Anil Ravipudi : ‘విత్ లవ్’ మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసలు.. ఆ డైరెక్టర్‌కు అదిరిపోయే ఫ్యూచర్ ఉందంటూ పోస్ట్!

Anil Ravipudi : ‘విత్ లవ్’ మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసలు.. ఆ డైరెక్టర్‌కు అదిరిపోయే ఫ్యూచర్ ఉందంటూ పోస్ట్!

టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు అనిల్ రావిపూడి ఒక సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడారంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ ఉండే ఉంటుంది. లేటెస్ట్ గా ఆయన కోలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో సందడి చేస్తున్న ‘విత్ లవ్’ (With Love) చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చూసిన అనిల్, సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకుంటూ చిత్ర యూనిట్‌ను ఆకాశానికెత్తేశారు.

అనిల్ రావిపూడి ఏమన్నారంటే?

ఇటీవలి కాలంలో వచ్చిన అత్యంత ఆహ్లాదకరమైన, చక్కని రొమాంటిక్ కామెడీ ఇదని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. సాధారణంగా డబ్బింగ్ సినిమాల్లో డైలాగులు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ ఈ చిత్రంలో తెలుగు డైలాగులు చాలా సహజంగా, సందర్భోచితంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. ముఖ్యంగా దర్శకుడు మదన్ మేకింగ్ స్టైల్ చూస్తుంటే ఆయనకు దర్శకుడిగా గొప్ప భవిష్యత్తు ఉందని అనిల్ ఆకాంక్షిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు..

మ్యాజిక్ ఎక్కడ ఉందంటే?

గతంలో తాము గాఢంగా ప్రేమించిన వ్యక్తులకు ప్రపోజ్ చేయలేకపోయిన ఇద్దరు వ్యక్తులు.. మళ్ళీ కొన్నేళ్ల తర్వాత ఒకరినొకరు కలిస్తే వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ తమ నటనతో ప్రాణం పోశారని, వారి మధ్య కెమిస్ట్రీ సినిమాకు వెన్నెముక అని అనిల్ ప్రశంసించారు. షాన్ రోల్డన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను ఎలివేట్ చేశాయని ఆయన తెలిపారు.


ఈ చక్కని సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడంలో రానా దగ్గుబాటి, సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ కీలక పాత్ర పోషించాయి. నిర్మాత సౌందర్య రజనీకాంత్ నిర్మాణ విలువలు సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయని అనిల్ రావిపూడి అభినందనలు తెలిపారు.. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా యూత్,రొమాంటిక్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు 'విత్ లవ్' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని అనిల్ రావిపూడి మాటలతో స్పష్టమవుతోంది.