కర్నాటకలో పొలంలో కుప్పకూలిన ట్రైనీ విమానం.. పైలట్, ట్రైనీ పైలట్‎కు తీవ్ర గాయాలు

కర్నాటకలో పొలంలో కుప్పకూలిన ట్రైనీ విమానం.. పైలట్, ట్రైనీ పైలట్‎కు తీవ్ర గాయాలు

బెంగళూర్: కర్నాటకలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రెడ్ బర్డ్ ఏవియేషన్‌కు చెందిన ప్రైవేట్ శిక్షణ విమానం ఆదివారం (ఫిబ్రవరి 8) విజయపుర జిల్లాలో కుప్పకూలింది. కలబురగి నుంచి బెళగావికి వెళ్తుండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్, ట్రైనీ పైలట్ ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

సమాచారం అందుకున్న సహయక బృందాలు ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. తీవ్రంగా గాయపడ్డ పైలట్, ట్రైనీ పైలట్‎ను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. విమానం పొలంలో కుప్పకూలగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో విమానం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ ప్రమాదం బబలేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఓ అధికారి మీడియాకు వెల్లడించారు. ప్రమాదానికి గురైన ట్రైనీ విమానం రెడ్ బర్డ్ ఏవియేషన్‎కు చెందినదని తెలిపారు. 

విమానం కలబురగి నుంచి బెళగావికి వెళుతుండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి అకస్మాత్తుగా కూలిపోయిందని చెప్పారు. ప్రమాద సమయంలో ఫ్లైట్ లో ఇద్దరు ఉన్నారని.. వారిని పైలట్, ట్రైనీ పైలట్ గా గుర్తించామని తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.