పరిచయం: సంతోష్ ప్రతాప్

పరిచయం: సంతోష్ ప్రతాప్

మంచి హైట్, ఫిజిక్​తో అట్రాక్ట్ చేస్తాడు. నెగెటివ్​, పాజిటివ్​.. రోల్ ఏదైనా మెస్మరైజ్ చేస్తాడు. కానీ, వాటికంటే ముందు అతనికి పాపులారిటీ తెచ్చిపెట్టింది మాత్రం ఒక కుకింగ్ షో. ఈ ఇంట్రెస్టింగ్​ జర్నీ సంతోష్​ ప్రతాప్ ది. పేరుకి తమిళ యాక్టర్​ అయినా ‘సార్పట్టా’లాంటి డబ్బింగ్ మూవీ ‘ఓరి దేవుడా’ లాంటి రీమేక్​లతో తెలుగు ఆడియెన్స్​కి కూడా దగ్గరయ్యాడు. రీసెంట్​గా అంజలి లీడ్​ రోల్ చేసిన ‘ఫాల్’ వెబ్​ సిరీస్​లో డానియేల్ పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీస్​లతో బిజీ బిజీగా ఉన్న సంతోష్​ జర్నీ తన మాటల్లోనే...

‘‘నేను పుట్టింది చెన్నైలో. చిన్నప్పటి నుంచి స్టేజీ మీద నాటకాలు వేసేవాడిని. నాలుగో క్లాస్​లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం స్టేజీ మీద ‘అది అరబిక్ కడలందం..’ అనే పాటకు డాన్స్ వేశా. అప్పుడు నాకు ఎవరూ స్టెప్స్ నేర్పించలేదు. అంతకుముందు టీవీలో చూసిందే గుర్తుపెట్టుకుని డాన్స్ వేశా. దాంతో స్కూల్లో అందరూ షాక్​ అయ్యారు. ప్రిన్సిపల్ సర్ నన్ను పిలిచి, ‘నువ్వు సినిమాల్లోకి వెళ్తావ్ రా’ అన్నారు. పాటలు పాడడం, డాన్స్ చేయడం, మైమ్ యాక్షన్ వంటివి కూడా చేసేవాడిని. ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడి​కి వెళ్లి పర్ఫార్మ్​ చేసేవాడిని. వీటితోపాటు అథ్లెటిక్స్ అంటే చాలా ఇష్టం. నేను స్టేట్ లెవల్ అథ్లెట్​ని. ఇలా ఒకటి కాదు చాలా ఇంట్రెస్ట్​లు ఉన్నాయి. ఇంటర్​లో ఉన్నప్పుడు ఆర్ట్​ కాంపిటీషన్స్​లో కూడా పాల్గొనేవాడిని. స్విమ్మింగ్, స్కూబా డ్రైవింగ్​, రాక్ క్లైంబింగ్​ వంటివి చేసేవాడిని. ఇన్ని రకాల యాక్టివిటీస్ చేస్తుండడంతో ఫ్రెండ్స్, టీచర్స్ అందరూ నన్ను స్పెషల్​గా చూసేవాళ్లు. 

కుకింగ్ షోతో పాపులారిటీ

కుకింగ్ షోకి వెళ్లాలి అనుకోలేదు. సినిమాల్లోకి వెళ్లాలంటే ఎంతో కొంత పేరు తెచ్చుకోవాలి. అది కూడా  పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలి అనుకున్నా. ఫస్ట్ ‘కుకు విత్ కోమాలి’ పేరు విన్నప్పుడు అదే కామెడీ షో అనుకున్నా. కానీ, తర్వాత తెలిసింది కుకింగ్​ షో అని. సినిమాలు, టీవీ షో ఏదీ నాకు ఎఫెక్ట్ కాకూడదనుకున్నా. ఆ షో వాళ్లు నాకు ఫోన్ చేసినప్పుడు అక్కడ ఎవరూ తెలియదు. ఎలా? అనుకున్నా. ఆ తర్వాత నాతో పాటు ఇంకొక కో–పార్టిసిపెంట్​ ఉందని చెప్పారు. అప్పుడు ‘ఓకే చేయొచ్చు’ అని అక్కడికి వెళ్లా. 

ఆ సెట్​ అంతా చాలా హ్యాపీగా ఉండేది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆ షోని చాలా ఇష్టపడేవాళ్లు. వాళ్లతో కనెక్షన్ ఏర్పడింది ఆ షో వల్లే. షో బాగా సక్సెస్ అయింది. నేను షోలో పాట పాడినా, డాన్స్ చేసినా అందరూ అప్రిషియేట్ చేసేవాళ్లు. ఆడియెన్స్ కూడా ‘చాలా బాగా చేస్తున్నారు. మీకు ఇంత టాలెంట్ ఉంది అనుకోలేదు అనేవాళ్లు’. అప్పటి నుంచి నేను ఇంకాస్త ఓపెన్ ​అయ్యా. నాలో ఉన్న టాలెంట్స్ చూపించాలని బాగా ఎంటర్​టైన్ చేసేవాడిని. దాంతో చాలామంది నన్ను ఇష్టపడేవాళ్లు. ఆ షో నాకు మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా అయితే షూటింగ్​ ప్యాకప్​ అవ్వగానే ఎవరి పాటికి వాళ్లు వెళ్లిపోతారు. టీవీ షో అలా కాదు. స్కూల్లో ఫ్రెండ్స్​లా అందరం కలిసిపోతాం. నా కో– పార్టిసిపెంట్ రోషిణి నాకు బెస్ట్​ ఫ్రెండ్​ అయింది. దాంతో తను ఎలిమినేట్ అయినప్పుడు ఎమోషనల్​గా ఫీలయ్యా. 

