నోరు మెదపని టెస్లా భారత్​కు రాకపై మౌనం

నోరు మెదపని టెస్లా భారత్​కు రాకపై మౌనం

న్యూ ఢిల్లీ : యూఎస్​ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా మనదేశానికి రావడంపై 'నిశ్శబ్దంగా' ఉంది.  కొత్త ఈవీ విధానం ప్రకారం ప్రభుత్వానికి తన భారతదేశ ప్రణాళికలను తెలియజేయలేదని ఒక అధికారి శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 21,-22 తేదీలలో భారతదేశాన్ని సందర్శించాల్సిన అమెరికన్ టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్, చివరి క్షణంలో "పలు బాధ్యతల" కారణంగా తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు.  

ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవాల్సి ఉంది. ఈవీ విధానం గురించి టెస్లా తమకు ఏమీ చెప్పలేదని సంబంధిత అధికారి స్పష్టం చేశారు. వాణిజ్య నిర్ణయాలను కంపెనీలే ప్రకటిస్తాయని అధికారి తెలిపారు. ఈ విషయమై టెస్లాకు పంపిన ఈ–-మెయిల్​కు సమాధానం లేదు. ప్రధాని మోదీతో భేటీ అవుతానని ఈ ఏడాది ఏప్రిల్​లో మస్క్​‘ఎక్స్​’లో రాశారు.

గత ఏడాది జూన్‌‌లో, మస్క్ మోదీతో అమెరికా పర్యటన సందర్భంగా సమావేశమయ్యారు.  టెస్లా త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, 2024లో భారతదేశాన్ని సందర్శించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో తనశాట్‌‌కామ్ వెంచర్ స్టార్‌‌లింక్‌‌తో పాటు టెస్లా దేశంలో వ్యాపారాన్ని మొదలుపెట్టే ప్రణాళికలను ప్రకటిస్తారని భావించారు.

భారతదేశంలో టెస్లా  యూనిట్‌‌ను నెలకొల్పేందుకు మస్క్ ప్రణాళికలను ప్రకటించి, బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టవచ్చంటూ వార్తలు వచ్చాయి. తాము టెస్లాతో మాట్లాడుతున్నట్టు పలు రాష్ట్ర ప్రభుత్వాలూ ప్రకటించింది.