గచ్చిబౌలిలో రెవెన్యూ అధికారుల కూల్చివేతలు

గచ్చిబౌలిలో రెవెన్యూ అధికారుల  కూల్చివేతలు

హైదరాబాద్ లో రెవెన్యూ అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ బసవతారక నగర్ లో కూల్చివేతలు చేశారు. రాజేంద్ర నగర్ ఆర్టీఓ చంద్రకళ పర్యవేక్షణలో గుడిసెల్ని సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు గుడిసెల తొలగిస్తున్న అధికారుల్ని కాలనీ వాసులు అడ్డుకుంటున్నారు. గోపన్ పల్లి సర్వే నెంబర్ 37లో అక్రమంగా వెలిసాయంటూ 208 గుడిసెల్ని అధికారులు తొలగించారు. ఆర్టీఓ చంద్రకళ ఆధ్వర్యంలో 8 రెవిన్యూ బృందాలు, 8 పోలీస్ బృందాలతో కూల్చివేత పనులు చేపట్టారు. ఈ పనుల్ని అడ్డుకున్న గచ్చిబౌలి బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

మరోవైపు బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని నిర్వాసితులు చెబుతున్నారు. ఇక్కడే పనిచేసుకుంటూ ఇక్కడే బతుకుతున్నామన్నారు. తమకు ఆధార్ కార్డులు, ఇంటి నంబర్లు, రేషన్ కార్డులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఎలాంటి నోటీసులు కూడా తమకు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా మా ఇళ్లు కూలిస్తే ఎక్కడికి పోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మా ఇంటి సామాన్లు కూడా తీసుకోనివ్వడం లేదని బాధితులు వాపోతున్నారు.