చిన్న రంధ్రంతో గుండెకు ఆపరేషన్

చిన్న రంధ్రంతో గుండెకు ఆపరేషన్
  • గుండెని ఆపకుండా ‘నియోకార్డ్​’ సర్జరీతో వాల్వ్​కు రిపేర్​

కొంతమంది గుండె జబ్బు రోగులకు బైపాస్​ లేదా ఓపెన్​హార్ట్​ ఆపరేషన్​ తప్ప వేరే ఆప్షన్​ ఉండదు. కానీ, అందరూ దానికి తట్టుకోలేరు. మరి, అలాంటి వాళ్లకు వేరే ఆప్షన్​ లేదా? అంటే ఉంది అంటున్నారు బ్రిటన్​లోని ఎన్​హెచ్​ఎస్​ డాక్టర్లు. ఏ కోత లేకుండానే చెడిపోయిన గుండె వాల్వ్​లకు ఆపరేషన్​ చేసి, కుట్లు వేయొచ్చంటున్నారు. ఒక్క చిన్న రంధ్రంతో పని కానిచ్చేసేయొచ్చంటున్నారు. దాన్నే నియోకార్డ్​ ప్రాసెస్​ అని పిలుస్తున్నారు. మామూలుగా అయితే, బైపాస్​లోగానీ, ఓపెన్​హార్ట్​ సర్జరీలోగానీ, గుండెను ఆపేస్తారు. దానికి బయటి నుంచి రక్తాన్ని సరఫరా చేస్తూ ఆపరేషన్​ చేస్తారు. కానీ, ఈ పద్ధతిలో ఛాతిపై రెండు ఇంచుల మందం కోసి గుండెకు రంధ్రం చేస్తారు. ఆ రంధ్రం నుంచే గుండెలో చెడిపోయిన వాల్వ్​ దగ్గరకు నియోకార్డ్​ అనే పరికరాన్ని పంపుతారు. అల్ట్రాసౌండ్​ ద్వారా ఆ పరికరాన్ని పంపే దారిని చూస్తారు. వాల్వ్​లో చెడిపోయిన రక్తనాళం ప్లేస్​లో నియోకార్డ్​ ద్వారా కొత్త నాళాలను పెట్టి కుట్లేస్తారు. రక్తం లీకేజీని ఆపుతారు. కేవలం రెండు గంటల్లో ఆపరేషన్​ చేయొచ్చని, భవిష్యత్తులో చాలా మందికి ఇది ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం లండన్​లోని రాయల్​ బ్రాంప్టన్​ హాస్పిటల్​ డాక్టర్లు, 17 మంది రోగులకు ఈ పద్ధతిలో ఆపరేషన్​ చేశారు. రోగి ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం కూడా లేదని ఆస్పత్రి కార్డియాక్​ సర్జన్​ రష్మీ యాదవ్​ చెప్పారు.