీట్లు రాలేదు. మొత్తం 1,500 సీట్లలో 200 వరకు సర్కారు విద్యార్థులకు రాగా, 1,200లకు పైగా సీట్లు ప్రైవేటు స్కూల్ స్టూడెంట్లకే వచ్చాయి. కరోనా ప్రభావంతో రెండేండ్ల నుంచి సర్కారు స్కూళ్లలో పాఠాలు సరిగా జరగలేదు. దీంతో గత ఏడాది జరిగిన పాలిసెట్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ మంది సర్కారీ విద్యార్థులు 40–50% మార్కులే స్కోర్ చేశారు. ప్రైవేటు స్కూల్ విద్యార్థులు మాత్రం 60–70% వరకు మార్కులు సాధించారు. దీంతో సర్కారు స్టూడెంట్లకు ఏటా కలిపే గ్రేస్ మార్కులు కలిపినా.. ఎక్కువ సీట్లు పొందలేకపోయారు. 

ఈసారి కూడా పాలిసెట్ ద్వారానే..

ఈ ఏడాది కూడా పాలిసెట్ ద్వారానే ఆర్జీయూకేటీలో సీట్లను కేటాయిస్తామని సర్కారు ప్రకటించింది. పాలిసెట్ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లోనూ ఇదే అంశాన్ని పేర్కొన్నది. అయితే గతంలో పరీక్షలు నిర్వహించకపోవడంతో 10 జీపీఏ సాధించిన వారి సంఖ్య లక్షల్లో వచ్చింది. కానీ ఈఏడాది టెన్త్ పబ్లిక్ పరీక్షలు మే 23 నుంచి జరగనున్నాయి. దీంతో 10 జీపీఏ దాటే వారి సంఖ్య వేలల్లోనే ఉండే అవకాశముంది. అయితే కరోనా కంటే ముందు 2018లో 4,768 మందికి, 2019లో 8,676 మందికి టెన్ జీపీఏ వచ్చింది. ఈ ఏడాది పరీక్షలు నిర్వహిస్తే పది వేల మంది వరకే వచ్చే అవకాశముంది. ఈ స్టూడెంట్లను ఫిల్టర్ చేయడం ఆర్జీయూకేటీ అధికారులకు పెద్ద సమస్యేమీ కాదు. కాబట్టి ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి పాలిసెట్ ద్వారా కాకుండా, టెన్త్ మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయించాలని సర్కారు స్కూల్ స్టూడెంట్ల తల్లిదండ్రులు, స్టూడెంట్స్ యూనియన్లు కోరుతున్నాయి