చెప్పిన పంటలు వేయకుంటే రైతుబంధు రాదు

చెప్పిన పంటలు వేయకుంటే రైతుబంధు రాదు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు రాదని సీఎం కేసీఆర్​ తేల్చిచెప్పారు. ఈ వానాకాలంలో పత్తి పంట వేసి ధనవంతులు కావాలని, కంది పంట వేస్తే గంట కూడా లేట్​ లేకుండా ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. వానాకాలంలో మక్కలు అసలు వేయొద్దని చెప్పారు. వరి సాగు విస్తీర్ణం పెరగకుండా చూసుకోవాలన్నారు. పంటల సాగు విషయంలో ప్రభుత్వ ఆదేశాలు కచ్చితంగా పాటించాలని ఆయన చెప్పారు.‘‘అందరం ఒకే పంట వేసి ఆగమాగం కావొద్దు. డిమాండ్​ ఉన్న పంటలను వేసి లాభాలు పొందుదాం. దీనికి రైతులు సహకరించాలి” అని సూచించారు. పంటల సాగు ఎలా ఉండాలనేదానిపై జిల్లాల వారీగా కార్డులను ఇస్తామని  ఆయన ప్రెస్​మీట్​లో చెప్పారు. దీనిపై త్వరలోనే కలెక్టర్లు, జిల్లాల వ్యవసాయ అధికారులు, రైతు బంధు సమితుల చైర్మన్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ‘‘వానాకాలం, యాసంగి కలిపి ఈ ఏడాది రాష్ట్రంలో 1.23 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.  కాళేశ్వరం నీళ్లతోపాటు మంచి వర్షాలు ఉంటాయనే అంచనా కూడా ఉంది కాబట్టి వచ్చే ఏడాది 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు పండే అవకాశం ఉంది” అని చెప్పారు. ‘‘నియంత్రిత పంటల సాగు అమలుపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆలోచించింది. ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించాం. శాస్ర్తవేత్తలు, రైస్​మిల్లర్లు, వ్యాపారులతో చర్చించాం. తెలంగాణలో పండే పత్తి అద్భుతంగా ఉంటుంది’’ అని సీఎం చెప్పారు. ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలన్నారు. ‘‘షుగర్​ లెవల్​ తక్కువగా ఉండే తెలంగాణ సోనాకు మంచి గుర్తింపు ఉంది. దీన్ని ఈసారి 10 లక్షల ఎకరాల్లో సాగు చేయాలి. తెలంగాణ పంటలను హాట్​ కేకుల్లా కొనే పరిస్థితి రావాలి’’ అని అన్నారు.

ఫుడ్​ ప్రాసెసింగ్​ సెజ్​లు

రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్​ ప్రాసెసింగ్​ సెజ్​లు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. గోదాముల కెపాసిటీని 40 లక్షల టన్నులకు పెంచుతామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్​ స్టోరేజీని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా ఆవిర్భవిస్తోందని చెప్పారు. రాష్ట్రం ఈసారి రికార్డు స్థాయిలో 90 లక్షల టన్నుల బియ్యాన్ని పీడీఎస్​ కింద ఎఫ్​సీఐకి ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ‘‘రైతులు పండించిన మొత్తం పంటను దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వమూ కొనడం లేదు. మన ప్రభుత్వం కొంటున్నది. కరోనా కారణంగా రైతులకు ఇబ్బంది రావొద్దని 7 వేల కొనుగోలు కేంద్రాల్లో మొత్తం ధాన్యాన్ని కొన్నం” అని వివరించారు. ఏదో ఒక చానల్​ ద్వారా త్వరలో తాను రైతులతో ముఖాముఖి మాట్లాడుతానన్నారు.

70లక్షల ఎకరాల్లో పత్తి.. 40 లక్షల ఎకరాల్లో వరి

  •    ఈ వర్షాకాలంలో  70 లక్షల ఎకరాల్లో పత్తి, 40 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో కంది, 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు వేయాలి.
  •     నిజామాబాద్​, నిర్మల్​, జగిత్యాల, మహబూబాబాద్​ ప్రాంతంలో పసుపు వేస్తరు. దీన్ని 1.85 లక్షల ఎకరాల వరకు సాగు చేయవచ్చు.
  •    డోర్నకల్​, మహబూబాబాద్​, నర్సంపేట ప్రాంతాల్లో మిర్చి వేస్తరు. దీన్ని రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల్లో సాగు చేయొచ్చు.
  •    ఆదిలాబాద్​, నిజామాబాద్​ ఉమ్మడి జిల్లాల్లో 3.5‌0‌‌ లక్షల ఎకరాల వరకు సోయాబీన్​ వేస్తరు.
  •    చాలా చోట్ల మామిడి, బత్తాయి తోటలు ఉంటయి. ఇలా నియంత్రిత పద్ధతిలో సాగు చేయాలి.
  •    ప్రభుత్వం చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు రాదు.
  •    ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు అందేలా పంటల సాగు జరగాలి. ఎవరికీ నష్టం జరగొద్దు.

టెస్టులు చేయకుండా గ్రీన్ జోన్లుగా ఎలా మారుస్తరు?