మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

హిమాయత్, ఉస్మాన్ సాగర్ నుంచి  ముసారాంబాగ్, శంకర్ నగర్, చాదర్ ఘాట్ నాలాలకు  భారీ వరద

హైదరాబాద్, వెలుగు: మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. సిటీలో మూడ్రోజుల పాటు కురిసిన ముసురు వానతో పాటు రంగారెడ్డి జిల్లా ఎగువ ప్రాంతాల్లో పడ్డ వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్​సాగర్(గండిపేట)కు భారీగా వరద నీరు చేరింది.  గురువారం నుంచి హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ 7 గేట్లు, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ 2 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువన ఉన్న మూసీలోకి వదులుతున్నారు. వరద మరింత పెరిగితే చాదర్ ఘాట్, ముసారాంబాగ్​లోని లోతట్టు కాలనీలు, మలక్​పేటలోని శంకర్​నగర్, బస్తీలు నీట మునిగే అవకాశముంది.  వరద నీరు రోజురోజుకి పెరుగుతుండటంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని వారు ఇండ్లను ఖాళీ చేయాలని అధికారులు చెప్తున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయకుండానే ఇండ్లు, గుడిసెలను ఖాళీ చేసి వెళ్లమని అధికారులు చెప్తున్నారని, ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్లాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   వరద ప్రవాహం పెరగడంతో కొందరు గుడిసెలను ఖాళీ చేసి బంధువుల ఇండ్లకు వెళ్లిపోయారు.  ఎటు పోలేని వారు మాత్రమే అక్కడే ఉంటున్నారు. రాత్రి వేళల్లో  వరద పెరిగితే ఇండ్లు, గుడిసెల్లోకి నీరు వస్తుందన్న భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి పొద్దున్నే తిరిగి వస్తున్నారు. వరద ముంపు లేకుండా చేస్తామని  ఎన్నికల టైమ్​లో హామీలు ఇచ్చే లీడర్లు తర్వాత పట్టించుకోవడం లేదని  ముసారాంబాగ్​లోని వడ్డెర బస్తీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరిపడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇండ్లను ఖాళీ చేసి వెళ్లడం లేదని  వారు చెప్తున్నారు.  కమ్యూనిటీ హాళ్లకు వెళ్తే టైమ్​కి ఫుడ్ పెట్టట్లేదని, అందుకే తిరిగి ఇండ్లకు వస్తున్నామని మరికొందరు అంటున్నారు.   
ఇంట్లోకి నీరు వచ్చే వరకు రెస్పాండ్ అవ్వట్లే..
గ్రేటర్ సిటీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తు సమాచారం అందిస్తున్నప్పటికీ బల్దియా అధికారులు ఇన్ టైమ్​లో అలర్ట్ కావడం లేదు. వర్షాలు ఎక్కువైన తర్వాత రెవెన్యూ, వాటర్ బోర్డు అధికారులు, పోలీసుల సాయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇండ్లను ఖాళీచేయాలని  హడావుడిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  ఇండ్లలోకి నీరు వచ్చే వరకు బల్దియా అధికారులు స్పందించడం లేదని ఆయా ఏరియాల జనం అంటున్నారు. గతేడాది అక్టోబర్​లో కూడా ఇదే విధంగా వరద ప్రవాహం పెరిగిన తర్వాతే ఇండ్లను ఖాళీ చేయించారని అంటున్నారు.  వరద తీవ్రతకు సంబంధించి ముందే సమాచారం ఇస్తే ఇండ్లల్లో ఉన్న సామగ్రిని కూడా తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుందని  చాదర్ ఘాట్, ముసారాంబాగ్, శంకర్​నగర్ కాలనీవాసులు చెప్తున్నారు. మరోవైపు రిటర్నింగ్ వాల్ కట్టకపోతే మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ ఇంటిని, ఆఫీసును ముట్టడిస్తామని శంకర్​నగర్ కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు. మూసీ నది బ్యూటిఫికేషన్  పేరుతో రూ. వందల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రిటర్నింగ్ వాల్ ఎందుకు నిర్మించలేకపోతోందని వారు ప్రశ్నిస్తున్నారు.   
మళ్లీ వానలు పడితే..
మరో మూడ్రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ ప్రవాహం పెరుగుతోంది. మళ్లీ వర్షాలు పడితే హిమాయత్, ఉస్మాన్​సాగర్​కి చెందిన మరిన్ని గేట్లు ఎత్తే అవకాశముంది. దీంతో మూసీలోకి  మరింత భారీగా వరద చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధికారులు ముందస్తుగా అల్టర్ అయితే జనాలు ఇబ్బందులు పడకుండా చూడొచ్చంటున్నారు.

