ఇన్ఫోసిస్‌‌పై సెబీ దర్యాప్తు!

ఇన్ఫోసిస్‌‌పై సెబీ దర్యాప్తు!
  • ముందే ఎందుకు చెప్పలేదంటూ ప్రశ్నించిన బీఎస్‌‌ఈ
  • బుధవారం కోలుకున్న షేర్లు
  • డైరెక్టర్లపై జాతి పేరిట సీఈఓ వ్యాఖ్యలు ?

ముంబై: ఎన్‌‌ ఆర్‌‌ నారాయణ మూర్తి, నందన్‌‌ నీలెకన్ని వంటి ప్రమోటర్లు విజయవంతంగా దీర్ఘకాలం నడిపిన ఇన్ఫోసిస్‌‌ లిమిటెడ్‌‌లో ఇటీవలి వరస కార్పొరేట్‌‌ గవర్నెన్స్‌‌ వైఫల్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దిగ్గజంగా వెలుగొందుతున్న ఇలాంటి కంపెనీ చిన్న కంపెనీలకు ఆదర్శంగా నిలవాల్సిందిపోయి, ఆరోపణల బారిన పడుతుండటం విచారకరమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అకౌంటింగ్‌‌ ఆరోపణలు బైటకు రావడానికి ముందు నుంచి ఇన్ఫోసిస్‌‌ షేర్‌‌లో భారీగా పేరుకున్న డెరివేటివ్‌‌ పొజిషన్స్‌‌పై  సెక్యూరిటీస్‌‌ అండ్‌‌ ఎక్స్చేంజ్‌‌ బోర్డ్‌‌ ఆఫ్‌‌ ఇండియా (సెబీ) దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌‌ నవంబర్‌‌ సిరీస్‌‌లో భారీ డెరివేటివ్‌‌ పొజిషన్లతోపాటు,  పుట్‌‌ పొజిషన్లూ ఉన్నట్లు తెలిసింది. మంగళవారం భారీగా పతనమైన ఇన్ఫోసిస్‌‌ షేరు బుధవారం ట్రేడింగ్లో కోలుకుంది. 4 శాతం నష్టంతో ప్రారంభమైనా ఆ తర్వాత రికవరీతో 1.3 శాతం లాభంతో ట్రేడైంది. ఇన్ఫోసిస్‌‌ బోర్డు, యూఎస్‌‌ ఎస్‌‌ఈసీలకు విజిల్‌‌ బ్లోయర్‌‌ కంప్లైంటు బయటకు రావడంతో సోమవారం యూఎస్‌‌ మార్కెట్లోనూ, మంగళవారం ఇండియా మార్కెట్లోనూ ఇన్ఫోసిస్‌‌ షేర్ ధర భారీగా పడిపోయింది.

సెబీ దర్యాప్తు మొదలు…

ఈ కంప్లెయింటు తనకు రాకపోయినా, తనంతట తానుగానే ఈ అంశంలో విచారణకు సెబీ ముందుకు వచ్చింది. ఇన్ఫోసిస్‌‌ ఆడిట్‌‌ కమిటీ ఇప్పటికే ఈ విషయంలో దర్యాప్తును మొదలు పెట్టింది. అక్టోబర్‌‌ 11 న ఆడిట్‌‌ కమిటీ చర్చలు జరిపింది కూడా. ఈ మీటింగ్‌‌లో సీఈఓ, సీఎఫ్‌‌ఓలను  డైరెక్టర్లు ప్రశ్నించినట్లు సమాచారం.  ఇదే మీటింగ్​లో కొంత మంది డైరెక్టర్లను ఉద్దేశించి మదరాసీలు, డీవా (తమను తాము గొప్పగా భావించుకునే వాళ్లు)లుగా పరేఖ్‌‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారానికే దారి తీస్తున్నాయి.   జాతి పేరిట సీఈఓ చేసిన ఆ వ్యాఖ్యలు తీవ్రమైనవని, ఇండియాలోని పెద్ద కంపెనీలలోనూ కార్పొరేట్‌‌ గవర్నెన్స్‌‌ అంతంత మాత్రమేనని ఈ ఉదంతంతో వెల్లడవుతోందని నిపుణులు చెబుతున్నారు. జాతి పరమైన వ్యాఖ్యల విషయంలో ఇండియాలో సరైన చట్టాలూ లేవని పేర్కొంటున్నారు. ఆడిట్‌‌ కమిటీ దర్యాప్తు నివేదికను సెబీ కోరుతుందని, ఆ తర్వాతే చర్యలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. సీఈఓ, సీఎఫ్‌‌ఓలపై ఆరోపణలు వచ్చినట్లు ఇన్వెస్టర్లకు ముందుగా ఎందుకు తెలియచేయలేదనే అంశంపై   మరోవైపు బాంబే స్టాక్‌‌ ఎక్స్చేంజ్‌‌ కూడా బుధవారం నాడు ఇన్ఫోసిస్‌‌ నుంచి వివరణ కోరింది. లిస్టింగ్‌‌ ఆబ్లిగేషన్‌‌ అండ్‌‌ డిస్‌‌క్లోజర్‌‌ (ఎల్‌‌ఓడీఆర్‌‌) నిబంధనల కింద కంపెనీలో జరిగే ముఖ్యమైన పరిణామాలన్నింటినీ ఇన్వెస్టర్లకు స్టాక్‌‌ ఎక్స్చేంజ్‌‌ల ద్వారా తెలియపరచాల్సి ఉంటుంది. విజిల్‌‌ బ్లోయర్‌‌ లెటర్‌‌ బైటకు పొక్కినా, దానిని ఇన్వెస్టర్ల దృష్టికి తేవడంలో  ఇన్ఫోసిస్‌‌ విఫలమైంది. ఆరోపణలలో నిజా నిజాలు దర్యాప్తు తర్వాత తేలినప్పటికీ, ఆరోపణలు వచ్చిన అంశాన్ని తప్పకుండా తెలియచేయాల్సి ఉంది.

SEBI, BSE ask Infosys why it didn't disclose whistleblower complaints