సినిమాల్లోకి వెళ్లమని ఎవరూ చెప్పలేదు

మొదటి నుంచి నాకు కళలంటే బాగా ఇష్టమని అమ్మానాన్నలకు తెలుసు. కానీ, సినిమాల్లోకి వెళ్లమని మాత్రం వాళ్లు ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఈ ఫీల్డ్​లో ఎవరూ తెలియదు. బ్యాక్​గ్రౌండ్ లేదు. నా చదువుకి కూడా సినిమాకి సంబంధం లేదు. కాబట్టి సినిమా అనేది నా మైండ్​లో​ లేదు. మా చుట్టూ ఉన్న వాళ్లు కూడా పెద్ద పెద్ద చదువులు చదవమనే చెప్పేవాళ్లు. మా అక్క మైక్రో బయాలజీ చదివింది. నన్ను బయో టెక్ చేయమన్నారు. 

అయితే, అమ్మనాన్నలు, నేను అందరూ శాటిస్​ఫై అవ్వాలని ఎం.బి.ఎ. లాజిస్టిక్స్ చేశా. తర్వాత చెన్నైలోనే జాబ్ చేస్తూ మోడలింగ్​ కూడా మొదలుపెట్టా. చిన్న ఇనిస్టిట్యూట్​లలో ఆల్బమ్ సాంగ్స్ రికార్డింగ్ వీడియోల్లో చేసేవాడిని. అప్పటికీ మోడలింగ్​లో ఉంటే సినిమా అవకాశాలు వస్తాయో లేదో తెలియదు. అమ్మాయిలకు వచ్చినంతగా అబ్బాయిలకు అవకాశాలు రావు అనిపించింది. చెన్నై నుంచి దుబాయి​కి షిఫ్ట్ అవ్వాలనుకున్నా. విజిటింగ్ వీసా తీసుకుని, రోజూ ఫైల్ పట్టుకుని ఆఫీస్​లకు తిరిగేవాడిని. 

ఇక వీసా టైం అయిపోతుందనగా ఒక మంచి ఆఫర్​తో జాబ్ వచ్చింది. అప్పుడు ఆఫర్​ వాల్యూ నాకు అర్థమైంది. కానీ, అందులో నాకు జాబ్​లో శాటిస్​ఫ్యాక్షన్​ లేదనిపించింది. దాంతో మా నాన్నకు ఫోన్ చేసి ‘నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. నేను ఇంటికి వచ్చేస్తా’ అన్నా. నాన్న ‘వచ్చేయ్’ అన్నాడు. కానీ, సినిమాల్లో ప్రయత్నించమని ఆయనేం చెప్పలేదు. నేనే యాక్టింగ్​ని కెరీర్​గా ఎంచుకున్నా. అప్పట్నుంచీ సినిమా, అడ్వెంచర్ యాక్టివిటీ, ఫిట్​నెస్.. ఈ మూడింటి మీద ఇంట్రెస్ట్ పెట్టా. 

అదంత ఈజీగా రాదు

సినిమా యాక్టర్​కి చాలా ఫేమ్​ ఉంటుంది. స్పెషల్​గా ట్రీట్ చేస్తారు. కానీ, అదంత ఈజీగా రాదు. ఒక యాక్టర్​కి డ్రెస్సింగ్, లుకింగ్, వాకింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కరెక్ట్​గా ఉండాలి. అప్పుడే తెరపైన చూడాలనిపిస్తుంది. దానికోసం ఫిట్​నెస్ వర్కవుట్స్ చేయాలి. ఎప్పుడూ బోర్ కొట్టకుండా మంచిగా కనిపించాలి. వాటికోసం చాలా కష్టపడాలి. అందుకే యాక్టర్ లైఫ్​లో​ ఎంత డిసిప్లీన్​ ఉంటుందో చూపించడానికి ఇన్​స్టాలో నా ఫిట్​నెస్​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటా. చాలామంది నా వాయిస్ బాగుంది అంటారు. 

దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మా నాన్న జీన్స్. రెండోది నేను సింగర్​ని కావడం వల్ల ఎప్పుడూ వాయిస్ ప్రాక్టీస్​ చేస్తుంటా. యాక్టర్​కి వాయిస్​ కూడా చాలా ప్లస్ అవుతుంది. కొందరు స్టార్స్ పేర్లు చెప్పగానే వాళ్ల వాయిస్ గుర్తొస్తుంది. వాళ్లని ఇమిటేట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ల వాయిస్​నే ట్రై చేస్తారు. ఎందుకంటే అది వాళ్ల గుర్తింపు. 

