మూసీలోని కట్టడాలకు రెవెన్యూ శాఖ నోటీసులు

మూసీలోని కట్టడాలకు రెవెన్యూ శాఖ నోటీసులు


హైదరాబాద్, వెలుగు:మూసీ నది బఫర్ జోన్​లో 9 వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించగా, వీటిలో 160 మంది నుంచి మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. ఇండ్లు కోల్పోతే  వేరే చోట వసతి కల్పించాలని వారు కోరారు.  అక్రమ నిర్మాణాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని రెవెన్యూ అధికారులు ఈనెల 9 వరకు గడువు ఇచ్చారు. అక్కడ ఉంటున్న వారి నుంచి ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో  ఈ నెలాఖరులోగా మరోసారి ఫైనల్​నోటీసులను జారీ చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఆ తర్వాత కూడా స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు అభ్యంతరాలు ఇచ్చిన వారితో అధికారులు చర్చిస్తున్నారు. మూసీ నది  హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల్లో  44 కిలోమీటర్ల మేర ఉంది. ఆయా ప్రాంతాల్లో సర్వే చేసిన రెవెన్యూ అధికారులు మొత్తం 9 వేల అక్రమ నిర్మాణాలను గుర్తించారు. మూసీ ఒడ్డు నుంచి ఇరు వైపులా 50 మీటర్ల పరిధిలో బఫర్ జోన్​లోని నిర్మాణాలపై అభ్యంతరాలు కోరినా స్పందన రాలేదు.  

 నోటిఫికేషన్​ని పట్టించుకోలే.. 

రెవెన్యూ అధికారుల నోటిఫికేషన్ ని ఎవరూ పట్టించుకోలేదు. గతంలో కూడా చాలాసార్లు మూసీ ఆక్రమణలు  తొలగించేందుకు ప్రయత్నించి ఫెయిల్​ అయ్యారు. ఇప్పుడు కూడా అదేవిధంగా హడావిడి చేసి వదిలేస్తారని మూసీ ఒడ్డున ఉండే వారు లైట్​ తీసుకుంటున్నారని పలువురు చెబుతున్నారు.  ఎన్నడూ లేని విధంగా నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలకు సంబంధించిన సర్వే నంబర్లను కూడా తహసీల్దార్​, ఆర్డీవో ఆఫీస్​ల్లోని  నోటీసు బోర్డుల్లో  పెట్టినా  కూడా ఎవరూ పట్టించుకోకపోవడంపై రెవెన్యూ అధికారులు సీరియస్​ గా ఉన్నారు. మరోసారి ఫైనల్​ నోటీసులు ఇచ్చి ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరిస్తున్నారు. 

బఫర్ జోన్ పేరుతో ఖాళీ చేయిస్తే..

లంగర్ హౌస్​లోని టిప్పుఖాన్ ​బ్రిడ్జి నుంచి నాగోల్ బ్రిడ్జి వరకు ఫస్ట్​ ఫేజ్ లో భాగంగా  రివర్​ను డెవలప్ చేయాలని సర్కార్​ ఇప్పటికే నిర్ణయించింది. నదికి ఇరువైపులా 14.8 కిలో మీటర్ల  మేర 5,501 అక్రమ నిర్మాణాలను గుర్తించగా వీటిపై ముందుగా చర్యలు తీసుకుంటారు.  ఇక కూల్చివేతల పనులు మొదలు పెట్టడడమే మిగిలింది. నదిపై బ్రిడ్జిల నిర్మాణాల కోసం రూ.545 కోట్ల పాలనాపరమైన అనుమతులు కూడా జారీ చేసింది. అక్రమ నిర్మాణాలను తొలగించాకే బ్రిడ్జిల పనులు షురువయ్యే అవకాశం ఉండగా రెవెన్యూ అధికారులపై ప్రెజర్ పెరిగింది.  బఫర్ జోన్ పేరుతో ఖాళీ చేయిస్తే ఊరుకోమని ఆయా ప్రాంతాల్లోని జనాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఏండ్లుగా ఉంటుంటే ఇప్పుడెలా ఖాళీ చేయిస్తారని, మూసీతో తమకు ఎలాంటి ఇబ్బంది రావడంలేదని, అధికారులే కష్టాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తున్నారు. 

అర్హులకు​ డబుల్ ​ఇండ్లు ఇచ్చాకే.. 

మూసీ నదిలో అక్రమ నిర్మాణాల తొలగింపులో భాగంగా ముందుగా ఇండ్లు కోల్పోయే అర్హులైన పేదలకు డబుల్​ బెడ్రూమ్ ఇండ్లను  అందించాకే ఖాళీ చేయిస్తామని రెవెన్యూ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఇలాంటివి ఎక్కువగా ముసారాంబాగ్, లంగర్ హౌస్, నాంపల్లి, అంబర్ పేట్, చాదర్ ఘాట్​తదితర ఏరియాల్లో ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఆయా ప్రాంతాల్లోని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇచ్చి,  మిగతా వారికి ఫైనల్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఇండ్లను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు చెబుతున్నారు. అప్పటికీ వినకపోతే కూల్చివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.