యూపీ పోలీసులను స్కూల్లోనే నిలదీసిన అమ్మాయి

యూపీ పోలీసులను స్కూల్లోనే నిలదీసిన అమ్మాయి

ఉత్తర్ ప్రదేశ్ పోలీసులను స్కూలు పిల్లలు నిలదీశారు. తమ భద్రతకు మీరు భరోసా ఇస్తారా అంటూ ప్రశ్నించారు. ఓ ఇంటర్ అమ్మాయి గుక్కతిప్పుకోకుండా అడిగిన ప్రశ్నలకు పోలీసుల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.

ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలి కారు యాక్సిడెంట్ తో మరోసారి దేశమంతటా న్యూస్ హెడ్ లైన్స్ లో నిలుస్తోంది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం. యూపీలో మహిళలపై క్రైమ్ రేట్ పెరిగిపోవడంతో.. అక్కడి పోలీసులు ఊరూరా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మహిళలపై దాడులు… వాటిని అరికట్టే విధానాలపై…. స్కూళ్లలో అవగాహనా ర్యాలీల పేరుతో ఉపన్యాసాలు ఇచ్చి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. బారాబంకి ప్రాంతంలోని ఓ స్కూల్ కు వెళ్లిన పోలీస్ ఉన్నతాధికారులు .. మహిళలకు రక్షణపై స్పీచ్ దంచి కొట్టారు. అధికారులు మాట్లాడుతుండగానే.. ‘సర్ ఓ ప్రశ్న ఉంది’ ఓ విద్యార్థిని మైక్ అందుకుంది.

“అమ్మాయిలు ప్రశ్నించినప్పుడే వారిపై అఘాయిత్యాలు తగ్గుతాయని మీరు చెబుతున్నారు. కరెక్టే మేం ఒప్పుకుంటాం. కానీ.. ఓ బీజేపీ ఎమ్మెల్యే ఓ అమ్మాయిని రేప్ చేస్తే… ఆ బాధితురాలికి యాక్సిడెంట్ అయింది. నిజానికి అది యాక్సిడెంట్ కాదు. నంబర్ ప్లేట్ కు మసిపూసి… లారీతో ఆమె కారును గుద్ది చంపాలనుకున్నారు. మాకు జరిగిన అన్యాయంపై మేం సులభంగా నిరసన తెలుపగలం… ప్రశ్నించగలం. కానీ.. ఎమ్మెల్యే, వీఐపీ లాంటి పెద్ద మనుషులు చేసే తప్పులను మేం నిలదీస్తే.. మా ప్రాణాలకు మీరు గ్యారంటీ ఇస్తారా… మమ్మల్ని కాపాడే బాధ్యత మీరు తీసుకుంటారా… ” అని ఆ విద్యార్థిని నిమిషం పాటు గుక్కతిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో.. స్కూలుకు వచ్చిన మహిళా పోలీస్ అధికారులు, విద్యాధికారులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కొద్దిసేపు వారికి మాటలు రాలేదు. స్కూలు పిల్లలకు ఆమె నిలదీసిన విధానానికి మెచ్చి.. చప్పట్లతో మద్దతు పలికారు.

ఆమె ప్రశ్నకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్పందించారు. ఆ కేసుపై దర్యాప్తు జరుగుతోందని.. దానిపై అప్పుడే స్పందించడం సరికాదన్నారు. న్యాయం జరగదని భయపడి ప్రశ్నించకుండా ఉండటం మాత్రం కరెక్ట్ కాదన్నారు. లీగల్ గా కచ్చితంగా ప్రొసీడ్ కావాల్సిందే అని చెప్పారాయన.

ఆ విద్యార్థిని ప్రశ్నించిన వీడియోను అధికారులు రికార్డ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.