బెస్ట్ ఎక్స్​పీరియెన్స్ 

నా ఫస్ట్ సినిమా ‘కథై తిరైకథై వాసనమ్ ఇయక్కమ్’ టీజర్ టీవీలో వచ్చేవరకు నేను సినిమాల్లో నటిస్తున్నా అని చాలామందికి తెలియదు. అది చూసి అందరూ నన్ను గుర్తుపడుతుంటే అప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ సినిమాలో అందరూ కొత్త యాక్టర్స్​ని తీసుకున్నారు. అయితే, అందులో విశాల్, ఆర్య, ఐశ్వర్య రాజేశ్, అమలాపాల్, భరత్, ప్రకాశ్ రాజ్, తాప్సీ, థమన్, విజయ్ సేతుపతి, శ్రీరామ్ వంటి చాలామంది స్టార్స్ గెస్ట్ రోల్​లో కనిపిస్తారు. అది నా లైఫ్​లోనే బెస్ట్ ఎక్స్​పీరియెన్స్. అలా 2014 నుంచి నా సినీ జర్నీ మొదలైంది. 

గుర్తుపట్టేసరికి టెన్షన్​ ఫీలయ్యా

నా ఫస్ట్ సినిమా ట్రైలర్ రిలీజ్​ అయ్యాక, ఒకసారి నేను వేరే సినిమా చూడ్డానికి థియేటర్​కి వెళ్లా. ఇంటర్వెల్​లో పాప్ కార్న్​ కొనుక్కుని లోపలికి వెళ్తుంటే, ఒకమ్మాయి వెనక నుంచి ‘కాట్రై కదలిరికి..’ అని పాడింది. వెంటనే వెనక్కి తిరిగి చూశా. తనకి నేనెలా తెలుసు? అని టెన్షన్ ఫీలయ్యా. తర్వాత అర్థమైంది.. థియేటర్లో ట్రైలర్స్ వేస్తారు కదా అని. అప్పటికే అక్కడున్న వాళ్లంతా నన్నే చూస్తున్నారు. అది బెస్ట్ ఫీలింగ్.’’ 
::: ప్రజ్ఞ

  •     ‘కుకు విత్ కోమాలి సీజన్​–3’కి ఛాన్స్ వచ్చినప్పుడే బిగ్​బాస్, సర్వైవర్​లో కూడా ఛాన్స్ వచ్చింది. అప్పుడు నెగెటివిటీ లేకుండా చూసుకోవాలి అని ఆలోచించి, కుకింగ్​ షో సెలక్ట్ చేసుకున్నా. అది నాకు చాలా మంచి పేరు తెచ్చింది. 
  •  నేను సినిమాల్లోనే కాదు.. యాడ్స్, టీవీ షోలు కూడా చేస్తా. ఎందుకంటే యాక్టర్​ అంటే వర్సటైల్​గా ఉండాలి అనుకుంటా. అందుకే సినిమాలు, సిరీస్​లలో కూడా ఏ క్యారెక్టర్​ ఇచ్చినా నచ్చితే చేస్తుంటా.    
  •  ‘యాజో ఇదు’ అనే లవ్ స్టోరీ, ‘మిస్టర్ తిరుమతి’ అనే ట్రాన్స్ లవ్ స్టోరీ వంటి షార్ట్ ఫిల్మ్స్ చేశా.   
  •  కార్తి సినిమా ‘దేవ్​’లో హరీశ్​గా, ఆర్య సినిమా ‘సార్పట్టా’లో రామన్​ అనే బాక్సర్​గా స్క్రీన్​ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది.
  •     ‘ఓ మై కడవులే’ సినిమాలో సెకండ్ లీడ్​గా నటించా. ఆ సినిమా​ తెలుగులో ‘ఓరి దేవుడా’గా రీమేక్ అయింది. అందులో కూడా ఆ పాత్ర నేనే చేశా. 
  •     2019లో పోలీస్ డైరీ 2.0 అనే వెబ్ సిరీస్​లో కథిర్​ అనే ఆఫీసర్​ రోల్​లో నటించా. 2021లో కురుత్తి కాలమ్, 2022లో ‘ఆనందం ఆరంభం’, కన కానుమ్ కళంగల్ సీజన్ – 2, అంజలి లీడ్​ రోల్​లో చేసిన ‘ఫాల్’ అనే సిరీస్​లలో నటించా.​  
  •     ఎవరైనా గొప్ప లీడర్స్, సినిమా స్టార్స్ వంటి వాళ్ల బయోపిక్​లో నటించాలనేది నా డ్రీమ్.
  •     ‘పిశాచి’ సినిమా రీమేక్ ‘పిసాసు –2 (తమిళం)’, ‘మేండమ్ వా అరుగిల్ వా’తోపాటు త్రిష లీడ్ రోల్​ చేసిన ‘ది రోడ్’ అనే సినిమాలు చేస్తున్నా.