ఆయన పార్టీ మారింది కాంట్రాక్టుల కోసమే

ఆయన పార్టీ మారింది కాంట్రాక్టుల కోసమే
  • రూ.21 వేల కోట్ల కాంట్రాక్టు కోసం 97 వేల ఓట్లను రాజగోపాల్​ తాకట్టు పెట్టిండు: రేవంత్​
  • ఆయన పార్టీ మారింది కాంట్రాక్టుల కోసమే
  • మునుగోడుకు కేంద్రం నుంచి 5 వేల కోట్ల ప్యాకేజీ తీసుకురావాలె
  •  లేదంటే ముక్కునేలకు రాసి క్షమాపణ చెప్పాలె
  • మనోధైర్య సభలో పీసీసీ చీఫ్

నల్గొండ, వెలుగు: అనారోగ్యంతో ఉన్న సోనియాగాంధీపై ఈడీ కేసులు పెట్టి మోడీ వేధిస్తుంటే.. ఆమెకు మద్దతుగా పోరాడాల్సిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.21 వేల కోట్ల కాంట్రాక్టు కోసం అమిత్​షా పంచన చేరారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం చండూరులో జరిగిన మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్​ కార్యకర్తల మనోధైర్య సభలో ఆయన మాట్లాడారు. ‘‘రాజగోపాల్​రెడ్డి అసలు మనిషేనా..? అమ్మ మీద అభిమానం ఉండేటోడు ఎవరైనా ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతారా?’’ అని రేవంత్ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపోటములు ముఖ్యం కాదని, 2018 ఎన్నికల తర్వాత నాలుగు ఉప ఎన్నికలు వస్తే రెండు బీజేపీ, రెండు టీఆర్​సోళ్లు గెలిచారని, దాని వల్ల కాంగ్రెస్​కు ఏమీ కాలేదన్నారు. మునుగోడులో కూడా ఏదైనా జరిగితే కాంగ్రెస్​ పార్టీకి పోయేదేమీ లేదని చెప్పారు. కానీ రాజగోపాల్​రెడ్డి పార్టీ ప్రతిష్టను, కన్నతల్లి సోనియా గాంధీ ప్రతిష్టను, మునుగోడు నియోజకవర్గంలోని 97 వేల ఓట్లను అమిత్​షా కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని విమర్శించారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశారనుకుంటే మళ్లీ కాంగ్రెస్ తరఫునే పోటీ చేయాలిగానీ బీజేపీలోకి ఎందుకు పోవాల్సి వచ్చిందో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. 
రూ.21 వేల కోట్ల కాంట్రాక్టు అప్పనంగా కట్టబెట్టారు కనుక అమిత్​షాకు అమ్ముడుపోడని ఆరోపించారు.

నా పైనే కాదు.. అమిత్​షా పైనా కేసులు ఉన్నయ్ ‘‘

ముందేమో మునుగోడు అభివృద్ధి అని చెప్పిన రాజగోపాల్ ఇప్పుడు కొత్త పదం ఎత్తుకున్నడు.. జైలుకు పోయినోడి దగ్గర నేను పనిచేస్తనా..? అని నాపై ఆరోపణలు చేస్తున్నడు.. 2014 కంటే ముందు నాపైన ఒక్క కేసు అయినా ఉందా? 2014 తర్వాత కేసీఆర్ అవినీతి, దోపిడీ, కుటుంబ పాలన మీద పోరాటం చేస్తుంటే నాపైన అక్రమ కేసులు పెట్టారు. నేను ముప్పై రోజులు జైల్లో ఉంటే అమిత్​షా తొంభై రోజులు జైల్లో ఉన్నడు. రెండున్నరేండ్లు గుజరాత్​లో అడుగుపెట్టొద్దని నిషేధం విధించారు. 90 రోజుల్లో జైల్లో ఉన్నోడు పెట్టే గడ్డి బాగుందా’’ అని రేవంత్ ప్రశ్నించాడు. నామినేషన్​ వేసే ముందు అమిత్​షా నుంచి రూ.5 వేల కోట్ల ప్యాకేజీ తీసుకొచ్చి బ్రహ్మణవెల్లంల, ఎస్ఎ​ల్​బీసీ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని సవాల్ విసిరారు. లేకపోతే ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలన్నారు. 2018లో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్ రాజకీయ కారణాల వల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినప్పటికీ ఆమె ఇంటింటికి తిరిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించింది వాస్తవం కాదా? అన్నారు. త్వరలో మునుగోడు నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని, ప్రతి గ్రామంలో, మండలాల్లో తానే స్వయంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తానని చెప్పారు.

పార్టీకి నష్టమేమీ లేదు : పార్టీ నేతలు

ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని బీజేపీ ప్రభుత్వం ఈడీ కేసులతో ఇబ్బంది పెడుతుంటే, అదే నాయకులతో రాజగోపాల్ రెడ్డి బేరా సారాలు చేసుకున్నాడని ఆరోపించారు. తల్లి పాల మీద తప్ప అన్నింటి మీద పన్నులు విధించిన దౌర్భాగ్య  ప్రభుత్వం బీజేపీ అని మండిపడ్డారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వల్లనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి పదవులను, ఆస్తులను దక్కించుకున్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. వెంకట్ రెడ్డి కాంగ్రెస్​లో ఉంటారో, బీజేపీలో చేరుతారో చెప్పాలన్నారు. పార్టీతో మీరు బాగుపడ్డారు తప్ప పార్టీకి చేసింది ఏం లేదన్నారు. జానారెడ్డి మాట్లాడుతూ..  సొంత ప్రయోజనాల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లాడన్నారు. కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన వారిని రానున్న ఎన్నికల్లో మునుగోడు గడ్డ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ...1999 కి ముందు, నువ్వు నీ అన్న ఏడున్నరని అడిగారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అమిత్ షా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ ఏం లేదు.. అంతా కాంగ్రెస్ బ్రాండేనని పేర్కొన్నారు. మునుగోడు ప్రజల విశ్వాసాన్ని రాజగోపాల్ రెడ్డి పోగొట్టుకున్నారని ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో ఉంటే జరగని అభివృద్ది, బీజేపీ లోకి వెళ్తే  ఎలా జరుగుతుందో చెప్పాలన్నారు. మీటింగ్​లో అంజన్ కుమార్ యాదవ్, బలరాం నాయక్, మల్లు రవి, పాల్వాయి స్రవంతి, పున్న్న కైలాస్ నేత, బీర్ల ఐలయ్య, కుంభం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

నేను విమర్శించింది రాజగోపాల్​నే: రేవంత్​

న్యూఢిల్లీ, వెలుగు: రాజగోపాల్‌‌రెడ్డి కాంగ్రెస్​కు రాజీనామా చేసినప్పుడు తాను చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌‌రెడ్డి మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి కాంగ్రెస్‌‌ కుటుంబసభ్యుడని అన్నారు. తాను రాజగోపాల్‌‌రెడ్డిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చెరుకు సుధాకర్ చేరిక సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని టీవీ చానల్స్​లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు మా మధ్య గ్యాప్ పెంచాలని చూస్తున్నారని తెలిపారు. వెంకట్ రెడ్డి వేరు రాజగోపాల్ రెడ్డి వేరని పేర్కొన్నారు. అపోహలతో వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదన్నారు.

కాంగ్రెస్​లో చేరిన చెరుకు సుధాకర్​

తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున​ఖర్గే, రేవంత్ సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు, ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఇంటిపార్టీని కాంగ్రెస్​లో విలీనం చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ కు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అన్నారు. మునుగోడులో ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ గెలుపు తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు.