ఎవరు కేసు పెట్టిస్తున్నరో తెలుసు : అశ్వత్థామరెడ్డి

ఎవరు కేసు పెట్టిస్తున్నరో తెలుసు : అశ్వత్థామరెడ్డి

తప్పుడు కేసులకు బెదరం

హైదరాబాద్‌‌, వెలుగు: ‘ఉద్యమ సమయంలో కేసీఆర్‌‌పైనా కేసులు పెట్టారు. ఇప్పుడు నాపై కేసులు ఎవరు పెట్టిస్తున్నరో తెలుసు. ఆ రాజు అనే వ్యక్తి ముఖం కూడా చూడలె. ఇవన్నీ ఎత్తుగడలో భాగమే. ఇలాంటి కేసులకు భయపడను. కేసులు పెట్టి నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నరు. వెనక్కి తగ్గేది లేదు.’ అని ఆర్టీసీ జేఏసీ చైర్మన్​ అశ్వత్థామరెడ్డి అన్నారు.

హైదరాబాద్‌‌లోని బీజేపీ స్టేట్‌‌ ఆఫీస్‌‌లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌‌ను జేఏసీ నేతలు శుక్రవారం కలిశారు. అనంతరం మీడియాతో అశ్వత్థామ రెడ్డి మాట్లాడారు. సీఎం అంతగా బెదిరించినా ఏ ఒక్క కార్మికుడూ విధుల్లో చేరలేదన్నారు.  కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.  హుజూర్‌‌నగర్‌‌ ఉపఎన్నికకు, ఆర్టీసీ సమ్మెకు సంబంధంలేదని ఎన్నికలకు ముందే చెప్పామన్నారు. ఉప ఎన్నికలు 99 శాతం అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయని, ఏపీలోని నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలిచిందని, జనరల్‌‌ ఎలక్షన్స్‌‌లో చిత్తుగా ఓడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. 30న సరూర్‌‌నగర్ స్టేడియంలో ‘సకల జనుల సమర భేరి’ నిర్వహిస్తామన్నారు.