కరెంట్ కట్, నెట్ వర్క్ ప్రాబ్లమ్స్ 
సిటీలో కురిసిన వర్షాలకు  కొన్ని ప్రాంతాల్లో కరెంట్ స్తంభాలు  పడిపోవడం,  చెట్ల కొమ్మలు విరిగి కరెంట్, ఇంటర్నెట్ వైర్ల మీద పడటంతో పవర్ సప్లయ్ తో పాటు నెట్ వర్క్ ఉండటం లేదు.  చాలా ఏరియాల్లో పవర్ సప్లయ్, ఇంటర్నెట్ సిగ్నల్స్ లేక  స్టూడెంట్స్ ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ కాలేకపోతున్నారు. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఎంప్లాయీస్ సైతం ఇబ్బంది పడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వానల వల్ల 117 ఫీడర్లు, 517 కరెంట్ స్తంభాలు, 28 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల వర్క్స్ జరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో కరెంట్ కట్స్ ఎక్కువ ఉంటున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల్లోని 5 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లలో కరెంట్ సరఫరా నిలిపివేశామని టీఎస్ఎస్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ జి. రఘుమా రెడ్డి అన్నారు. విద్యుత్ సరఫరా తీరుపై శుక్రవారం ఛీప్ జనరల్ మేనేజర్లు,సూపరింటెండెంట్ ఇంజనీర్లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాల్లోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లతో   జనాలు అప్రమత్తంగా ఉండాలని రఘుమా రెడ్డి సూచించారు. ప్రస్తుతానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవన్నారు. సిటిజన్లు విద్యుత్ సరఫరా సమస్యల గురించి కంప్లయింట్ చేసేందుకు  1912  లేదా 100 నంబర్లకు కాల్ చేయాలన్నారు.   టీఎస్ఎస్పీడీఎల్ మొబైల్ యాప్,  సంస్థ వెబ్ సైట్ tssouthernpower.com లో  కూడా కంప్లయింట్ చేయొచ్చన్నారు.


చీకట్లోనే ఉంటున్నం 
వానలకు  కరెంట్​ లేక చీకట్లోనే ఉంటున్నం. కరెంట్​ మీటర్లు కొత్తవి పెడ్తమని రూ.600  తీసుకుని ఇప్పటివరకు ఏర్పాటు చేయలే. ఆఫీసర్లు వచ్చి ఖాళీ చేయమంటే ఏడికి పోవాలె. వేరే దగ్గర షెల్టర్ కల్పిస్తే పోతం. ఏం లేకుండా ఖాళీ చేయాలంటే ఎట్లా చేస్తం.
                                                                                                                                                                 - బాలమ్మ, వడ్డెర బస్తీ, ముసారాంబాగ్​


గతేడాది కూడా ఇట్లనే చేసిన్రు
గతేడాది అక్టోబర్​లో వరదలు వచ్చినప్పుడు కూడా అధికారులు ఇన్ టైమ్​లో చర్యలు చేపట్టకపోవడంతో మస్తు ఇబ్బందులు పడ్డం.  ప్రస్తుతం వర్షం ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. ముందస్తుగా అధికారులు మాకు సమాచారం ఇస్తలేరు. గురువారం రాత్రి ఇండ్లను ఖాళీ చేయమన్నారు. ఆ తర్వాత అధికారులు ఎవరూ ఇక్కడ కనిపించలేదు.  మూసీలో వరద తీవ్రత మాత్రం తగ్గడం లేదు.                                                                          - అబ్బు, శంకర్ నగర్