మూసీ పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న రెడ్​ అలర్ట్

మూసీ పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న రెడ్​ అలర్ట్

హైదరాబాద్, వెలుగు: మూసీ నదికి వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లు నీట మునిగాయి. 300 ఇండ్లలోకి నీళ్లు చేరాయి. చాదర్ ఘాట్, శంకర్ నగర్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్ పేట, కమలానగర్, జీయగూడ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అధికారులు 1,500 ఇండ్లకు కరెంట్ సప్లయ్​నిలిపివేశారు. బుధవారం ఉదయం మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహించింది. అటు జీయాగూడ – పురానాపూల్100 ఫీట్ రోడ్డు పూర్తిగా నీట మునిగింది. దీంతో ఇటుగా రాకపోకలు నిలిపివేశారు. చాదర్ ఘాట్ బ్రిడ్జిని ఆనుకొని వరద ప్రవహిస్తోంది. మంగళవారం రాత్రి బ్రిడ్జిపైకి రాకపోకలు నిలిపివేయగా బుధవారం ఉదయం ట్రాఫిక్ సమస్య తీవ్రం కావడంతో తిరిగి బ్రిడ్జిని ఓపెన్ చేశారు. ఇక్కడ ప్రమాదకర పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఆడగం లేదు. దీంతోనే మూసీ నది ఉధృతంగా పారుతోంది. బుధవారం  ఉదయం హిమాయత్ సాగర్ కు 7 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 8 గేట్లు ఎత్తి 7,708 క్యూసెక్కుల నీటికి కిందికి వదిలారు. అలాగే ఉస్మాన్​సాగర్​కు 7,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 13 గేట్లు ఎత్తి 8,781 క్యూసెక్కుల నీటిని మూసీలోకి పంపారు. రాత్రి 11 గంటలకు ఉస్మాన్​సాగర్ ఇన్​ఫ్లో 6 వేల క్యూసెక్కులకు తగ్గింది.​ దీంతో 13 గేట్ల నుంచి 8,284 క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు. అలాగే హియాత్​సాగర్​కు ఇన్​ఫ్లో 2 వేల క్యూసెక్కులకు తగ్గింది. దీంతో 4గేట్లు క్లోజ్​ చేసి,  కేవలం 4 గేట్ల ద్వారా 2,606క్యూసెక్కుల నీటిని మూసీలోకి పంపిస్తున్నారు. 

అలర్ట్​ అని వదిలేశారు
జంట జలాశయాలకు భారీగా వరద రావడంతో మంగళవారం రాత్రి సడన్​గా ఉస్మాన్ సాగర్​12, హిమాయత్​సాగర్​8 గేట్లు ఎత్తారు. దీంతో మూసీ ఉధృతి పెరిగింది. పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరింది. ఏం చేయాలో తెలియక కట్టుబట్టలతో బాధితులు ఇండ్లలోంచి పరుగులు తీశారు. కొంతమంది బంధువులు, తెలిసిన వారి ఇండ్లకు వెళ్లిపోయారు. మరికొందరు సమీపంలోని ప్రార్థనా మందిరాల్లో తలదాచుకున్నారు. రాత్రి 9 గంటల తర్వాత రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు పోలీసుల సాయంతో చాలా ఇండ్లను ఖాళీ చేయించారు. వారిని పునరావాస కేంద్రాల్లోకి తరలించారు. దాదాపు 300 ఇండ్లలోకి వరద చేరగా టీవీలు, ఫ్రిడ్జ్ లు, నిత్యావసరాలు పూర్తిగా నీటమునిగాయి. బుధవారం పొద్దున నీళ్లు తగ్గిన ఇండ్లలోకి వెళ్లి కొందరు సామాన్లు తెచ్చుకున్నారు. ప్రభుత్వం వరద సాయం ఇచ్చి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అయితే రెడ్ అలెర్ట్ ప్రకటించిన అధికారులు ముంపునకు గురయ్యే ప్రాంతాలను పట్టించుకోలేదు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారే కానీ ఇండ్ల వద్దే ఉండిపోయినవారికి కనీసం ఫుడ్డు పంపిణీ చేయలేదని కొందరు ఆరోపించారు. నది ఉధృతంగా ప్రవహిస్తున్నా ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లకుండా చూసేందుకు ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. చాలాచోట్ల యువత నీటిలో ఈతకొడుతూ కనిపించారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాగా ఇండ్లు నీట మునిగిన ప్రాంతాల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ తరఫున హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఎక్కువగా చిన్నారులు జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. 

కట్టుబట్టలతో పరుగెత్తినం
మా ఇంట్లో ఏడుగురం ఉంటాం. మంగళవారం రాత్రి 10 గంటలకు ఒక్కసారిగా ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. ఏం చేయాలో తెలియక కట్టుబట్టలతో బయటకు పరిగెత్తినం. సామాను ఇంట్లోనే ఉండిపోయింది. వరద ఎప్పుడు తగ్గుతుందోనని ఎదురు చూస్తున్నం. - మిన్నాబాయి, చాదర్ ఘాట్

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలె
మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటున్న వారిని ప్రభుత్వం ఖాళీ చేయించాలి. డబుల్ బెడ్​రూం ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలి. వరదలు వచ్చిన ప్రతిసారి ఇదే సమస్య ఎదురవుతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏటా ఇలాగే ఉంటుంది. - బిలాల్, శంకర్ నగర్

మెహిదీపట్నం: బుధవారం వేకువజామున 3.30 గంటలకు మద్యం మత్తులో గుర్తుతెలియని వ్యక్తి మూసీ నదిలో పడిపోయాడు. అక్కడికి సమీపంలో డ్యూటీలో ఉన్న మంగళ్​హాట్ ఎస్సై రాంబాబు విషయం తెలుసుకుని ప్రాణాలకు తెగించి అతన్ని ఒడ్డుకు చేర్చాడు. అనంతరం సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్​కు తరలించారు. అలాగే బుధవారం వేకువజామున జియాగూడ – పురానాపూల్100 ఫీట్ రోడ్డును వరద ముంచెత్తగా అటుగా వచ్చిన లారీ అందులోనే నిలిచిపోయింది. చేసేదేం లేక డ్రైవర్ లారీని అక్కడే వదిలి వెళ్లిపోయాడు. తర్వాత ప్రవాహం పెరగడంతో లారీ సగం వరకు మునిగింది. లారీ లంగర్ హౌస్ నుంచి సలాకుల లోడుతో పాతబస్తీలోని బహుదూర్​పురాకు వెళ్తున్నట్లు కుల్సుంపురా పోలీసులు తెలిపారు.