ముంబై సెంట్రల్ రైల్వే లోకల్ ట్రైన్‌లో ఒక వ్యక్తి బురఖా ధరించి మహిళల కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే పోలీసులు (RPF) కేసు బుక్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం CSMT వైపు వెళ్తున్న ఫాస్ట్ లోకల్ ట్రైన్‌లో ఒక వ్యక్తి బురఖా ధరించి మహిళల కోచ్‌లోకి ఎక్కాడు. అయితే, అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన మహిళా ప్రయాణికులు అతన్ని నిలదీశారు. అలాగే ఆ వ్యక్తిని గట్టిగా ప్రశ్నించి, బురఖా తీసి చూడగా అతను పురుషుడని తేలింది. దీంతో తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
మహిళలు ఆ వ్యక్తిని ఫోన్లలో రికార్డ్ చేస్తూ పోలీసులకు అప్పగిస్తామని బెదిరించారు. దింతో భయపడిన ఆ వ్యక్తి, ట్రైన్ ఆగకముందే పట్టాల మీదకు దూకి తప్పించుకున్నాడు.
ట్రైన్లోని ప్రయాణికులు వెంటనే ఈ విషయాన్ని ఘట్కోపర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్టేషన్ వద్ద సోదాలు చేసినా, సీసీటీవీ ఫుటేజీలు చెక్ చేసినా నిందితుడు అప్పటికే తప్పించుకోవడంతో ఆచూకీ దొరకలేదు. మహిళల కోచ్‌లో ప్రవేశించినందుకు రైల్వే చట్టం కింద ఆర్‌పిఎఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
